దేవీ పూజ

ABN , First Publish Date - 2020-10-23T05:51:10+05:30 IST

అన్నిదేశాలలోను, అన్ని కాలాలలోను మానవుడు శక్తిని ఉపాసిస్తూనే ఉన్నాడు. ఇందు కోసం అతను సంకేతాలను పెట్టుకొంటున్నాడు...

దేవీ పూజ

శక్తికి సంకేతంగా దేవిని ఆరాధించవలసింది కేవలం నవరాత్రులలోనే కాదు, నిరంతరాయంగా! ఆమె ఆరాధన కొనసాగవలసింది పుష్పం, ఫలం, పత్రం, తోయంతో మాత్రమే కాదు; టెస్ట్‌ట్యూబ్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, సైక్లోట్రాన్ మొదలైన వాటితో కూడా. ఆమెకు మొక్కవలసింది ‘నాకు ముక్తి’ అని కాదు, ‘నాకు మోక్షం’ అని కాదు! ‘నా అల్పత్వాన్ని అధిగమించగల శక్తి నాకు ప్రసాదించవలసింది’ అని మాత్రమే!!


అన్నిదేశాలలోను, అన్ని కాలాలలోను మానవుడు శక్తిని ఉపాసిస్తూనే ఉన్నాడు. ఇందు కోసం అతను సంకేతాలను పెట్టుకొంటున్నాడు. మనదేశంలో మనవారు అందుకు పెట్టుకొన్న సంకేతం -దేవి. తక్కిన జీవకోటి నుంచి వేరై, మానవుడు మానవుడుగా రూపొందింది సంకేతాలను పెట్టుకొనగల ప్రజ్ఞా ప్రాభవాల కారణంగానే. నిజానికి, మానవ భాషే సంకేతాల సముదాయం. ప్రతి అక్షరం ఒక సంకేతం, ప్రతి పదమొక సంకేతం. సంకేతం లేనిదే భావవ్యక్తీకరణ లేదు. భాష వ్యక్తీకరించగల భావాలకు సయితం స్పష్ట రూపమివ్వడానికి, వాటికి పరిపుష్టి కూర్చడానికి భాషతో పాటు మానవుడు కొన్ని సంకేతాలను వినియోగించడం కద్దు. ‘నమస్కారం’ అనడంతో అతడికి తృప్తి లేదు; చేతులను జోడించాలి. ‘ఔరా!’ అనడం చాలదు; ముక్కుపై వేలు వేసుకోవాలి. ‘ఛీ’ అంటే సరిపోదు; పళ్లు పటపట నూరాలి. ‘సకల సౌభాగ్యరస్తు!’ అనడంతో దీవన పూర్తి కాదు, అక్షతలు చల్లాలి. సంకేతాలను ఇంతగా ప్రేమిస్తాడు కనుకనే, ఇంతగా వాటిపై ఆధారపడతాడు కనుకనే, తాను ఉపాసించే శక్తికి సయితం మానవుడు కొన్ని సంకేతాలను పెట్టుకొన్నాడు. ‘దేవి’కి ‘శక్తి’ పర్యాయపదం కావడం దేవీ రూపంలో శక్తిని ఆరాధిస్తున్నందువల్లనే. అనాదికాలంగా శక్తిని ఉపాసిస్తున్నందునే మానవుడు క్రమానుసారంగా తన పరిసరాలపై విజయాన్ని సాధించగలిగాడు. చివరికి భూమండలం సయితం, దాని గురుత్వాకర్షణ సయితం తనను భూతలంపై బందీగా నిలపలేని స్థితికి ఈనాడతడు వచ్చాడు. ముందు చంద్రమండలంపై, తర్వాత తక్కిన ఉపగ్రహాలపై అతడు తన విజయపతాకను ప్రతిష్ఠాపన చేయడానికి మరెంతో కాలం పట్టదు. అజ్ఞానానికి, అహంకారానికి లోనై, అణ్వస్త్రాలతో ఆత్మ విధ్వంసన చేసుకొనని పక్షంలో సూర్యకుటుంబానికే అనతికాలంలో మానవుడు అధినాథుడు కాగలడు. జరపై, మృతిపై అతడు విజయాన్ని సాధించగల రోజు వచ్చినా రావచ్చు.


శక్తికి సంకేతంగా దేవిని ఆరాధించవలసింది కేవలం నవరాత్రులలోనే కాదు, నిరంతరాయంగా! ఆమె ఆరాధన కొనసాగవలసింది పుష్పం, ఫలం, పత్రం, తోయంతో మాత్రమే కాదు; టెస్ట్ ట్యూబ్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, సైక్లోట్రాన్ మొదలైన వాటితో కూడా. ఆమెకు మొక్కవలసింది ‘నాకు ముక్తి’ అని కాదు, ‘నాకు మోక్షం’ అని కాదు! ‘నా అల్పత్వాన్ని అధిగమించగల శక్తి నాకు ప్రసాదించవలసింది’ అని మాత్రమే!!

1963 అక్టోబర్ 27 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘దేవీ పూజ’ నుంచి

Updated Date - 2020-10-23T05:51:10+05:30 IST