ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ముందుగా వినిపించే పేరు దేవీశ్రీ ప్రసాద్. 23 ఏళ్ళ క్రితం ‘దేవీ’ సినిమాతో టాలీవుడ్లో దేవీ సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దేవీ ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. మినిమమ్ బడ్జెట్ మూవీస్ నుంచి స్టార్ హీరోల సినిమాల వరకూ ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ‘పుష్ప’ మూవీతో దేవీశ్రీ పేరు నేషనల్ వైడ్ గా మారుమోగుతోంది. యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లో టాప్ 100గా ఈ సినిమా హిందీ వెర్షన్ పాటలు పాపులారిటీ సంపాదించాయి. ఈ సందర్బంగా టీసీరీస్ అధినేత భూషణ్ కుమార్ దేవీశ్రీ ప్రసాద్ ను ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశారు. గతంలో హిందీ డబ్బింగ్ సినిమాలతో దేవీశ్రీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు కానీ.. స్ట్రైట్ హిందీ మూవీస్ కు మాత్రం ఆయన ఇంతవరకూ సంగీతం అందించలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని సమాచారం.
ఇటీవల దేవీ, భూషణ్ కుమార్‌ను కలుసుకోవడం విశేషంగా మారింది. టీసిరీస్ సంస్థ నిర్మించనున్న ఓ భారీ చిత్రానికి దేవీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో తమన్ కు కూడా బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. కానీ తమన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అయితే దేవీ మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. మరి దేవీ సంగీతం అందించబోతున్న ఆ సినిమాలో హీరో ఎవరై ఉంటారో చూడాలి.