Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మమ్మల్ని అణచివేయాలని పార్టీలు చూస్తున్నాయి

twitter-iconwatsapp-iconfb-icon
మమ్మల్ని అణచివేయాలని పార్టీలు చూస్తున్నాయి

కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌ను కలుపుకుని పోవాలి

అప్పుడే తెలంగాణ అభివృద్ధి... లక్ష ఉద్యోగాలు సాధ్యమే

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో శ్రీనివాస్‌గౌడ్‌, దేవీ ప్రసాద్‌

రాజకీయాల్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది: శ్రీనివాస్ గౌడ్

రాజకీయాలవైపు వెళ్లే ఆలోచన లేదు : దేవీ ప్రసాద్


విజన్‌ ఉన్న నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు టీజీవో, టీఎన్‌జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దేవీ ప్రసాదరావు. ఈ దిశగా ప్రభుత్వంలో విద్యార్థి, ఉద్యోగ ప్రజాసంఘాలవారికి భాగస్వామ్యం కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వారు తమ మనోభావాలను వెల్లడించారు... 25-11-13న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..తెలంగాణ ఏర్పడుతున్నందుకు కంగ్రాట్స్‌ చెప్పొచ్చా? కప్పుకి లిప్పుకి ఇంకా దూరమున్నట్లు కనబడుతోందికదా?

కచ్చితంగా... ఆరు దశాబ్దాల కల నిజం కాబోతోంది. కొన్ని అడ్డంకులున్నా అనివార్యం. అందుకే విజయంగా భావిస్తున్నాం.


చాలా అడ్డంకులున్నాయని మీ ఆంధ్రామిత్రులంటున్నారు కదా?

ఆదినుంచీ వారు ఆపాలనే యత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 371డీ.. అన్నీ అయిపోయాయి. అయినా రాంగ్‌రూట్‌లో అడ్డుకోవా లని చూస్తున్నారు. వాళ్లు ఏంచేసినా మేం విజయం సాధించామనే భావిస్తున్నాం. రాకపోయినా సాధించగలమన్న నమ్మకం పెరిగింది.


తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కారణం మీ ఉద్యమమా? రాజకీయ నిర్ణయమా?

రెండూ ప్రధానమే. ప్రజాకాంక్షను గుర్తించిందనే భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయ అనివార్యత కూడా ప్రజా ఉద్యమాలకు తోడవుతుంది. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధిగురించి ఆలోచిస్తుంది. ప్రస్తు తం సీమాంధ్రలో, ఇక్కడా పరిస్థితులు అనుకూలించాయి. వాటికి ఉద్యమాలు తోడయ్యాయి. అందుకే తెలంగాణ ప్రకటించారు.


మరి తెలంగాణలో కాంగ్రెస్‌కు ఫలితం దక్కుతుందా?

దక్కుతుంది. ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దనే పరిస్థితి ఉండదు. ఎన్ని అన్యాయాలు, నిర్బంధాలకు గురిచేసినా ఏదో ఒక సమయంలో తమ పక్షం వహిస్తే వారిని క్షమించే గుణం తెలంగాణ ప్రజలకుంది. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగుల పింఛను హక్కును కేంద్రం కొల్లగొట్టింది. ఉద్యోగులుగా ఇంకెప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయరాదనే పరిస్థితినుంచి ఈ గడ్డమీద ప్రేమతో వారికి మద్దతుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అలాగని ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు. పార్టీకూడా కొంత మార్పుచేయాలి. అప్పుడే ప్రజలకూ విశ్వాసం కలుగుతుంది. అందుకే నాయకత్వ మార్పు కోరుతున్నాం. అసలు తెలంగాణకు అన్యాయం జరిగిందంటే ముందుగా మా నాయకులనే అనాలి.


అంటే జేఏసీ భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నారా?

జేఏసీకే కాదు. విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల వాళ్లు, ఉద్యోగులు... అందరికీ ప్రాతినిధ్యమిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో కలుగుతుంది. 12ఏళ్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌తోపాటు సీపీఐ ని కూడా సంప్రదించి వెళితేనే ఆ పార్టీకి లాభం. అసమానతలు, అన్యాయాలకు ఇప్పటి నాయకత్వమే కారణమని ప్రజలు భావిస్తున్నారు. అం దుకే విజన్‌ ఉన్నవాళ్లతోనే అభివృద్ధి సాధ్యమన్న భావన ఉంది.


అటువంటి విజన్‌ ఎవరికి ఉంది?

అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అయితే, తెలంగాణ సమస్యలపట్ల కేసీఆర్‌కున్న అవగాహన మేం కలిసిన ఏ ఇతర నేతలలోనూ కనబడలేదు. తెలంగాణ అభివృద్ధికి ఆయనకు మంచి విజన్‌ ఉంది.


అంటే విజన్‌ ఉన్న నాయకుడు కేసీఆర్‌ ఒక్కరేనా?

చాలామందికన్నా ఎక్కువగా ఉంది. సిన్సియారిటీ కూడా ఉందనే భావిస్తున్నాం. ఎందుకంటే పదవులు పట్టుకు వేళ్లాడే పరిస్థితులలో వదులుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీఆర్‌ఎస్‌. అందుకే ఆ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.

మమ్మల్ని అణచివేయాలని పార్టీలు చూస్తున్నాయి

అంటే కాంగ్రెస్‌, కేసీఆర్‌ పోటీపడితే కేసీఆర్‌కే ప్రాధాన్యముంటుందా?

తప్పకుండా. కాంగ్రెస్‌ నేతలకు ఏ విషయంమీదా స్పష్టతలేదు. తెలంగాణ ఇంకా రాకముందే సీఎం పదవికోసం చాలామంది రంగంలోకొచ్చేశారు. అయితే, వారిలో ఎవరైనా అధిష్ఠానం లైన్లో నడవాల్సిందే. అదే ప్రాంతీయ పార్టీలైతే వారనుకున్న దారిలో నడిచే వీలుంటుందన్నది మా భావన. కేసీఆర్‌పై ఆరోపణల్లో వాస్తవాలున్నా, అవాస్తవాలున్నా ఉద్యమాన్ని ఈస్థాయికి తెచ్చిన ఘనత ఆయనదే.


అంటే ఇక్కడ కాంగ్రెస్‌ కన్నా టీఆర్‌ఎస్‌కే మద్దతని అర్థం చేసుకోవచ్చా?

అలాకాదు. కాంగ్రెస్‌ కచ్చితంగా కేసీఆర్‌ను కలుపుకొని పోవాలి. ఉద్యోగులకు, విద్యార్థులకు ఎవరికైనా కష్టం కలిగితే స్పందించిన వ్యక్తి ఆయన. అర్ధరాత్రి ఫోన్‌చేసినా స్పందించేవారు. అటువంటి వ్యక్తిని పక్కనపెడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటున్నాం. పార్టీ ఏదైనా లైన్‌ తప్పితే ప్రశ్నించడానికి జేఏసీలు గ్రామగ్రామాన బలంగా ఉన్నాయి. వాళ్లు ప్రజలను ఎంత అణచివేయాలని చూసినా మరోరూపంలో ఉద్య మం వస్తుంది. అన్యాయం జరిగితే నేతలను ఎదిరించే చైతన్యం వచ్చింది.


చైతన్యమనేదానికంటే ఆశ అనవచ్చేమో?

నష్టపోయిన వ్యక్తికి తెలంగాణ వస్తే బాగుపడతామేమో అన్న ఆశ సహజం. అసలు ప్రజాసమస్యలు తెలియనివాళ్లు రాజకీయాల్లోకి రావ డమే పెద్ద సమస్య. వచ్చినవాళ్లంతా ఎన్ని కోట్లు సంపాదించాలి.. ఎంత భూములు ఆక్రమించాలి అన్న ఆలోచన చేస్తారు. అందుకే ఉద్యమం చేసి ప్రజా సమస్యలు తెలిసినవాళ్లని అధికారంలో భాగస్వాములు చేయాలం టున్నాం. తెలంగాణ మేమే తెచ్చామంటూ కొందరు మా కంటే ఎక్కువ గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకుల్లో సమస్యలు పట్టించుకో ని కొందర్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అయినా ఇప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్లకు పెద్ద సవాలు తప్పదు. ఎందుకంటే తెలంగాణతో బంగారు పళ్లెం వస్తుందన్న భావనలో ప్రజలున్నారు.


ఆ పరిస్థితికి మీరు, కేసీఆర్‌ వంటి నేతలే కారణం కదా?

ఇప్పటి పరిస్థితుల్లో నిజాలు చెప్పినా అర్థంచేసుకునే పరిస్థితుల్లేవు. తెలంగాణ వచ్చినా అది దేశంలో అంతర్భాగం. అదే ఆర్థిక విధానాలు ఇక్కడా ఉంటాయి. సమైక్యాంధ్రలో ఉద్యోగులకున్న కష్టాలే ఇక్కడా ఉంటాయంటే ఎవరూ రిసీవ్‌ చేసుకోరు. కానీ, ఆర్థిక విధానాలపై పోరాడదాం. వాటిని తరిమి కొడదామంటేనే ప్రజల మద్దతు లభిస్తుంది.


మీలాంటి వాళ్లుకూడా లక్ష ఉద్యోగాలకుఒకే నోటిఫికేషన్‌ అంటున్నారు?

తెలంగాణలో 4.5లక్షల ఉద్యోగాలున్నాయి. చంద్రబాబు ప్రవేశపెట్టిన జీరో బేస్డ్‌ బడ్జెట్‌ వల్ల ఆరునెలలకుపైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రద్దు చేశారు. ఇవాళ సంక్షేమ పథకాలు పెరిగి, ఉద్యోగులు తగ్గిపోయారు. ఎప్పుడో తేల్చిన లెక్కల ప్రకారం లక్ష ఉద్యోగాలివ్వాలి. అది గొంతెమ్మ కోర్కె కాదు. ప్రస్తుతం తెలంగాణలో 2.5లక్షల ఉద్యోగులు ఉన్నారు. జనాభాలో ఒక శాతం ఉండొచ్చు కాబట్టి మరో లక్ష ఉద్యోగాలు సాధ్యమే.


నాయకులు చేయాల్సిన పనులు ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి. వారినే శాసిస్తున్నాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మితిమీరే పరిస్థితి లేదా?

నాయకులను ఉద్యోగులు శాసించటంలేదు. అనివార్యత ఉంది కాబట్టి శాసించబడ్డట్లు వాళ్లు నటిస్తున్నారు. సమయం కోసం చూస్తున్నారు. వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి ఎన్ని తిట్టినా భరిస్తారు. మా మిత్రుడు అశోక్‌బాబు భూస్థాపితం చేస్తామని తిట్టినా మాట్లాడడంలేదు. అదే సకల జనుల సమ్మె కాలంలో మా నాయకులను ఒక్కమాట అంటే వాళ్లు విరుచుకుపడ్డారు. ఇప్పుడు కనుచూపు మేరలో ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్ని తిట్టినా పడతారు. అవకాశమొస్తే వడ్డీతో బదులు తీర్చుకుంటారు.


ఉద్యమాల నేపథ్యంలో ఉద్యోగసంఘాల్లో క్రమశిక్షణ లోపించదా?

ఉద్యమాలప్పుడు కొంత చెడుతుంది. ఉద్యమకాలంలో ఆంటోనీ, షిండే, దిగ్విజయ్‌ తలో ప్రకటన చేస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. అందులో భాగంగానే ఉద్యోగుల్లో కూడా వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రస్తుత పనివిధానానికి చాలా మెరుగులు దిద్దాల్సి ఉంటుంది.


అయితే అటువంటప్పుడు వచ్చే మౌలిక మార్పు ఏమీ ఉండదు కదా?

నిజమే. విభజనతో మొత్తం మారిపోతుందన్నది సరికాదు. దేశంలో మార్పులన్నీ తెలంగాణలో వస్తాయి. గతంలో ఏ వంద గజాలో, వెయ్యిగజాలో భూమి ఇవ్వడం చూశాం. ఇప్పుడు వేలకువేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు. నిజాం నవాబు కూడా ఇన్నిభూములివ్వలేదు. తరతరాలుగా దోచుకునే ప్రమాదం ఉందన్న స్పృహ లేకపోవడంవల్ల భూములను చంద్రబాబుకు వదిలిపెట్టాడు. చంద్రబాబుకు ఆ స్పృహలేక వైఎస్‌కు వదిలాడు. వైఎస్‌కు లేని స్పృహ వచ్చేవాళ్లకూ ఉంటే అది వాళ్లు చూసుకుంటా రు. అందరూ అభివృద్ధి అంటున్నారు దానివెనకే అక్రమాలున్నాయి. ఉదాహరణకు రింగ్‌రోడ్డు నిర్మాణంలో ఎన్నో అక్రమాలు జరిగాయి.


మరి దాని గురించి మేం రాస్తే మీరెవరూ మాట్లాడలేదే?

మాట్లాడితే బతికే పరిస్థితి ఉందా? మీలాంటివాళ్లే ధైర్యం చేశారు.

మమ్మల్ని అణచివేయాలని పార్టీలు చూస్తున్నాయి

హైదరాబాద్‌పై ఆంక్షల అవకాశం కనిపిస్తోంది. మీ స్పందన ఏమిటి?

హైదరాబాద్‌పై సర్వహక్కులతోపాటు పదిజిల్లాలతోకూడిన తెలంగాణ కావాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్‌పై కొన్ని ఆంక్షలు తప్పవనే భావన వస్తోంది. మానసికంగా మేమూ సిద్ధపడాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇప్పుడు హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధికి వచ్చారు. మేం ఖైరతాబాద్‌ పరిధికి సిద్ధంగా ఉన్నాం. ఇక భద్రత గురించి... ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్లేకాదు. పలు రాషా్ట్రలవాళ్లున్నారు. మరిన్ని ఆంక్షలు పెడతామంటే మళ్లీ ఉద్యమమే.


ఎంత మంది ఉన్నా దాయాదుల మధ్యే వివాదాలొస్తాయి కదా?

దానికి కారణం వారు ఈ సంస్కృతితో సరిగా కలవకపోవడమే.


నిజాం కాలంలో వచ్చిన మాలాంటివాళ్లను కూడా ఆంధ్రావాళ్లంటుంటే?

మిమ్మల్ని ఐడెంటిఫై చేయాడానికి ఉపయోగించే పదం తప్ప మరేమీ కాదు. గతంలో జరిగిన ఆంధ్రా గోబ్యాక్‌ వంటి ఉద్యమాలు ఇప్పుడు లేవు. ఎక్కడో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఆ ఇబ్బందులు లేవు. శాశ్వత శత్రుత్వం తెలంగాణ వాళ్ల లక్షణం కాదు. అందుకే పోలవరానికి, ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నారు. అలాగని ఇంకా ఆంక్షలతో మామిడి పండు రసం తీసేసి టెంక ఇస్తామంటే ఊరుకోం.


విడిపోదలచుకున్న తర్వాత ఇంత శత్రుత్వం అవసరమా?

ఉమ్మడి రాజధానిపై అలా అన్నందుకే ఇప్పుడు మరిన్ని హక్కులు కావాలంటున్నారు కదా. పదేళ్ల తర్వాత మళ్లీ పొడిగిస్తే.. లా అండ్‌ ఆర్డర్ల ను పరిశీలించొద్దంటే ఎలా? పదేళ్లపాటు లా అండ్‌ ఆర్డర్‌ వంటివి వారి చేతిలో పెడితే న్యాయం జరగదు.


మీరు కొంతకాలం, వాళ్లు కొంతకాలం సమ్మె చేశారు. ఇప్పుడు మీ సోదరుడు అశోక్‌ మళ్లీ బీభత్సంగా చేయబోతున్నామంటున్నారు...

మా సమ్మెకు అర్థాలున్నాయి. వాళ్లేమో విడిపోతే పింఛన్లుండవు, జీతాలు రావు అంటున్నారు. అలా ఎందుకనుకుంటారు? ఇప్పుడేమో ప్రజల కోసం చేస్తున్నామంటున్నారు.


మీ కుటుంబాలు దొరలకు వ్యతిరేకంగా పోరాడాయి. ఇప్పుడు మళ్లీ మీరు దొర దగ్గరకే వెళ్లారు కదా?

అటువంటిదేమీ లేదు. ఏంచేసినా తెలంగాణకోసమే. రేపు రాష్ట్రం వచ్చాక కూడా అధికారం మాదే.. మా వారసత్వానికే రావాలని ఎవరైనా అంటే కచ్చితంగా ఉద్యమం చేస్తాం.


ప్రతిదానిపై ఇంత దూకుడుగా ఉంటున్నారు కదా. మీ నేపథ్యం ఏమిటి?

దేవీప్రసాద్‌: నేను కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి వెళ్లిన తర్వాతే వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాతే విద్యార్థి నాయకుడిగా ఎదిగా. అన్యాయాన్ని ఎదిరించే తత్వం అక్కడే అలవడింది.


మరి ఆంధ్ర నక్సలైట్లు తెలంగాణ విద్యార్థుల్ని పాడుచేశారని పేర్వారం రాములు ఈ మధ్య ఒక ప్రకటన చేశారుకదా?

అది తప్పుడు ప్రకటన. ఓ మాజీ డీజీపీగా అలా అని ఉండవచ్చు. కానీ, కొండపల్లి సీతారామయ్యవంటి వాళ్లను మేం ఎంతో ఆరాధించే వాళ్లం. ఏదో ఇక్కడి పరిస్థితిని బట్టి ఉద్యమాన్ని నడుపుతున్నాం కానీ, అక్కడి ప్రజలపై మాకు ఎటువంటి ద్వేషం లేదు. గుంటూరు ప్రాంతాల్లో మాకు ప్రాణ స్నేహితులున్నారు. అశోక్‌బాబుతో సన్నిహితంగా ఉంటాం.


శ్రీనివాస్‌గౌడ్‌గారూ.. మీ నేపథ్యమేమిటి?

మా ఇల్లు హరిజనవాడకు దగ్గరగా ఉండేది. రెండు గ్లాసుల విధానాన్ని కూడా చూశాను. మా క్లాసులో కూడా దళిత పిల్లలకు వేరే బెంచ్‌లు ఉండేవి. ఇవన్నీ చూసి మార్పు తేవాలనుకునేవాడిని. పదిమందికీ ఉపయోగపడాలన్నదే నా తాపత్రయం.


కేసీఆర్‌ చాలా మందికి పదవులు ఆశ చూపించాడు. మరి మీకు ఏమిస్తామన్నారు?

దేవీ ప్రసాద్‌: ఏమీ ఇస్తామనలేదు. మేం ఏదీ అడగలేదు. మాకు అటువంటి ఉద్దేశం లేదు. నాకు రాజకీయాలవైపు వెళ్లే ఆలోచన లేదు. ప్రస్తుతం తెలంగాణ వచ్చేవరకు అటువంటి పదవులకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వమొచ్చాకా.. ఉద్యోగులకు న్యాయం జరగాలనేదే నా ఆకాంక్ష.


శ్రీనివాస్‌గౌడ్‌: కేసీఆర్‌గారు నన్ను కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరారు. అందరూ ఉద్యోగాలు చేసుకుంటే ఎలా అన్ని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలను చూస్తుంటే రాజకీయాల్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది. ఎన్నికలొస్తే ఎంత ఖర్చుపెట్టాలా అన్న ఆలోచన వస్తోంది. ఇటువంటి వ్యవస్థను మార్చగలమా అనిపిస్తోంది.అందుక కొత్తగా ఏర్పడే రాష్ట్రంలోనైనా కొంచెం ప్రక్షాళనచేసే దిశగా ప్రయత్నిస్తాం.


రాజకీయ జేఏసీ తరపున ఏమైనా కృషి చేస్తారా?

ఆంక్షలు లేని తెలంగాణ ఇచ్చిన జేఏసీని కలుపుకొని పోతే కచ్చితంగా ఆలోచిస్తాం. తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే నాయకత్వం ఎక్కడ ఉన్నా మా ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.