అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు
అనకాపల్లి టౌన్, మే 22: నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి తెల్లవారుజామున ఆరు గంటలకే ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వరకు ఆలయానికి వచ్చే మార్గాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులు కుటుంబ సమేతంగా వంటలు తయారుచేసి అమ్మవారికి నైవేధ్యం పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు అమ్మవారి పండగను చేసుకొని ఘటాలను అమ్మవారికి సమర్పించారు. క్యూలైన్‌లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఈవో నగేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా తాండవకృష్ణ, నృత్య సంగీత సేవా అకాడమీ నాట్యాచారిణి ఉదయశ్రీ శిష్య బృందం, వరంగల్‌కు చెందిన కూచిపూడి నృత్యాలయం, కాకినాడ ఈషా ఫైనార్ట్స్ అకాడమీ, విశాఖపట్నం నాట్యాచారిణి మంజుశ్రీ శిష్యబృందాల సభ్యుల 180 మంది చిన్నారులతో నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.