కేవలం రూ.66 కోట్లతో అభివృద్ధి మాటలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-08-14T05:34:27+05:30 IST

కేవలం రూ.66 కోట్లు విదిల్చడానికి అనుమతులు మంజూరు చేసి దానితోనే కుప్పం మొత్తాన్ని అభివృద్ధి చేసేశామని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని టీడీపీ నాయకులు విమర్శించారు.రూ.66 కోట్లు కూడా మంజూరయ్యాయే కానీ, ఇంకా విడుదల కాలేదన్నారు.

కేవలం రూ.66 కోట్లతో అభివృద్ధి మాటలు హాస్యాస్పదం
13కేపీయం 1- విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పీఎస్‌.మునిరత్నం, గౌనివారి తదితరులు

టీడీపీ విమర్శ


కుప్పం, ఆగస్టు 13: కేవలం రూ.66 కోట్లు విదిల్చడానికి అనుమతులు మంజూరు చేసి దానితోనే కుప్పం మొత్తాన్ని అభివృద్ధి చేసేశామని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని టీడీపీ నాయకులు విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డికి, స్థానిక నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తాము చేసిన అభివృద్ధిలో సగం చేసి చూపించాలని సవాల్‌ విసిరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రూ.66 కోట్లు కూడా మంజూరయ్యాయే కానీ, ఇంకా విడుదల కాలేదన్నారు. ఒకవేళ ఆ నిధులు విడుదలైనా అభివృద్ధి చేయడానికి ఏ మూలకు సరిపోతాయని ఎద్దేవా చేశారు. కుప్ప అభివృద్ధి గురించి వైసీపీ నాయకులు ప్రజలను పక్కదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికోసం ఏం చేసిందో, ఎన్ని నిధులు వెచ్చించిందో ప్రజలందరికీ తెలుసన్నారు. కుప్పానికి సాగు, తాగునీరందించడానికి హంద్రీ-నీవా బ్రాంచి కాలువ పనులను ఎన్ని అడ్డంకులు వచ్చినా 90 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పది శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. పాలారు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడి కోర్టుకు వెళ్తే అదే నదిపై అనేక చెక్‌డ్యామ్‌లను నిర్మించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. గతంలో కడా ఏర్పాటు ద్వారా ఐఏఎస్‌ అధికారులతో పాలన సాగించిన కుప్పాన్ని ఇప్పుడు గొడవలు, తప్పుడు కేసులను నిలయంగా మార్చారని విమర్శించారు. వైసీపీ నాయకులు అక్రమాలకు తెరతీసి గ్రానైట్‌, ఇసుక మాఫియాలతో చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. అవే డబ్బులు వెదజల్లి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎఇన్నకలన్నింటిలో ఇదే జరిగిందన్నారు. ఏరియా ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, న్యాక్‌ భవనం, యూనివర్శిటీ, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు తెచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎవరు ఎంత మేర అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రూ.66 కోట్లతో కనీసం పెండింగ్‌ పనులైనా పూర్తి చేయగలరా అని ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా సాధనకోసం టీడీపీ పాదయాత్ర తలపెట్టినపుడు ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విషయం గుర్తు చేశారు. మూడేళ్లు పూర్తయినా ఆ ప్రాజెక్టు ఎందుకు అతీగతీ లేకుండా పోయిందని నిలదీశారు. ఈ సమావేశంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పార్టీ కుప్పం రూరల్‌ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ సాంబశివం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:34:27+05:30 IST