అదే బ్రహ్మం.. ఆత్మ చైతన్యం

ABN , First Publish Date - 2020-08-04T09:18:34+05:30 IST

నిత్యం మనం నిద్రపోయినప్పుడు మనలో ఉండే ‘అహం’వృత్తి లయించిపోయినప్పటికీ.. ఏ ‘నేను’.. అంటే పరమపూర్ణ సద్రూపమైన ‘ఆత్మ’ లయించకుండా ఉంటున్నదో ఆ నేనే ‘అహం’ అని

అదే బ్రహ్మం.. ఆత్మ చైతన్యం

  • ఇదమహంపదా భిఖ్యమన్వహం
  • అహమిలీనకే ప్యలయ సత్తయా

నిత్యం మనం నిద్రపోయినప్పుడు మనలో ఉండే ‘అహం’వృత్తి లయించిపోయినప్పటికీ.. ఏ ‘నేను’.. అంటే పరమపూర్ణ సద్రూపమైన ‘ఆత్మ’ లయించకుండా ఉంటున్నదో ఆ నేనే ‘అహం’ అని చెప్పబడుతోందని ఈ శ్లోకం అర్థం. భగవాన్‌ రమణ మహర్షి లోకానికి అందించిన 31 శ్లోకాల ఆత్మ జ్ఞాన గ్రంథం ‘ఉపదేశ సారం’లోని 21వ శ్లోకమిది. ‘అహం’ భావన పడిపోయినా ఏది లయించకుండా ఉంటుందో అదే ‘నేను’ అని రమణులు చెప్పారు. కానీ, ఆ రెండింటికీ తేడా ఏమిటి? అంటే.. నిద్రలో ఉన్నప్పుడు లయించేది ‘అహం’ భావన మాత్రమే. ఇక్కడ చెప్పింది ‘అహం’. ఈ అహమే అసలైన తాను. ‘అహం’ భావన అజ్ఞానంలో పూఉట్టింది. అహం ఎల్లప్పుడూ జ్ఞానంలో ఉండేది. ‘అహం’ భావన అనేక ఇదం భావనల పుట్టుకకు ఆధారమవుతుంద. అసలైన అహం అనేది ఏ భావనలూ లేని భావ శూన్య సద్భావ స్థితి. ‘అహం’ భావన.. జ్ఞానంతో నశించిపోయేది. అహం నాశనం లేనిది. చావుపుట్టుకలు లేని నిత్యసత్యమది. ‘అహం’ భావన.. కర్తృత్వం, భోక్తృత్వం, ప్రమాతృత్వం (నేను తెలుసుకుంటున్నాను) అనే వాటిని తనకు ఆపాదించుకుంటుంది. అసలైన ‘నేను’కు అవేవీ ఉండవు. ఈ అహం కేవలం నిర్లిప్తం. ‘అహం’ భావన జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కోవడానికి కారణమవుతుంది. అహానికి చావుపుటుకలు ఉండవు.


అది నిత్యం, శాశ్వతం. ఈ అహాన్నే రమణ మహర్షి ‘తాను’ అని పలికేవారు. ఒకసారి రమణ మహర్షి వద్దకు ఒక తల్లి తన బిడ్డతో సహా వచ్చింది. ఆ పాప రమణులను చూసి ‘తాతా’ అని పిలిచింది. అప్పుడా తల్లి.. ‘తప్పు, అలా అనకూడదు’ అని బిడ్డను మందలించింది. అందుకు మహర్షి.. ‘ఎందుకు కోప్పడతావు? నీ బిడ్డ అన్నదాంట్లో తప్పేముంది? నీ పాప అసలు సత్యాన్నే చెప్పింది. తా తా అంటే తాను తానే అనే! అహం భావన పడిపోతే మిగిలేది తా తానే’ అన్నారు. పూర్వకాలంలో బుర్ర కథలు మీరు వినే ఉంటారు. ‘తందానా తాన తందనానా’ అని పాడేవారు. ‘తాను తానే తాన్‌ తానే తానే తాన్‌ తానే’ అనే పదాలు కలిసిపోయి అలా ‘తందానే తాన తందనానే’ అయ్యాయంతే. అది బుర్ర కథ కాదు. నిజంగా బుర్ర ఉన్నవారి కథ. బుర్రలోని కథ. బుర్రలో ఉండాల్సిన కథ.


మనస్సులోని సమస్త సంకల్ప, వికల్పాలు ఆగిపోయిన తర్వాత వాటిని తయారుచేసిన ‘అహం’ భావన కూడా నశించిపోయాక హృదయాకాశం నిర్మలంగా ఉంటుంది. ఏకంగా, అద్వయంగా, అఖండంగా, కేవలంగా, సత్‌ రూపంగా, చిత్‌ రూపంగా, ఆనంద స్వరూపంగా సమస్తం తానే అయి భాసిస్తుంది. అదే సచ్చిదానంద స్వరూప ఆత్మచైతన్యం. అదే బ్రహ్మం. అప్పటిదాకా కర్తగా, భోక్తగా ప్రమాతగా ఉన్న ‘అహం’ భావన.. అన్ని భావనలను, అస్తిత్వాన్ని పోగొట్టుకొని కేవల ‘అహం’గా, ‘తాను’గా.. ఆత్మగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి చూస్తూ ఈ జగత్తు, జీవులూ ఎలా కనపడతారు? ఆ సద్రూప చైతన్యంలో ఏముంది? ఈ విషయాలను రమణులు తదుపరి శ్లోకంలో వివరించారు.


 దేవిశెట్టి చలపతిరావు, , care@srichalapathirao.com

Updated Date - 2020-08-04T09:18:34+05:30 IST