వేములవాడకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-01-25T06:39:45+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ‘హరహర మహదేవ.. శంభో శంకర’ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

వేములవాడకు పోటెత్తిన భక్తులు
స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

- సుమారు 70 వేల మంది భక్తుల రాక 

వేములవాడ టౌన్‌, జనవరి 24 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ‘హరహర మహదేవ.. శంభో శంకర’ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  మేడారం సమ్మక్క జాతర సమీపిస్తున్న తరుణంలో ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  ఆదివారం అర్ధరాత్రి నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లలో బారులుదీరారు. పార్వతీపరమేశ్వరులను దర్శించుకొని తరించారు. ధర్మదర్శనం కోసం క్యూలైన్‌లో బారులుదీరిన భక్తులకు  4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టింది. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందకు క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షంచారు. క్యూలైన్‌లలో తాగు నీటి వసతి లేకపోవడంతో  ఇబ్బందులకు గురయ్యారు. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మైక్‌ ద్వారా తెలియజేవారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతీ ద్వారం వద్ద శానిటైజర్‌ స్టాండ్‌ ఏర్పాటు చేశారు. భక్తుల టెంపరేచర్‌ పరీక్షించిన  అనంతరం ఆలయంలోకి అనుమతించారు.  సోమవారం కావడంతో సుమారు 70 వేల మంది వరకు భక్తులు తరలివచ్చినట్లు, సుమారు  25 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనావేశారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ఈవో రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-25T06:39:45+05:30 IST