ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-04-18T01:17:43+05:30 IST

ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం వారాంత సెలవు కావడంతో కాళేశ్వర పుష్కర ఘాట్లకు పుణ్యస్నానానికి ఐదో రోజు భారీగా తరలివచ్చారు.

ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

మహాదేవపూర్‌: ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం వారాంత సెలవు కావడంతో కాళేశ్వర పుష్కర ఘాట్లకు పుణ్యస్నానానికి ఐదో రోజు భారీగా తరలివచ్చారు. లక్ష మందికి పైగా హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయమే కాళేశ్వరానికి చేరుకున్న భక్తులు ప్రాణహిత నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. పిండ ప్రదానాలు, పిత్రు తర్పణాలు చేస్తూ ప్రాణహితకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర  స్వాముల దర్శనానికి క్యూ కట్టారు. వేసవి దృష్ట్యా అధికార యంత్రాంగం కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. పుష్కరఘాట్ల వద్ద చలవ పందిళ్లు లేక ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు కూడా సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముక్తీశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కనీసం తాగునీటిని కూడా అధికారులు అందుబాటులో ఉంచడం లేదు. ఒకటి, రెండు రంజన్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. 

Updated Date - 2022-04-18T01:17:43+05:30 IST