అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-16T05:34:36+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేని తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రగతిపథంలో దూసుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి
జెండా వందనం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

 మహనీయుల అడుగుజాడల్లోనే తెలంగాణ ఉద్యమం

 స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు

 సీనియర్‌ సిటిజన్స్‌కు సన్మానం

 ఉత్తమ అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలు


సిద్దిపేట అర్బన్‌/క్రైమ్‌, ఆగస్టు 15: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేని తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రగతిపథంలో దూసుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల పరేడ్‌లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహనీయుల అడుగుజాడల్లోనే మరో స్వాతంత్య్ర పోరాటం నిర్వహించి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. సమైక్య పాలనలో వ్యవసాయంపై చిన్నచూపు చూశారని, తెలంగాణ వచ్చాక రైతుబంధు, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందిస్తూ రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నాడని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఐదువేల ఎకరాలకు పైగా పామాయిల్‌ తోటలు సాగు చేస్తున్నామని, వచ్చే రెండేళ్లలో 50వేల ఎకరాల పైచిలుకు పామాయిల్‌ తోట సాగు చేయాలనే ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.


కన్నీళ్లు పోయి కాళ్లేశ్వరం నీళ్లు 


కన్నీళ్లతో కరువు పాటలు పాడుకున్న తెలంగాణలో కేసీఆర్‌ అపర భగీరథుడిలా మారి పల్లెపల్లెకు సాగు, తాగునీరు తీసుకువచ్చి ప్రజల కన్నీళ్లను కాలేశ్వరం జలాలతో తుడిచారని వ్యాఖ్యానించారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోని 3,426 చెరువులు, కుంటలను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. చదువులో కూడా తెలంగాణ దూసుకు వెళ్తుందన్నారు. మన ఊరు మనబడి, మన బస్తి మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి దశలో 343 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.89 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 


సకల సౌకర్యాలతో ప్రభుత్వాసుపత్రి


తెలంగాణ వచ్చాక సిద్దిపేటలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పరచుకున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో 880 పడకలు అందుబాటులో ఉన్నాయని, 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 194 ఉప కేంద్రాల, మూడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మూడు బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రేడియాలజీ విభాగాలను, కార్పొరేట్‌ స్థాయిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


కళ్లద్దాల పంపిణీ


సిద్దిపేట క్రైం, ఆగస్టు 15: సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం వజ్రోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కళ్లద్దాలను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 762 మందికి కాటారాక్ట్‌ ఆపరేషన్లు, మందులు పంపిణీ చేయగా, మరో 1,800 మందికి కాటారాక్ట్‌ ఆపరేషన్లు చేయాల్సి ఉన్నదని మంత్రి వెల్లడించారు. ప్రతీ ఏఏన్‌ఏం సెంటరుకు ఒక స్టాఫ్‌నర్సు నియామకంతో పాటు ప్రతీ పల్లె ఆసుపత్రుల్లో అందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందేలా వైద్య శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ పాల్గొన్నారు. కళ్లద్దాల పంపిణీ అనంతరం వారికి మంత్రి హరీశ్‌రావు భోజనం పెట్టి పంపించారు.


 



Updated Date - 2022-08-16T05:34:36+05:30 IST