జిల్లాలో ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-05-25T05:59:31+05:30 IST

ప్రకాశం జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.225 కోట్ల విలువైన పనులకు శ్రీకా రం చుట్టనున్నట్లు జిల్లా ఉపాధి హామీ పథకం పీడీశీనారెడ్డి పేర్కొన్నారు.

జిల్లాలో ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు
సమీక్షిస్తున్న అన్నా రాంబాబు, శీనారెడ్డి

కంభం, మే 24 : ప్రకాశం జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.225 కోట్ల విలువైన పనులకు శ్రీకా రం చుట్టనున్నట్లు జిల్లా ఉపాధి హామీ పథకం పీడీశీనారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కంభం మండల ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంజూరుకానున్న రూ.225 కోట్ల పనులకు మెటీరియల్‌ రూపంలో నిధులు రావలసి ఉందన్నారు. గ్రామసభలు నిర్వహించి ఆయా గ్రామాభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. కంభం మండలంలో ఈ రెండు సంవత్సరాల కొవిడ్‌ తర్వాత జరిగిన ఉపాధి హామీ పనుల్లో రూ. 25 కోట్ల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మండలంలో ఇప్పటివరకు జరిగిన ఉపాధి పనులపై చర్చ జరుగుతుండగా అదే దారిలో వెలుతున్న ఎమ్మెల్యే రాంబాబు సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది గ్రామస్థులు ఉపాధి పనుల్లో జరుగుతున్న అవినీతిపై ఎమ్మెల్యే రాంబాబుకు వినతిపత్రం ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాంబాబు సంబంధిత అధికారుల వివరణ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 సంవత్సరాల తరువాత కంభం చెరువుకు పుష్కలంగా నీరు చేరిందన్నారు. అయితే చెరువు కింద ఆయకట్టు రైతులకు కాలువల ద్వారా నీరు అందించాలంటే కాలువలన్నీ పూడిపోయి ఉన్నాయన్నారు. దీంతో తాను అప్పటి కలెక్టర్‌ను, ఉన్నతాధికారులను తీసుకొనివచ్చి కాలువల దుస్థితిని చూపించడమేకాక కాలువల మరమ్మతులకు రూ.80లక్షలు మంజూ రు చేయించానన్నారు. అయితే అప్పుడు కాలువలు మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదన్నారు. ఉపాధి హామీ పనుల్లో కాలువల మరమ్మతులు చేయించి ఉంటే బాగుండేదన్నారు. 

మొక్కుబడిగా ప్రజావేదిక

ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికలో ప్రజలు కరువయ్యారు. మండలంలోని ఉపాధి హామీ పథకంలో పని చేసే సిబ్బంది, ఉద్యోగులను కూర్చోబెట్టి మొక్కు బడిగా సమావేశాన్ని ముగించారు. కంభం, కందులాపురం, రావిపాడు, తురిమెళ్ల, పెద్దనల్లకాల్వ తదితర గ్రామాల్లో చేయని పనులకు చేసినట్లుగా మస్టర్లు రాసి నిధులు స్వాహా చేసినట్లు సంబంధిత ఉపాధి అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధులు అయిన కో-ఆప్షన్‌ సభ్యుడు సలీమ్‌, విముక్తి చిరుతలకక్షి రాష్ట్ర నాయకులు పానుగంటి సతీష్‌ పీడీ శీనారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విషయాలు తరువాత మాట్లాడదామని పీడీ సమస్యను దాటవేశారు. దీంతో వారు ఉపయోగంలేని ఈ సమావేశం, తప్పుచేసిన వారిపై చర్యలు లేనపుడు సమావేశాలు ఎందుకంటూ వెళ్ళిపోయారు. సమావేశంలో ఎంపీడీవో నరసయ్య, ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, ఏపీడీ రాజేష్‌కుమార్‌, ఏపీవో ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:59:31+05:30 IST