యాదాద్రి క్షేత్రంలో భక్తజన సందడి

ABN , First Publish Date - 2021-11-30T07:05:47+05:30 IST

పవిత్ర కార్తీకమాస చివరి సోమవారం కావడంతో యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు.

యాదాద్రి క్షేత్రంలో భక్తజన సందడి
నిత్యకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు


యాదాద్రి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పవిత్ర కార్తీకమాస చివరి సోమవారం కావడంతో యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. స్వామివారికి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో  శ్రీసుదర్శన నారసింహ మమాయాగం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం నిత్యకళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యానాన్ని తిలకించారు. మహిళలు క్షేత్రంలో దీపారాధన చేపట్టి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పరమశివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి వారికి నిత్యఆదాయం రూ. 24.96లక్షల సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రిశుడిని రాష్ట్ర సమాచార శాఖ చీఫ్‌ కమిషన్‌ బుద్ద మురళి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 

విమానగోపురం బంగారం తాపడానికి విరివిగా విరాళాలు

యాదాద్రి టౌన్‌ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం బంగారు తాపడం నిమిత్తం భక్తులు విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నవతేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బంజారాహిల్స్‌కు అధినేత గుండ్ర యాదగిరి రూ.500,449, యాదగిరిగుట్టకు చెందిన సుడుగు జీవన్‌రెడ్డి రూ.1,00,116, ఉపప్రధాన ఆలయ సిబ్బంది తరపున సురేంద్రచార్యులు రూ.11,116లను చెక్కుల రూపంలో ఈవో గీతకు అందజేశారు. 

Updated Date - 2021-11-30T07:05:47+05:30 IST