శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-08-16T06:35:15+05:30 IST

శ్రీశైల క్షేత్రానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం, ఆగస్టు 15: శ్రీశైల క్షేత్రానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రావణ మాసం, వరుస సెలవులు రావడంతో క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సంఖ్య అధికారుల అంచనాలకు మించి ఉంది. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామఅమ్మవార్ల దర్శనార్థం ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు దీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను, స్వామివారి సామూహిక అభిషేకం నిర్వహించుకునే భక్తులకు కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. సోమవారం స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది.  భక్తుల రద్దీతో క్షేత్ర వీధులన్నీ కిక్కిరిశాయి. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను తెరచి నీటిని విడుదల చేస్తుండడంతో డ్యాం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.

 శ్రీశైలంలో భారీగా అంతర్గత బదిలీలు

శ్రీశైల దేవస్థానంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. వివిధ విభాగాల నందు పని తీరు మెరుగు కోసం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 50 మంది శాశ్వత, పొరుగు సేవల సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది వారికి కేటయించిన విధులలో వెంటనే రిపోర్టు చేయాలని ఈవో ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2022-08-16T06:35:15+05:30 IST