Apr 16 2021 @ 10:45AM

రామ్‌తో రాక్‌స్టార్‌.. మరోసారి

కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌లో సినిమా అంటే ఆ ప్రొడక్ట్‌పై తెలియని ఓ ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌ హీరో-హీరోయిన్‌, హీరో- దర్శకుడు అనే కాకుండా హీరో- మ్యూజిక్‌ డైరెక్టర్‌కి కూడా ఉండటం విశేషం. అలాంటి ఓ కాంబినేషన్‌ హీరో రామ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌లది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు జగడం, రెడీ, హలో గురూ ప్రేమకోసమే, నేను శైలజ చిత్రాలు రూపొందాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా రామ్‌ మెప్పించనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.