Abn logo
Feb 25 2020 @ 05:54AM

నిరాశ మిగిల్చిన సీఎం జగన్ పర్యటన

  • చదువుతోనే ప్రగతి 
  • పేద విద్యార్థులకు ఉన్నత చదువులే లక్ష్యం 
  • ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి
  • విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’కు శ్రీకారం
  • జిల్లా సమస్యలపై నోరు విప్పని సీఎం
  • వరాలు లేకపోవటంపై అసంతృప్తి
  • జిల్లా సమస్యలను ఎమ్మెల్యే వివరించినా స్పందన నిల్‌

(విజయనగరం - ఆంధ్రజ్యోతి): చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమన్నది తన నమ్మకమని.. ఆ ఆశయంతోనే పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చదువు ఒక్కటే మన తల రాతలు మార్చగలదని నమ్ముతున్నానన్నారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని, అక్షరాస్యత శాతంలో మనం పుంజుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇంటర్‌ తదితర పైచదువుల్లో 77శాతం డ్రాపౌట్లు ఉంటున్నారని... దీనిని దృష్టిలో పెట్టుకుని అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించామన్నారు.


వచ్చే విద్యా సంవత్సరం నుంచి  ఆంగ్ల మాద్యమం తీసుకువస్తున్నామని... అంతర్జాతీయంగా మన పిల్లలు ఉపాధి కోసం పోటీ పడాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు... ఆ తరువాత ఏటా ఆంగ్ల మాధ్యమాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ పదో తరగతి వరకు అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకు వస్తామని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు వంటి ఉన్నత ఉద్యోగులు ఉండాలని... ఆ లక్ష్యంతో పిల్లలు చదవాలని ఆకాంక్షించారు. విద్యా విధానం మారకుంటే తరతరాలు మారినా తలరాతలు మారవన్నారు. చదువుల విప్లవం కోసమే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేయడం గర్వంగా ఉందన్నారు. 


వసతి దీవెన ప్రారంభం

ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించిన తరువాత ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ల్యాప్‌టాప్‌లో మీట నొక్కి పథకానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా 50శాతం నిధులు కేటాయించామని... జూలై-ఆగస్టులో మిగిలిన నిధులు అందిస్తామని ప్రకటించారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15వేలు, డిగ్రీ, ఆపై చదువుతున్న వారికి ఏడాదికి రూ.20వేలు చొప్పున అందిస్తామన్నారు. మొదటి విడతగా 50శాతం మొత్తాన్ని ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేస్తామన్నారు. జిల్లాలో 59వేల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబి ్ధపొందుతారని వెల్లడించారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, జగనన్న  గోరుముద్దల కార్యక్రమానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.


అందరికీ ఇళ్ల స్థలాలు

ఇళ్ల స్థలాలను అర్హులందరికీ అందించేందుకు వీలుగా భూ సేకరణ జరుగుతోందని సీఎం చెప్పారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఇటువంటి మంచి పథకాలను అమలు చేస్తున్న కారణంగా ప్రతి పక్షం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. 


స్థానిక సమస్యలు ప్రస్తావించని సీఎం

సుమారు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. కానీ స్థానిక సమస్యల జోలికి పోలేదు. ముందుగా అధ్యక్ష ఉపన్యాసం చేసిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అనేక స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. విజయనగరం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం తారకరామతీర్థ సాగర్‌ పూర్తి చేయాలని కోరారు. రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరామ నవమి రోజున జరిగే కల్యాణోత్సవాలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కోరారు. మెడికల్‌ కళాశాల, గిరిజన విశ్వ విద్యాలయం, విజయనగరం, గజపతినగరం డిగ్రీ కళాశాలలను భవనాలు, సిబ్బందిని మంజూరు చేయాలని కోరారు. ఉప ముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి కూడా జిల్లా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. కానీ జగన్‌ తన ప్రసంగంలో స్థానిక సమస్యల జోలికి వెళ్లలేదు. వాటిని కనీసం ప్రస్తావించలేదు.


నిరాశ మిగిల్చి

ముఖ్యమంత్రి పర్యటన జిల్లా ప్రజలకు నిరాశ మిగిల్చింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఏం వరాలు  కురిపిస్తారో అంటూ ఎదురు చేస్తుంటారు. కానీ ఆయన జిల్లా సమస్యలను కనీసం ప్రస్తావించ లేదు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తనకు మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి ఇవ్వడంపై జిల్లా ప్రజల సమక్షంలో జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. కడవరకు తాను వైసీపీలో జగన్‌కు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌, బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. వేదికపై మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్‌, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, దిశ పోలీస్‌ స్టేషన్‌ వద్ద డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ జిల్లా అభివృద్ధి కారిక్రమాల ప్రగతిని సీఎంకు వివరించారు. ఉదయం 11.15కు విజయనగరం చేరుకున్న సీఎం 1.20వరకు ఉన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన తరువాత హెలిపాడ్‌ వద్దకు చేరుకుని విశాఖకు బయలుదేరారు.

Advertisement
Advertisement
Advertisement