యాదాద్రిలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2022-02-28T01:24:51+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం కన్పించింది.

యాదాద్రిలో భక్తుల కోలాహలం

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం కన్పించింది. వారాంతం సెలవురోజు, ఏకాదశి పర్వదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. దీంతో కొండపైన బాలాలయ పరిసరప్రాంతాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో యాత్రాజనుల రద్దీ వాతావరణం నెలకొంది. బాలాలయంలో కొలువుదీరిన కవచమూర్తుల దర్శనానికి దర్శన క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. స్వామివారి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయంపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో యాత్రికులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి వేకువజామునే సుప్రభాతంతో నిత్య పూజలు ఆరంభించిన ఆచార్యులు బాలాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు.

Updated Date - 2022-02-28T01:24:51+05:30 IST