అంతర్వేది రణరంగం

ABN , First Publish Date - 2020-09-09T09:31:10+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతిపై భక్తులు, హిందూ, ఆధ్యాత్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఘటనాస్థలిని పరిశీలించేందుకు మంగళవారం అంతర్వేదికి

అంతర్వేది రణరంగం

  • మంత్రులపై దాడికి భక్తుల యత్నం
  • కాన్వాయ్‌పై రాళ్లు.. ఎస్కార్టు జీపు ధ్వంసం
  • రథం ఆహుతిపై హిందూ సంఘాల ఆందోళన
  • వెలంపల్లి, విశ్వరూప్‌, వేణులకు చేదు అనుభవం
  • భద్రతావలయాన్ని ఛేదించి చొచ్చుకొచ్చిన భక్తులు
  • గుడి వెనుక నుంచి అమాత్యుల తరలింపు
  • 15లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • లేదంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం
  • మంత్రులకు వీహెచ్‌పీ అల్టిమేటం

అమలాపురం/అంతర్వేది/అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతిపై భక్తులు, హిందూ, ఆధ్యాత్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఘటనాస్థలిని పరిశీలించేందుకు మంగళవారం అంతర్వేదికి వచ్చిన ముగ్గురు మంత్రుల బృందంపై అక్కడున్న వేల మంది భక్తులు ఉగ్రరూపం చూపించారు. వారి ఉగ్రరూపంతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలపై దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వామివారి దివ్యరథం ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి దాటాక అనుమానాస్పద స్థితిలో కాలిబూడిదైన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిని చూడడానికి పై ముగ్గురు మంత్రులు అంతర్వేది ఆలయానికి చేరుకున్నారు.


తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రథం తగులబడిన ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌, మరికొందరు ఆధ్యాత్మిక సంఘాల నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. మంత్రులు ఓపక్క వివరణ ఇస్తుండగానే.. అప్పటికే ఆలయ మాడ వీధుల్లోకి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోపోద్రేకంతో కొపనాతి కృష్ణమ్మ విగ్రహం వద్ద ఉన్న బారికేడ్లను ధ్వంసంచేసి ఆలయం వెలుపల ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చారు. మంత్రులు పరిస్థితిని గమనించి బందోబస్తు నడుమ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు మరింత కోపంతో వారిపై దాడికి ప్రయత్నించారు.


దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అతికష్టమ్మీద మంత్రులను ముఖద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసు ఎస్కార్ట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఆలయం లోపల వీహెచ్‌పీ, ఇతర సంఘాల నాయకులతో మంత్రులు సమావేశమై చర్చించారు. ఈ నెల 15వ తేదీలోగా నిందితులను గుర్తించి చర్యలు చేపట్టకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ఆధ్యాత్మిక సంఘాల తరపున వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌ మంత్రుల బృందానికి అల్టిమేటం ఇచ్చారు. బయట పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు కొన్ని గంటల తర్వాత ఆలయం వెనక నుంచి భారీ భద్రత నడుమ మంత్రులను పంపించారు.


ఎక్కడికక్కడ అడ్డుకున్నా..

మంత్రుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని దిండి-చించినాడ, బోడసకుర్రు-పాశర్లపూడి వంతెన, మలికిపురం సెంటర్‌లో పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటుచేసి ఆందోళనకారులు అంతర్వేది వైపు వెళ్లకుండా నిరోధించారు. అయినప్పటికీ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌, హైందవశక్తి, హిందూచైతన్యవేదిక, ధర్మవీర్‌, ఆధ్యాత్మిక వేదిక వంటి సంఘాల ఆధ్వర్యంలో వేల మంది భక్తులు తరలిరావడంతో అంతర్వేది ఆలయ ప్రాంగణం రణక్షేత్రంగా మారింది. వారు సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పీఠాధిపతి శివస్వామిజీ, ఉజ్జయిని ఉపప్రముఖ్‌ రాజ్‌నాథ్‌ అఘోర ఆధ్వర్యంలో భక్తులు నిరసన తెలిపారు. 


ఈవో బదిలీ, సస్పెన్షన్‌.. ఇద్దరు ఉద్యోగులపైనా వేటు.. 

రథం దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయిలో విచారణ చేపడుతుందని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఇప్పటికే ఇన్‌చార్జి ఈవో చక్రధరరావును బదిలీ చేశామని.. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్యామ్‌సుందర్‌, ఆలయ గూర్ఖా రేవంత్‌ బహుదూర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ఇన్‌చార్జి ఈవో చక్రధరరావును సస్పెండ్‌ చేసినట్లు దేవదాయ శాఖ ప్రకటించింది. రథం దగ్ధం ఘటనలో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమైందని తెలిపింది..


అవి పిచ్చివాళ్ల దాడులా? 

ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తంచేశారు. దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పిచ్చివాళ్లు చేస్తున్న దాడులుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే, ప్రభుత్వం పట్ల అంతే కఠినంగా బీజేపీ వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. 


హారతులతో నిరసన: పవన్‌ 

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న దేవతా విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలపై రాష్ట్రంలోని ఆడపడుచులంతా స్పందించాలని, ఈ ఘటనలకు వ్యతిరేకంగా మంగళ, శుక్రవారాల్లో హారతులతో నిరసనలు తెలపాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రథాల దహనాలు యాదృచ్ఛికంగా జరిగాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


సీబీఐతో విచారణ జరపాలి: లోకేశ్‌

‘ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించినవారే ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలున్నాయి. అందుకే రథం దహనం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని టీడీపీ నేత నారాలోకేశ్‌ డిమాండ్‌ చేశారు. 


సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ

రథం ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు. 

Updated Date - 2020-09-09T09:31:10+05:30 IST