రూ.82 కోట్లతో 395 పాఠశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-30T06:09:55+05:30 IST

ఏజెన్సీలో రెండో విడత మనబడి నాడు- నేడులో భాగంగా రూ.82 కోట్లతో 395 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు.

రూ.82 కోట్లతో 395 పాఠశాలల అభివృద్ధి
అధికారులతో కలిసి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

 ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ 


పాడేరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో రెండో విడత మనబడి నాడు- నేడులో భాగంగా రూ.82 కోట్లతో 395 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు. ఏజెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో బుధవారం నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రానున్న మూడు నెలల్లో ఆయా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. గిరిజన విద్యార్ధులకు చక్కని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే అమృత్‌ సరోవర్‌ పనులు వేగంగా ప్రారంభించాలన్నారు. జాతీయ ఉపాఽధి హామీ పథకంలో లేబర్‌ మొబలైజేషన్‌ లక్షకు తగ్గకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వైఎస్‌ఆర్‌ బీమా నమోదులు త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు అమ్మఒడి సొమ్ము జమకాకపోతే, జమ అయ్యేలా ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏజెన్సీలో మొబైల్‌ ఆధార్‌ కేంద్రాల ద్వారా 40 వేల మందికి కొత్తగా ఆధార్‌ కార్డులు అందించామని, మారుమూల గ్రామాల గిరిజనులకు ఆధార్‌ కార్డులు సులువుగా పొందే సౌకర్యం కల్పించాలని చెప్పారు. చింతపల్లి- సీలేరు, జామిగుడ రహదారి పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంచంగిపుట్టు, డుంబ్రిగుడలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు, మిషన్‌ కనెక్ట్‌ పాడేరులో మంజూరు చేసిన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు, చాపరాయి జలపాతం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, దానిని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని మండల కేంద్రాలు, ముఖ్యమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలలో ప్లాస్టిక్‌ నిషేధంపై ఎంపీడీవోలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, పంచాయతీరాజ్‌ ఈఈ కె.లావణ్యకుమార్‌, డ్వామా పీడీ ఎన్‌.రమేశ్‌రామన్‌, ఉపాధి హామీ పథకం ఏపీడీ జె.గిరిబాబు, ఏజెన్సీ ప్రాంత ఇంజనీరింగ్‌ శాఖల డీఈఈలు, ఉపాధి హామీ పథకం అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:09:55+05:30 IST