అందరూ పని చేస్తేనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-06T05:58:35+05:30 IST

ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పయనిస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్ధన్‌ రాథోడ్‌ అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి తొలిసారి

అందరూ పని చేస్తేనే అభివృద్ధి
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, పాల్గొన్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, జిల్లా అధికారులు

జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌

సంబంధిత శాఖ అధికారులపై సభ్యుల ప్రశ్నల వర్షం

స్థానిక సమస్యలపై నిలదీత

ఇరిగేషన్‌ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే రామన్న

లోతుగా ఆలోచించాలన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ

వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరుపై సుదీర్ఘ చర్చ

వాడివేడీగా సాగిన జడ్పీ సర్వసభ్య సమావేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, జూలై 5: ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పయనిస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్ధన్‌ రాథోడ్‌ అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి తొలిసారి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ హోదాలో వచ్చిన దండే విఠల్‌ను జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా 42 అంశాలపై ప్రారంభమైన సమావేశంలో శాఖల వారీగా వారివారి ప్రగతి నివేదికలను చదివి వినిపించా రు. అయితే సభ్యులు పలు సమస్యలు లేవనెత్తి అధికారులను నిలదీశారు. సభ్యుల తరపున చైర్మన్‌ అధికారులతో మట్లాడుతూ సభ్యుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తొలుత వ్యవసాయ, వైద్యం, సంక్షేమ పథకాల అంశాలపై చర్చించారు. అనంతరం సభను ఉద్ద్యేశించి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అధికారులు చివరి లబ్దిదారుని వరకు అందేలా కృషి చేయాలన్నారు. అప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. గతంలో జరిగిన సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, వాటిపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులను అందించడం జరుగుతుందన్నారు. అదేవిదంగా ప్రభుత్వం స్థానిక సంస్థలకు చెక్‌ పవర్‌ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సభలో సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశాన్ని, సమస్యను సీరియస్‌గా తీసుకుని అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం, మిషన్‌ భగీరథ, రోడ్లు, ఉపాధి హామీ, విద్యుత్‌ వంటి ప్రధాన అంశాలపై సభలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు చర్చిస్తూనే.. ఈ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తదుపరి సమావేశానికల్లా వీటిని పరిష్కరించేలా ప్రతీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చైర్మన్‌ ఆదేశించారు. 

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు : కలెక్టర్‌

ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌లో రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదు ర్కొనకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం పని చేస్తోందని కలెక్టర్‌ అన్నారు. సోయా విత్తనాలు వేసి నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సర్వేలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇదే విషయంపై గౌరవ సభ్యులు సభలో లేవనెత్తగా.. వచ్చే 15రోజుల్లోగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయమై సదరు కంపెనీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

పీహెచ్‌సీల్లో అభివృద్ధి కమిటీ సమావేశాలు

జిల్లాలో ప్రస్తుతం వర్షాకాల పరిస్థితుల్లో ప్రజలు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాల బారీన పడకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందుకు పీహెచ్‌సీల్లో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించేలా చూస్తామన్నారు. జిల్లాలో ప్రతీ శాఖ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమాలను అందించడంతో పాటు వారి అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా మార్గాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ గ్రామాలను దృష్టిలో ఉంచుకుని వైద్యం, రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాగా వైద్యులు సమయపాలన పాటించేలా చూడాలన్న సభ్యుల సూచన మేరకు రిమ్స్‌తో పాటు జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా రిమ్స్‌ డైరెక్టర్‌కు సూచించారు.

సమస్యలపై దృష్టి సారించాలి : ఎమ్మెల్సీ విఠల్‌

మళ్లీ కరోనా విజృంభిస్తోందని అధికారులు ఒకపక్క చెబుతున్నా.. జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరించకుండా రావడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతోందని, వీటిని ప్రజలకు అందించడమే ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత అ న్నారు. విద్య, వ్యవసాయం, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. విద్య రంగంలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, నేటికీ రోడ్డు కనెక్టివిటి లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూనే రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు. కాని నేడు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోక పోవడం వల్ల ప్రజలకు వారు అనుకున్న పనులు చేయలేక పోతున్నామన్నారు. మిషన్‌ భగీరథపై దృష్టి సారించి ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సేవ కోసమే పని చేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. 

తమాషాలు వద్దు : ఎమ్మెల్యే జోగు రామన్న

ప్రతీ మూడు నెలలకోసారి జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో రావడంతో పాటు సభలో సభ్యులు లేవనెత్తే సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై రిపోర్టు అందుబాటులో ఉంచుకోవాలి తప్ప, అధికారులు సభను తప్పుతోవ పట్టించే తమాషాలు చేయోద్దని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాలోని బోథ్‌ మండలంలోని పలు చెరువులతో పాటు తలమడుగు మండలంలోని కొత్తూరు, కజ్జర్ల చెరువు, నందిగామ చెరువులు మూడు వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా.. ఒక ఎకరానికి కూడా నీరందించడం లేదని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి సమస్యను సభ దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధిత ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామన్న అధికారులు సరైన సమాదానం చెప్పాలని సూచించారు. 

అధికారులను హడలెత్తించిన సభ్యులు

ఆదిలాబాద్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో 42 అంశాలపై సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో ముఖ్యంగా సమస్యలపై నిలదీస్తూ అధికారు ల నిర్లక్ష్యం ఎంత వరకు ఉందో? నిరూపిస్తూ తలమడుగు జడ్పీటీసీ గణేష్‌రెడ్డి, తాంసి జడ్పీటీసీ రాజు, బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, ఉట్నూర్‌ ఎంపీపీ, బజార్‌హత్నూర్‌ జడ్పీటీసీలు హడలెత్తించారు. సభ ఆసాంతం ముగ్గురు, నలుగురు సభ్యులు ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, సీఎఫ్‌వో, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే బాపురావు, డీసీసీబీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, మనోహార్‌, జడ్పీ సీఈవో గణపతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:58:35+05:30 IST