‘హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుదనే.. మూడు రాజధానులకు మద్దతు’

ABN , First Publish Date - 2020-02-25T10:53:34+05:30 IST

అధికార వికేంద్రీకరణకు మద్దతునిస్తున్న వారంతా రాష్ట్ర ద్రోహులేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

‘హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుదనే.. మూడు రాజధానులకు మద్దతు’

నందిగామ/కృష్ణా(ఆంధ్రజ్యోతి): అధికార వికేంద్రీకరణకు మద్దతునిస్తున్న వారంతా రాష్ట్ర ద్రోహులేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం నందిగామలో జేఏసీ ఆధ్వర్యలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతుగా నందిగామ శాసనసభ్యుడు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు సిగ్గు, ఎగ్గు లేకుండా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించడం అత్యంత హేయమన్నారు.


అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో తన కుమారుడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుదన్న భయంతో ఆయన మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు. ఇక్కడ ప్రజల ఓట్లతో అసెంబ్లీకి వెళ్లిన ఆయన కుమారుడు ఈ రాష్ట్రాన్ని దెబ్బతీసి, తెలంగాణలో తన వ్యాపారాలు పెంచుకొనేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. మూడు రాజధానులకు మద్దతు నిచ్చి, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. వారంతా రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. గులాబీ పూలు ఇచ్చి రాజధానికి సహకరించాలని కోరిన జేఏసీ నాయకులపై ఈ ప్రాంత నాయకులే కేసులు పెట్టించారని ఆరోపించారు.


ఎంపీ నందిగం సురేష్‌కు గంట వ్యవధిలో 17మంది ఇళ్ల పేర్లు, తండ్రి పేర్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ కేసుల వెనుక వసంత కుటుంబం హస్తం ఉందని ఆరోపించారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మహిళల పట్ల ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులు చేసిన దాష్టీకం ప్రజలను కలవర పరస్తోందన్నారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు ఓపికతో గమనిస్తున్నారని, త్వరలో వైసీపీ నేతలకు బుద్ధి చెప్పి తీరతారన్నారు. కేసులు, బెదిరింపుల ద్వారా ఉద్యమాలను ఆపలేరన్నారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేఏసీ నాయకులు నీరుకొండ నరసింహారావు, వడ్డెల్లి సాంబశివరావు, వైఎస్‌ బాబు, శాఖమూరి స్వర్ణలత, మన్నె కళావతి, మండవ శ్రీనివాసరావు, సజ్జా అజయ్‌ చౌదరి, కొంగర నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-25T10:53:34+05:30 IST