గుంతకల్లు డివిజన్‌లో అభివృద్ధి పనులు సంతృప్తికరం

ABN , First Publish Date - 2021-02-25T07:53:19+05:30 IST

గుంతకల్లు డివిజన్‌లో అభివృద్ధి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పేర్కొన్నారు.

గుంతకల్లు డివిజన్‌లో అభివృద్ధి పనులు సంతృప్తికరం
సీఆర్‌ఎస్‌లో ఎల్‌హెచ్‌బీ విభాగాన్ని ప్రారంభిస్తున్న గజానన్‌ మాల్యా

తిరుపతి రైల్వేస్టేషన్‌ దక్షిణంవైపు భవనాల నిర్మాణాలకు రూ.500 కోట్లు

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా


తిరుపతి(ఆటోనగర్‌), ఫిబ్రవరి 24: గుంతకల్లు డివిజన్‌లో అభివృద్ధి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. బుధవారం తిరుపతి రైల్వేస్టేషన్‌లోని వీఐపీ చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌ నుంచి రైల్వేస్టేషన్లకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంటుందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయలేక పోయామన్నారు. ఈ పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబరు ప్లాట్‌ఫారం నుంచి విజయవాడ రైలు మార్గం అనుసంధానం పనులు ఏప్రిల్‌ నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ దక్షిణంవైపు భవనాల నిర్మాణాలకు రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల్లో 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సౌకర్యాలను పరిశీలించామన్నారు. ప్రస్తుతం 70శాతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నామన్నారు. ప్యాసింజర్‌ రైళ్లు నడపడానికి కొవిడ్‌ నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. గూడూరు నుంచి కాట్పాడి సమీపంలోని బొమ్మసముద్రం వరకు రైలు మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు కల్పించిన వసతులు, కల్లూరు రైలుమార్గం పనులను కూడా పర్యవేక్షించామన్నారు.

సీఆర్‌ఎస్‌లో విస్తృత తనిఖీలు 

తిరుపతి సమీపంలోని సీఆర్‌ఎస్‌లో బుధవారం రైల్వే జీఎం విస్తృతంగా తనిఖీలు చేశారు. నూతనంగా నిర్మించిన ఇన్‌కమింగ్‌ కోచ్‌, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ విభాగాలను ప్రారంభించారు. అనంతరం కోచ్‌ ఫిట్టింగ్‌, కరోజన్‌, వీల్‌ పెయింటింగ్‌, మెకానికల్‌, మిల్‌రైట్‌ షాపులను తనిఖీ చేశారు. సీఆర్‌ఎస్‌ పరిపాలన భవనంలో గంటన్నరపాటు అధికారులతో అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమీక్షించారు. అనంతరం తిరుచానూరు, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం అలోక్‌ తివారి, జోనల్‌ అధికారులు జేకే జైన్‌, రాజీవ్‌కిషోర్‌, జీవీ నారాయణమూర్తి, జీఎం ఈశ్వరరావు, సీడబ్ల్యూఎం శ్రీనివాస్‌, ప్రశాంత్‌కుమార్‌, తిరుపతి రైల్వేస్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ, అధికారులు పరమేశ్వరరాజు, బి.సైదయ్య, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. జీఎంకు పలు సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. వినతిపత్రాలు అందించిన వారిలో.. రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలలు మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, కె.సుదర్శన్‌రాజు, నారాయణస్వామి, సురేంద్రరెడ్డి, ఎంప్లాయీస్‌ సంఘ్‌ నాయకులు, రాజు, హేమంత్‌రెడ్డి, అంజిబాబు, తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, సీఐటీయూ నాయకులు ఆర్‌.లక్ష్మి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-02-25T07:53:19+05:30 IST