Abn logo
Sep 22 2021 @ 00:54AM

ప్రతి వార్డులో రూ.1.5 కోట్లతో అభివృద్ధి పనులు

విలేకరుల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్‌లు, వైసీపీ ఫ్లోర్‌ లీడర్లు

అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం

వారం రోజుల్లో టెండర్లు ఆహ్వానం

జీవీఎంసీ అభివృద్ధి ప్రణాళిక

విశాఖపట్నం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలోని ప్రతీ వార్డులోనూ రూ.1.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు జీవీఎంసీలో వైసీపీ ఫ్లోర్‌ లీడర్లు బాణాల శ్రీనివాస్‌, అల్లు శంకరరావు, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టుమూరి సతీశ్‌ తెలిపారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా ఎన్నికై ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయామనే నిరాశ ప్రతీ కార్పొరేటర్‌లోనూ ఉందన్నారు. దీనిని పోగొట్టేందుకు వీలుగా వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు ఇటీవల సర్వే నిర్వహించామన్నారు. ఒక్కో వార్డులో రూ. మూడు కోట్ల నుంచి రూ.30 కోట్లు విలువైన పనులతో అభివృద్ధి ప్రణాళికలు అందజేశారన్నారు. అంత మొత్తం నిధులను ఒకేసారి వెచ్చించే పరిస్థితి లేనందున దశలవారీగా వాటన్నింటినీ వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని మేయర్‌, కమిషనర్‌లు నిర్ణయించారన్నారు. తొలి విడతగా ప్రతీ వార్డు ప్రణాళికలో పొందుపరిచిన వాటిలో తక్షణం రూ.1.5 కోట్లు విలువైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మరమ్మతులను చేపట్టేందుకు వారిద్దరూ సమ్మతించారన్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఈ నెల 30లోగా పిలిచేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి జరగాలంటే పన్నులు, ఇతర మార్గాల్లో రావాల్సిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో రప్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. 95వ వార్డులో ప్రతిపాధించిన కుక్కల పార్కుపై విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని, అక్కడ థీమ్‌ పార్కుని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు ముమ్మన దేముడు, పార్టీ అధికార ప్రతినిధి మొల్లి అప్పారావు పాల్గొన్నారు.