నాటు సారా తయారీ నుంచి అభివృద్ధి బాటలో

ABN , First Publish Date - 2022-05-02T06:01:51+05:30 IST

నాటు సారా తయారీ నుంచి అభివృద్ధి బాటలో ప్రయనిస్తున్న ఆ తండా. గుడుంబా తయారీపైనే ఆధారపడిన ప్రజలు ప్రభుత్వ చొరవ, మంత్రి ప్రోత్సాహంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ(జెర్రిపోతుల)తండాలో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమలా చేపట్టేవారు.

నాటు సారా తయారీ నుంచి అభివృద్ధి బాటలో
నంగునూరు మండలంలోని జేపీ తండా

జేపీ తండా లంబాడాల ఆత్మగౌరవ ప్రస్థానం

ఉపాధి మార్గాలతో మార్పునకు నాంది

గ్రామ పంచాయతీగా ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు


నంగునూరు, ఏప్రిల్‌ 1: నాటు సారా తయారీ నుంచి అభివృద్ధి బాటలో ప్రయనిస్తున్న ఆ తండా. గుడుంబా తయారీపైనే ఆధారపడిన ప్రజలు ప్రభుత్వ చొరవ, మంత్రి ప్రోత్సాహంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ(జెర్రిపోతుల)తండాలో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమలా చేపట్టేవారు. పురుషులు గుడుంబా తయారుచేస్తే మహిళలు విక్రయించేవారు. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల దాడులతో ఎప్పుడూ అలజడిగా ఉండేది. తండాలో సారా తాయరీ కేసులేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు! పలువురు జైలుకు కూడా వెళ్లివచ్చేవారు. బడికి దూరంగా పిల్లలు, కేసులతో తల్లిదండ్రులు తల్లడిల్లేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ తండావాసుల బతుకుల్లో మార్పు వచ్చింది. 


భరోసాతో మార్పునకు నాంది

గుడుంబా తయారీకి నిలయంగామారిన జెర్రిపోతుల తండాలో మార్పు అసాధ్యమని ఒక దశలో అధికారులు సైతం చేతులెత్తేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు గ్రామ మహిళలు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక గుడుంబా నిర్మూలనకు సీఎం కేసీఆర్‌ చొరవతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జేపీ తండాలో గుడుంబా నివారించాలని మంత్రి హరీశ్‌రావు సంకల్పించారు. ఎంత చెప్పినా పురుషుల్లో మార్పు మార్పు రావడంలేదని గుర్తించిన మంత్రి, మహిళల్లో చైతన్యం తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించారు. యువత, విద్యార్థుల సాయంతో ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. పలుమార్లు గ్రామానికి వెళ్లి గుడుంబాతో జరుగుతున్న నష్టాన్ని మహిళలకు వివరించారు. కేసులతో కుటుంబాలు విచ్చిన్నమవుతున్న పరిస్థితిని తెలియజేశారు. తీరు మార్చుకుంటే ఉపాధి చూస్తామని భరోసా కల్పించారు. 


ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి

తండాలొ మహిళలెవరూ పెద్దగా చదువు కోలేదు. అయినా తమ కుటుంబాలను మార్చుకోవాలనుకున్నారు. సమాజంలో గౌరవంగా బతకాలని, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. మహిళలంతా ఏకమై గుడుంబా సరఫరా చెయ్యొద్దని నిర్ణయించారు. సారా తయారీని ఆపేయాలని తమ భర్తలకు నచ్చజెప్పారు. చదువు లేక పిల్లల జీవితాలు నాశనమవుతున్న తీరును వివరించే ప్రయత్నం చేశారు. దీంతో పురుషుల ఆలోచనలో కూడా మార్పువచ్చింది. ఉపాధి కల్పిస్తామన్న మంత్రి మాటలు వారిలో కదలిక తెచ్చాయి. దీంతో గ్రామంలో పురుషులంతా సారా తయారీని వదిలేశారు. వీరిలో కొందరు బ్యాంకు లోన్లతో కొందరికి ఉపాధి పొందుతున్నారు. మరికొందరు డెయిరీ, వ్యవసాయం, కూరగాయల వ్యాపారం వైపు మళ్లారు. 


మంత్రి హరీశ్‌రావు మాటలతో మార్పు : భిక్షపతి నాయక్‌, సర్పంచ్‌, జేపీతండా

సారా తయారీని వదిలేస్తే ఉపాధి కల్పిస్తామన్న మంత్రి హరీశ్‌రావు మాటలతో తండావాసుల్లో మార్పు వచ్చింది. గుడుంబా తయారీ నిలిపివేసినందున స్వయంఉపాధి కోసం ప్రభుత్వం రూ.2 లక్షలు అందజేసింది. గేదెలు, కిరాణాషాపులు పెట్టుకున్నారు. తండాలో ఇప్పుడు పోలీసుల దాడులు, కేసుల భయం పోయింది. మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం.

Updated Date - 2022-05-02T06:01:51+05:30 IST