పోటాపోటీగా ప్రత్యేక దర్శన టికెట్లను పొందిన భక్తులు

ABN , First Publish Date - 2022-02-25T01:01:10+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి 8.40 లక్షల టికెట్ల కోటా బుకింగ్‌ పూర్తయింది. కొవిడ్‌ కేసుల నేపథ్యంలో చాలామంది

పోటాపోటీగా ప్రత్యేక దర్శన టికెట్లను పొందిన భక్తులు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి 8.40 లక్షల టికెట్ల కోటా బుకింగ్‌ పూర్తయింది. కొవిడ్‌ కేసుల నేపథ్యంలో చాలామంది భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమైన విషయం తెలిసిందే. కరోనాకు భయపడి చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను సడలించాయి. దీంతో టీటీడీ కూడా ప్రస్తుతం 12వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25 వేలకు పెంచింది. ఫిబ్రవరి నెల అదనపు కోటాతో పాటు, మార్చి నెలకు సంబంధించి మొత్తం 8.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాటిని బుక్‌ చేసుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. టికెట్ల బుకింగ్‌ వరకు బాగానే జరిగినప్పటికీ పేమెంట్‌ గేట్‌వేలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో అధికారులు  సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రికి అన్ని టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. వీటితో పాటు తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇచ్చే టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్‌ల సంఖ్యను కూడా 20 వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం నుంచి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరగనుంది.ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-25T01:01:10+05:30 IST