అందరి తోడ్పాటుతో అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-27T06:35:00+05:30 IST

అందరి తోడ్పాటుతో జిల్లాను సుసంపన్నంగా మార్చుదామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ చేరుద్దామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ పిలుపునిచ్చారు.

అందరి తోడ్పాటుతో అభివృద్ధి
పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు

  1. అర్హులందరికీ సంక్షేమ పథకాలు
  2. జిల్లాను సుసంపన్నంగా తీర్చిదిద్దుదాం
  3. గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు, జనవరి 26(ఆంధ్రజ్యోతి):  అందరి తోడ్పాటుతో జిల్లాను సుసంపన్నంగా మార్చుదామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ చేరుద్దామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. పోలీసు పరేడ్‌ మైదానంలో మంగళవారం 72వ భారత గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్‌తో కలిసి ఎస్పీ ఫకీరప్ప, జాయింట్‌ కలెక్టర్లు రాంసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, అడిషనల్‌ ఎస్పీ గౌతమి శాలి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. మన దేశం వందల సంవత్సరాలు బానిస సంకెళ్ళలో మగ్గిందని, జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, వారందరికీ సమస్త భారతావని నీరాజనాలు అర్పిస్తోందని అన్నారు. మన రాజ్యాంగ రూపశిల్పి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందని, ఆ నాటి నుంచి మన దేశం సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించిదని అన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులైన జిల్లా వాస్తవ్యులు సర్దార్‌ నాగప్ప వంటి ఎందరో మహానుభావుల కృషి వల్ల రాజ్యాంగం రూపొందిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. గణతంత్ర స్ఫూర్తితో వ్యవస్థ బలోపేతానికి, నిరుపేదల సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయశాఖ రైతు భరోసా రథం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ‘కొవిడ్‌పై సమరం-టీకాతో దూరం’ శకటం, డ్వామా జలకళ శకటం, గ్రామీణాభిృవృద్ధి సంస్థ పింఛన్ల శకటం, హౌసింగ్‌ శకటం, పౌర సరఫరాల శాఖ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ శకటం, పోలీసు శాఖ రేస్‌ వెహికిల్‌ కమ్యూనికేషన్‌ శకటం, మొబైల్‌ కమాండెంట్‌ పోస్ట్‌ ఫాల్కన్‌ శకటాలు అబ్బురపరిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌, ఎస్పీ, జేసీ ప్రశంసా పత్రాలను అందజేశాయి. అనంతరం వివిధ శాఖలలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు సందర్శించారు. వేడుకలను వీక్షించడానికి నగరవాసులు తరలి వచ్చారు. కర్నూలుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు వెంగమ్మ కుటుంబ సభ్యులను కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు శాలువా కప్పి సన్మానించారు.


Updated Date - 2021-01-27T06:35:00+05:30 IST