ఊరంతా జాతర

ABN , First Publish Date - 2022-05-18T07:55:03+05:30 IST

తిరుపతి జాతరకు చాటింపు అనంతరం వివిధ వేషాల్లో మునిగితేలిన గంగమ్మకు మంగళవారం ఉదయాత్పూర్వం విశిష్ట అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు.

ఊరంతా జాతర
ప్రత్యేక అలంకరణలో గంగమ్మ




జాతర సంబరంలో తిరుపతి మునిగితేలింది. గంగమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. అంబళ్లు పోసి తాపం తీర్చింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని తన్మయత్వమైంది. భక్తి పారవశ్యంతో చిందేసింది. 


తిరుపతి, మే 17 (ఆంధ్రజ్యోతి):తిరుపతి జాతరకు చాటింపు అనంతరం వివిధ వేషాల్లో మునిగితేలిన గంగమ్మకు మంగళవారం ఉదయాత్పూర్వం విశిష్ట అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సర్వాలంకార శోభితమైన గంగమ్మకు అర్చకులు వజ్రకిరీటధారణ చేశారు. అనంతరం సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. అర్ధరాత్రి నుంచే కొందరు భక్తులు పొర్లుదండాలు పెట్టుకుంటూ, వేపాకు చీరలు కట్టుకుని, వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి అభిషేక పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాయల కోసం ఎగబడ్డారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోనే  కాకుండా టీపీ ఏరియాలో తాళ్లపాక పెదగంగమ్మ, చింతల చేనులో ముత్యాలమ్మ,  దాసరిమఠంలో మాతమ్మ, పల్లెవీధిలో వేశాలమ్మ, చింతకాయలవీధిలో కరిమాను గంగమ్మ, నేరేళ్లమ్మతో పాటు నగరంలో వున్న వీధి గంగమ్మ ఆలయాల్లో కూడా జాతర సంబరాలు ఘనంగా జరిగాయి.పలువురు భక్తులు పౌరాణిక, జానపద వేషాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసారి జాతరలో సప్పరాలు ధరించిన భక్తులు పెద్దఎత్తున కనిపించారు.    


 అమ్మకు పొంగళ్లు.. భక్తులకు అంబళ్లు

 సోమవారం అర్ధరాత్రి నుంచే మహిళా భక్తులు మార్కెట్‌లోని ఖాళీస్థలంలో పొంగళ్లు పొంగించారు, మరికొందరు ఇంటివద్దనే పొంగలి చేసుకుని అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి నైవేద్యం సమర్చించారు. ఇక ఇంటినుంచి తెచ్చుకున్న అంబళ్లను భక్తులను అందజేశారు.  జంతుబలులు కూడా ఈసారి పెద్దఎత్తున జరిగాయి. 

 విశ్వరూప దర్శనంకోసం భక్తుల ఎదురుచూపు

తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం పెద్దఎత్తున భక్తులు అర్థరాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో కనిపించారు. బుధవారం ఉదయాత్పూర్వం పేరంటాళ్లు చెంప నరుకుడుతో జాతర వేడుక పరిసమాప్తమవుతుంది. 






Updated Date - 2022-05-18T07:55:03+05:30 IST