పంచాయతీల ఏర్పాటుతో తండాల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-20T05:10:48+05:30 IST

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం వల్ల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిలాఘనపురం మండలం కర్నె తండాలో ఎంపీపీ కృష్ణా నాయక్‌ ఆధ్వర్యంలో తుల్జా భవానీ ఆలయ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు.

పంచాయతీల ఏర్పాటుతో తండాల అభివృద్ధి
మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌

కర్నె తండాలో తుల్జా భవానీ ఆలయం ప్రారంభం

కర్నె తండా ఎత్తిపోతల పథకాన్ని సీఎంతో ప్రారంభించనున్నట్లు వెల్లడి


ఖిల్లాఘనపురం, అక్టోబరు 19: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం వల్ల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిలాఘనపురం మండలం కర్నె తండాలో ఎంపీపీ కృష్ణా నాయక్‌ ఆధ్వర్యంలో తుల్జా భవానీ ఆలయ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. 20 తాండాలున్న ఈ మండలంలో ప్రతీ తండాకు రోడ్డు సౌకర్యం, తాగునీటి వసతి ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కర్నె తండా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ తండాకు రోడ్డు, తాగు నీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణాలు, కర్నె తండా లిఫ్ట్‌ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


గిరిజనుల అభివృద్ధి కోసమే

గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే గిరిజనులు అభివృద్ధికి నోచుకున్నారన్నారు. గిరిజనులు అధికంగా నమ్మే తుల్జా భవానీ మాత ఆలయాన్ని కర్నె తండాలో ఏర్పాటు చేసుకోవడం అదృష్టమన్నారు. 


అమ్మవారి ఆశీస్సులు కలగాలి

తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభివాణీ దేవి అన్నారు. ఖిల్లాఘనపురం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని చెప్పారు.


అలరించిన మంగ్లీ పాటలు

సభలో తెలంగాణపై, బతుకమ్మ పండుగపై మంగ్లీ పాడిన పాటలు అలరించాయి. ఆమె పాటలు పాడుతుండగా మహిళలు, యువకులు ఈలలు వేస్తూ, కేరింతలు కొట్టారు. అంతకు ముందు మండల కేంద్రం సమీపంలో రూ.కోటీ 20 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి మంత్రులు శంకుస్తాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో బొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, జడ్పీటీసీ సామ్య నాయక్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:10:48+05:30 IST