Abn logo
Feb 22 2020 @ 02:51AM

పొమ్మనక పొగపెడతారు

పదోన్నతి ఇస్తారు.. వారితోనే వద్దనిపిస్తారు.. అప్పటివరకు వేధింపులపర్వమే

తమవారిని అందలమెక్కించడమే అసలు లక్ష్యం

దేవాదాయ శాఖలో కొంతమంది అధికారుల తీరిది

కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు

పర్మినెంట్‌ చేస్తామని రూ.లక్షలు వసూలు

3 నెలలకే ఉద్యోగం నుంచి తొలగిస్తారు

వాపోతున్న బాధితులు.. ఒకరి ఆత్మహత్యాయత్నం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలోని కొంతమంది అధికారులు  చేతివాటం చూపిస్తున్నారు. కాసులిచ్చేవారికి  అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నారు. అర్హులైన వారికి పదోన్నతులు ఇచ్చినట్లే ఇచ్చి.. వారితోనే వద్దని అనిపిస్తున్నారు. తద్వారా జాబితాలో వెనుకవరుసలో ఉన్న తమకు అనుకూలమైన వారికి పదోన్నతులు కట్టబెడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓ ఉద్యోగికి గ్రేడ్‌-3 ఈవో నుంచి గ్రేడ్‌-2 ఈవోగా పదోన్నతి కల్పించారు. తమవారికి ఆ పోస్టు కట్టబెట్టేందుకు పదోన్నతి వచ్చిన వ్యక్తిని వేధించారు.  సుదూర ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చారు. పదోన్నతి కావాలంటే ఆ చోటుకు వెళ్లాల్సిందేనని, లేదంటే పదోన్నతి వద్దని లిఖితపూర్వకంగా రాసివ్వాలని  ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ అధికారి అలానే రాసిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లోనూ ఈ తరహా వేధింపులపర్వం సాగుతోంది.


కాంట్రాక్టు ఉద్యోగానికి లక్షల్లో వసూలు

శాఖలో అవకాశం ఉన్నచోటే కాదు, అవకాశాలు సృష్టించుకుని మరీ అవినీతికి పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా చేరితే ఆ తర్వాత పర్మినెంట్‌ చేస్తామంటూ నమ్మించి లక్షల్లో వసూలు చేశారు. కాంట్రాక్ట్‌ ఏఈ పోస్టుకు సాయిఫణి శర్మ అనే వ్యక్తి వద్ద రూ.3 లక్షలు వసూలు చేశారు. చేరిన మూడు నెలలకే  తొలగించారు. అడిగితే దాటవేత సమాధానాలు ఇచ్చారు. మనస్తాపానికి గురైన సాయిఫణి శర్మ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పురుగు మందు తాగడం తీవ్ర కలకలం సృష్టించింది. అన్యాయంపై బాధితుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి శాఖకు పూర్తిస్థాయి కమిషనర్‌ లేరు. అదనపు బాధ్యతలు నిర్వహించే కమిషనర్లకు పట్టు లేకపోవడంతో కిందిస్థాయిలో అధికారులు చక్రం తిప్పుతున్నారు. డబ్బు పెట్టగలిగితే ఏమైనా చేయిస్తామని నమ్మిస్తున్న దళారులు అధికారుల పేరు చెప్పి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ శివారులోని ఓ ప్రముఖ ఆలయంలో ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పదిమందికిపైగా పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ఇప్పిస్తానని  రూ. 2 లక్షల  వరకు వసూలు చేసినట్లు సమాచారం. 


ఇంటెలిజెన్స్‌ విచారణ

దేవాదాయ శాఖ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఇటీవల ఇంటెలిజెన్స్‌ పోలీసులు విచారణ జరిపారు. నకిలీ సర్టిఫికెట్లతో చేరడం, అర్హతతో సంబంధం లేకుండా కనీస నిబంధనలు పాటించకుండా పదేళ్లలో రావాల్సిన పదోన్నతులను కొందరు ఏడాది, రెండేళ్లలోనే పొందడం వంటి అంశాలపై కూపీ లాగారు.    సర్వీ్‌సలో ఎదుర్కొన్న ఆరోపణలకు గాను 15 నుంచి 20 మంది అధికారుల గురించి ఆరా తీశారు. విచ్చలవిడి అవినీతిని అరికట్టేందుకు అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారికి విజిలెన్స్‌ బాధ్యలు అప్పటించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదన చేసింది. దేవాదాయశాఖలో ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగం ఉన్నప్పటికీ అక్రమాలకు పాల్పడే వారిపైనా, నిబంధనలు అతిక్రమించే వారిపైనా కఠిన వైఖరిని అవలంబించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తప్పు చేసేవారికి చర్యలు తప్పవనే భయం కలిగించేలా విజిలెన్స్‌ బాధ్యతలు పోలీస్‌ చేతికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖలో అవకాశం ఉన్న ప్రతిచోట అక్రమాలు చోటుచేసుకుంటుండటంతో పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు పోలీస్‌ ఎంట్రీ ఒక్కటే సరైన మార్గంగా భావించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Advertisement
Advertisement
Advertisement