హే..భగవాన్‌!

ABN , First Publish Date - 2021-06-13T05:05:41+05:30 IST

ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని దేవదాయశాఖ పరిధిలోని దేవస్థానాలను విభజించారు. జిల్లాకు సంబంధించి మాన్సాస్‌ ట్రస్ట్‌, బొబ్బిలి వేణుగోపాలస్వామి, విజయనగరంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి భూములు ఎక్కువగా ఉన్నాయి.

హే..భగవాన్‌!
వివాదంలో ఉన్న విజయనగరంలో ఆంజనేయస్వామి ఆలయ భూములు


దేవదాయ భూములు అన్యాక్రాంతం

కొందరి కబంధ హస్తాల్లో ఆలయ ఆస్తులు

పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటికి వేలాది  ఎకరాల భూములు... కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. కానీ దశాబ్దాలుగా ఆ భూములపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వందలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. నియంత్రించాల్సిన దేవదాయ శాఖ నిద్దరోతోంది. రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు కేసులు తదితర కారణాలతో అన్యాక్రాంత భూములపై దృష్టి సారించే సాహసం ఆ శాఖ అధికారులు చేయడం లేదు. కనీసం దేవదాయ శాఖ భూములు ఉన్నవి ఎంత? ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్న విషయమే కొంతమంది సిబ్బందికి తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు దేవదాయ శాఖకు సిబ్బంది కొరత కూడా వేదిస్తోంది. 

ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని దేవదాయశాఖ పరిధిలోని దేవస్థానాలను విభజించారు. జిల్లాకు సంబంధించి మాన్సాస్‌ ట్రస్ట్‌, బొబ్బిలి వేణుగోపాలస్వామి, విజయనగరంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి భూములు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి చాలావరకూ భూములు అన్యాక్రాంత మయ్యాయి. మాన్సాస్‌ ట్రస్ట్‌కు వివిధ జిల్లాల్లో 14 వేల ఎకరాల భూములు ఉన్నాయి. వేణుగోపాల స్వామి ఆలయానికి 4,011 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. విజయనగరంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి నగరంలో విలువైన భూములున్నాయి. పార్వతీపురం సత్యనారాయణస్వామి ఆలయం, మక్కువ మండలం ములక్కాయవలసలోని కాశీవిశ్వేశ్వరాలయం, జగన్నాథస్వామి ఆలయానికి కూడా భూములు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొంత రైతుల స్వాధీనంలో ఉన్నాయి. అసలు ఈ ఆలయాలకు భూములు ఎన్ని ఉన్నాయి? రైతుల సాగులో ఉన్నవి ఎంత? ఫలసాయం సక్రమంగా అందిస్తున్నారా? ఆలయాల్లో దూప, దీపాల పరిస్థితి ఏమిటి? అన్న విషయాలు పట్టించుకునేవారు కరువయ్యారు.  


 ఆ 28 ఆలయాల భూములు..

జిల్లాలో 28 ఆలయాలకు సంబంధించి విలువైన భూములు ఉన్నట్టు దేవదాయ శాఖ గణాంకాలు, రికార్డులు చెబుతున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వేలాది కోట్ల  ఆస్తులను కాపాడవచ్చు. కానీ  ప్రభుత్వాలు ఆ పనిచేయడం లేదు. జిల్లా స్థాయి అధికారులు వస్తున్నారు.. పోతున్నారు తప్ప కార్యాచరణ రూపొందించడం లేదు. కనీసం సమీక్షించిన పాపాన పోవడం లేదు. దీనికితోడు దేవదాయ శాఖ భూములు ఆధీనంలో ఉన్నవారు రాజకీయ పలుకుబడితో మేనేజ్‌ చేస్తున్నారు. దేవదాయ శాఖ నుంచి భూములు పొందుతున్న వారు ఒకటి, రెండు సంవత్సరాలు శిస్తు రూపంలో సక్రమంగా చెల్లిస్తున్నారు. తరువాత మొండిచేయి చూపుతున్నారు. కొన్నిచోట్ల దేవదాయ శాఖ ఆధీనంలో కొండలు, గుట్టలు ఉన్నాయి. ఆ శాఖ దృష్టి సారించకపోవడంతో స్థానికులే చదును చేసుకొని తమ సంరక్షణలోకి తెచ్చుకున్నారు. సాగుహక్కుతో కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. విజయనగరం పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 18.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ అధికారులు వెళ్లగా...ఆ భూములపై హక్కులు మావేనంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ప్రారంభం నుంచి కఠినంగా వ్యవహరించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


 స్పందించే వారు కరువు

రాష్ట్రస్థాయిలో శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇక్కడి అధికారులు స్పందిస్తారు. స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. అమలు చేయలేరు. దశాబ్దాల భూ సమస్యలు కావడంతో ఎవరి జోలికి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. కనీసం ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూముల వివరాలను సైతం ఉన్నతాధికారులకు నివేదించలేకపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆలయ భూములు తమ గుప్పెట్లో ఉంచుకున్న కొంతమంది దిగువ స్థాయి సిబ్బందిని మచ్చిక చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే వారికి తృణమో..పణమో అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దేవదాయ శాఖ లెక్కల ప్రకారం  17,600 ఎకరాల ఆలయ భూములున్నాయి. వీటిలో 7,437 ఎకరాలను లీజులకిచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటి ద్వారా రూ.31.41 లక్షల ఆదాయం సమకూరుతున్నట్టు చెబుతున్నారు. కానీ మిగతా భూముల పరిరక్షణ ఏమిటన్నదానిపై వారి నుంచి మౌనమే సమాధానమవుతోంది. దేవదాయ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ముఖ్యంగా పర్యవేక్షక అధికారులు లేరు. జిల్లావ్యాప్తంగా ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి ఈవోలే కొనసాగుతున్నారు. 28 ఆలయాలకుగాను నలుగురు ఈవోలే పని చేస్తుండడం ప్రస్తావనార్హం.  


భూముల పరిరక్షణకు చర్యలు

దేవాలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదు. సిబ్బంది కొరత వాస్తవమే. అయినా వీలైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఉన్న సిబ్బందితోనే పనులు చేయిస్తున్నాం. సిబ్బంది కొరత విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే భర్తీ చేస్తారని ఆశాభావంతో ఉన్నాం.  

-వినోద్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవదాయ శాఖ, విజయనగరం.




Updated Date - 2021-06-13T05:05:41+05:30 IST