దేవుడా!

ABN , First Publish Date - 2021-09-29T06:16:39+05:30 IST

అనగనగా ఓ ట్రస్టు. ఆ ట్రస్టు నిర్వహణ కోసం నిర్వాహకులు అప్పులు చేశారు.

దేవుడా!
జక్కంపూడిలోని దేవదాయశాఖకు చెందిన భూమి

తనఖాలో మాన్యం భూమి!

ఆ భూమిపై రూ.11.69 కోట్ల అప్పు

అప్పు తీర్చేందుకు అమ్మకం ఆలోచన

ఎన్‌వోసీ కోసం దేవదాయశాఖకు దరఖాస్తు

మంత్రి సాక్షిగా మహా స్కెచ్‌ 


అనగనగా ఓ ట్రస్టు. ఆ ట్రస్టు నిర్వహణ కోసం నిర్వాహకులు అప్పులు చేశారు. వేలు, లక్షలు కాదు. కోట్లలోనే. ఆ అప్పు తీర్చేందుకు దేవుడి భూమిని తనఖా పెట్టారు. అప్పు అంతై ఇంతై రూ.11.69 కోట్లకు చేరింది. ‘ఈ అప్పుల భారం మేం మోయలేం.. మాకున్న ఏకైక ఆధారం ఆ భూమే.. దానికి ఎన్‌వోసీ ఇప్పిస్తే అమ్ముకొని, అప్పులు తీర్చుకుంటాం..’ అని దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు రూ.15 కోట్ల విలువైన దేవుడి మాన్యం కాజేయడానికి దేవుడి మంత్రి సాక్షిగా వేసిన మహా స్కెచ్‌ ఇది. మంత్రి వద్ద నిన్నటి వరకు ఓఎస్‌డీగా పనిచేసిన వ్యక్తి సన్నిహితుడి వద్దే ట్రస్టు నిర్వాహకులు అప్పులు తీసుకోవడం... ఆ అప్పు పెరిగి రూ.11.69 కోట్లకు చేరడం.. అంతా మంత్రి పేషీ సాక్షిగా నడిచిన కథే. కోట్లాది రూపాయల దేవుడి ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు లేకుండా ఆయనను సొంత శాఖకు పంపేయడం, ఈ మొత్తం ఉదంతంలో మంత్రి ప్రమేయంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రూ. కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని తనఖా పెట్టి, ఆ ఆప్పు తీర్చేందుకు అమ్మకానికే సిద్ధమైన ఓ ట్రస్టు నిర్వాహకుల కథ ఇది. దేవదాయశాఖ భూమిని తనఖా పెట్టి, అప్పులు చేసినవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉన్నా, అధికారులు ఆ పని చేయలేదు సరికదా, ఎన్‌వోసీ జారీ చేయాలని ఆ ట్రస్టు నిర్వాహకులు పెట్టుకున్న దరఖాస్తును ముందుకు నడిపించడం విశేషం. దీని వెనుక దేవుడి మంత్రి హస్తమే ఉండడం చర్చనీయాంశంగా మారింది. 


కథ నడిపిందిలా..

విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామంలో దేవదాయ శాఖకు సర్వే నంబర్లు 161/1, 161/2, 161/3లో 5.16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి దేవదాయశాఖకు చెందినది. రోడ్డు పక్కనే ఉండటంతో ఎకరా ధర తక్కువలో తక్కువ రూ.3 కోట్లకుపైగా ఉంటుంది. అంటే ఈ భూమి విలువ రూ.15 కోట్లకుపైమాటే. నగరంలోని అప్పలస్వామి సత్రం, ట్రస్టు నిర్వాహకులు కొద్ది రోజుల క్రితం దేవదాయశాఖ కమిషనర్‌కు ఓ దరఖాస్తు పెట్టారు. సత్రం, ట్రస్టు నిర్వహణకు విడతల వారీగా తాము చేసిన అప్పు రూ.11.69 కోట్లకు చేరిందని, ఆ అప్పు తీర్చే మార్గం తమకు కనిపించడం లేదని, జక్కంపూడి గ్రామంలో సర్వే నంబర్లు 161/1, 161/2, 161/3లో ఉన్న తమ పూర్వీకులకు చెందిన 5.16 ఎకరాలకు ఎన్‌వోసీ ఇప్పిస్తే దాన్ని అమ్మి అప్పులు తీర్చుకుంటామని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. దేవదాయశాఖ అధికారులు ఈ దరఖాస్తుపై విచారణ జరపగా, ఆ భూమి తమ శాఖకు చెందినదేనని తేలింది. దీంతో వారు ఆ దరఖాస్తును పక్కన పడేశారు. వాస్తవానికి దేవదాయశాఖ భూమిని తనఖా పెట్టి, అప్పులు చేసినందుకు ఆ దరఖాస్తు చేసుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉన్నా, అధికారులు ఆ పని చేయలేదు. పైగా కొద్ది రోజుల క్రితం ఆ దరఖాస్తుకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆగమేఘాలపై ఆ ఫైలు కదలడం మొదలైంది. దేవుడి మంత్రి పేషీలోని కీలక వ్యక్తుల ఆదేశాల మేరకే ఆ ఫైలు ముందుకు కదులుతోందన్న ప్రచారం జరిగింది.


ఆశ ఎక్కువై అల్లరైంది..!

జక్కంపూడిలోని రూ.15 కోట్ల విలువైన భూమికి ఎన్‌వోసీ ఇప్పించేందుకు ప్రతిఫలంగా దేవుడి మంత్రి సన్నిహితులు, పేషీలోని కీలకవ్యక్తులు ట్రస్టు నిర్వాహకులకు చెందిన రూ.8కోట్ల విలువైన స్థలాన్ని రాయించుకునేందుకు ప్లాన్‌ వేశారు. జక్కంపూడి దేవుడి మాన్యానికి ఎన్‌వోసీ రాకముందే విజయవాడ నగరంలో ఉన్న ఆ స్థలాన్ని తమ పేరు మీద రాయించుకునేందుకు మంత్రి సన్నిహితులైన ‘బుజ్జి’బాబు తదితరులు ఒత్తిడి చేశారు. అయితే జక్కంపూడి స్థలానికి ఎన్‌వోసీ రాకముందే విజయవాడలోని స్థలాన్ని రిజిస్టర్‌ చేసేది లేదని ట్రస్టు నిర్వాహకులు భీష్మించడంతో వ్యవహారం పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లింది. 


దేవుడి మాన్యం తనఖా పెట్టినా కేసులుండవా..!

జక్కంపూడిలోని 5.16 ఎకరాల భూమి దేవుడిదని స్పష్టంగా రికార్డుల్లో ఉన్నా, ఆ భూమిని తనఖా పెట్టి కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చామని సాక్షాత్తు దేవదాయశాఖ కమిషనర్‌కు నేరుగా దరఖాస్తు చేసుకున్నా, సంబంధిత వ్యక్తులపై ఎలాంటి కేసులు పెట్టకపోవడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన దేవుడి మంత్రి పేషీలోని వ్యక్తిని అక్కడి నుంచి తప్పించి మాతృశాఖకు పంపడంపైనా దేవదాయశాఖ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ఆస్తులను అప్పనంగా కొట్టేసేందుకు ప్రయత్నించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరింత మంది ఇదే బరితెగింపుతో దేవుడి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తారని దేవదాయశాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 



Updated Date - 2021-09-29T06:16:39+05:30 IST