30 ఏళ్ల కనిష్ఠానికి వృద్ధి!

ABN , First Publish Date - 2020-04-04T05:54:26+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పరిమితం కానుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అంటోంది. 30 ఏళ్ల క్రితం (90వ దశకంలో) తొలి దశ ఆర్థిక సంస్కరణ లు చేపట్టిన తర్వాత దేశానికిదే

30 ఏళ్ల కనిష్ఠానికి వృద్ధి!

  • ఈ ఏడాది భారత్‌ జీడీపీ వృద్ధి 2 శాతమే..
  • లాక్‌డౌన్‌, ప్రపంచ ఆర్థిక మాంద్యమే కారణం


కరోనా విజృంభణతో అతలాకుతలమవుతోన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మాంద్యంలోకి జారుకుందని ఐఎంఎఫ్‌ ఈమధ్యనే ప్రకటించింది. ఇప్పటికే తిరోగమనంలో పయనిస్తున్న భారత వృద్ధి రేటు ఇక అట్టడుగు స్థాయికి పడిపోనుందని తాజాగా పలు ఆర్థిక సంస్థలు హెచ్చరించాయి.


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పరిమితం కానుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అంటోంది. 30 ఏళ్ల క్రితం (90వ దశకంలో) తొలి దశ ఆర్థిక సంస్కరణ లు చేపట్టిన తర్వాత దేశానికిదే కనిష్ఠ స్థాయి వృద్ధి కానుందని ఫిచ్‌ పేర్కొంది. కరోనా దెబ్బకు భారత్‌తో పాటు ప్రపంచంలోని 100కు పైగా దేశా లు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోర ల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పలు ఆర్థిక సంస్థలు, ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోత పెడుతున్నాయి.


తొలుత 5.6%, తర్వాత 5.1%, తాజాగా..

2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను తగ్గించడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబరులో 5.6 శా తంగా అంచనా వేసిన ఫిచ్‌.. ఈ మార్చిలో 5.1 శాతానికి తగ్గించింది. ఇప్పుడు ఏకంగా రెండు శాతానికి కుదించింది. మాంద్యం పరిస్థితుల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి భారీగా తగ్గనుందని ఫిచ్‌ పేర్కొంది. దాంతో ఎంఎ స్‌ఎంఈలు, సేవా రంగాలు అత్యధికం గా ప్రభావితం కానున్నాయని హెచ్చరించింది. గతవారంలో మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ కూడా  వృద్ధి అంచనాల కు భారీగా కోత పెట్టింది. 2020 సంవత్సరానికి  భారత వృద్ధి రేటు అంచనా ను గతంలో అంచనా వేసిన 5.3 శా తం నుంచి 2.5 శాతానికి కుదించింది.


వచ్చే ఏడాది 6.2% : ఏడీబీ 

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021- 22)లో వృద్ధి భారీగా పుంజుకొని 6.2 శాతానికి చేరుకోవచ్చని ఏడీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.


వృద్ధి 1 శాతానికి!

ప్రస్తుత ఏడాదిలో భారత వృద్ధి రేటు 1 శాతానికి పడిపోవచ్చని లండన్‌కు చెందిన రీసెర్చ్‌ కన్సల్టెన్సీ ‘క్యాపిటల్‌ ఎకనామిక్స్‌’ అంచనా వేసింది. గడిచిన 40 ఏళ్లకు పైగా కాలంలో దేశానికిదే కనిష్ఠ స్థాయి వృద్ధి కానుందని సంస్థ పేర్కొంది. కరోనా విజృంభణతో భారత్‌ ఆర్థికంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోనుందని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ హెచ్చరించింది.  


కరోనా మూల్యం రూ.312 లక్షల కోట్లు

అమెరికా, యూరప్‌ తదితర అగ్రరాజ్యాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఈ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గరిష్ఠంగా 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.312 లక్షల కోట్లు) మేర గండి పడవచ్చని ఏడీబీ అంచనా వేసింది. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానమని తాజా నివేదికలో పేర్కొంది. 


భారత ఆర్థిక వృద్ధి గడిచిన ఆరు త్రైమాసికాలుగా తగ్గుతూ వస్తోంది. కరోనా దెబ్బకు పూర్తిగా పడకేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 1991 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిని చవిచూడనుంది. 2024-25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కష్టసాధ్యమని నా గత అధ్యయనాలు తేల్చాయి. వైరస్‌ విలయంలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయింది. ఎప్పుడు కోలుకుంటుందో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సుదూరపు కలే.

- ఎన్‌ ఆర్‌ భానుమూర్తి, ప్రొఫెసర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ



Updated Date - 2020-04-04T05:54:26+05:30 IST