స్వాతంత్య్ర స్ఫూర్తితో అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-16T05:53:34+05:30 IST

ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించింది.

స్వాతంత్య్ర స్ఫూర్తితో అభివృద్ధి
వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న మంత్రి, జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌


- సంక్షేమం, అభివృద్ధిలో ముందు వరుసలో వనపర్తి జిల్లా

- మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలతో మరింత చేరువగా ఉన్నత విద్య

- సాగునీటి ప్రాజెక్టులతో బీడు భూముల్లో పసిడి పంటలు  

- వినూత్న సాగుతో  రైతులకు భరోసా

- స్వాంతంత్య్ర దినోత్సవ కానుకగా  నూతన పింఛన్లు

-  వజ్రోత్సవాల్లో  మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

- కలెక్టరేట్‌ సముదాయంలో జెండా ఆవిష్కరించి.. ప్రజలకు సందేశం 

వనపర్తి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఆ స్వాంతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోందని  మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. స్వాంతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వనపర్తి సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో వనపర్తి జిల్లా ముందంజలో ఉండటం గర్వంగా ఉందని, మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రారంభంతో ఉన్నత విద్య మరింత చేరువలోకి వచ్చినట్లయ్యిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలోని బీడు భూముల్లో పసిడి పంటలు పండిస్తున్నారని తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ. 206 కోట్లు ఖర్చు చేసి 400 ఆవాసాల్లో పనులు పూర్తిచేసి.. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రైతుంబంధు పథకం కింద వానాకాలం సీజన్‌కు 1.64 లక్షల మంది రైతులకు రూ. 180.56 కోట్ల పెట్టుబడి సాయం అందించామని, రైతుబీమా పథకం కింద 541 మంది రైతు కుటుంబాలకు రూ. 27.05కోట్లు అందజేశామని అన్నారు. వినూత్న పంటలు సాగుచేయడం ద్వారా రైతులు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుందని సూచించారు. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ యార్డును నిర్మించుకున్నామని, రూ. 66లక్షలతో నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌, రూ. 19.50కోట్లతో సమీకృత మార్కెట్‌, రూ. 1.50కోట్లతో వే సైడ్‌ మార్కెట్‌ నిర్మించుకుంటున్నామని అన్నారు. ఉద్యానశాఖ అధ్వర్యంలో ఆయిల్‌ఫామ్‌ను  1170 ఎకరాల్లో సాగు చేపట్టినట్లు తెలిపారు.  మత్స్యశాఖ ద్వారా గతేడాది 16032 టన్నుల చేపలు, 592 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేశామని  తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 100శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామని తెలిపారు. 104 ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చామని, ఎన్‌సీడీ సేవల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ధరణిలో 18934 ధరఖాస్తులు రాగా.. 18004 దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని అన్నారు. తెలంగాణకు హరితహారం కింద ఈ ఏడాది 16లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకోగా.. 40లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నామని అన్నారు. షెడ్యూల్‌ కులాల సేవా సహకార సంస్థ ద్వారా దళితుల అభ్యున్నతి కోసం 199 యూనిట్లు మంజూరు చేయగా.  192 యూనిట్లు గ్రౌండింగ్‌ జరిగి సబ్సిడీ మొత్తం జమ చేశామని అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా 10లక్షల పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించగా.. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 160023 మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 321 పల్లె ప్రకృతి వనాలు, 255 సెగ్రిగేషన్‌ షెడ్లు, 277 రైతు కల్లాలు, 57 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యాశాఖలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 183 పాఠశాలలను ఎంపిక చేశామని, 178 పాఠశాలలో పనులు అంచనా వేసి పనులు ప్రారంభించామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో  రూ. 10.44కోట్లను మంజూరు చేశామని, సీఎంఆర్‌ఫ్‌ కింద  రూ. 33.21 కోట్ల సాయం అందజేశామని తెలిపారు.  జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 600 మంది పేద యువతకు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందిస్తుండటం అభినందనీయమని అన్నారు. సాధించిన విజయాల స్ఫూర్తితోనే అధిగమించాల్సిన శిఖరాలను అందుకుంటామని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాష, అదనపు కలెక్టర్లు ఆశీష్‌ సాంగ్వాన్‌, వేణుగోపాల్‌, ఏఎస్సీ షాకీర్‌ హుస్సేన్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-16T05:53:34+05:30 IST