మాట్లాడుతున్న దేవదత్
తిరువూరు, జనవరి 21: తాము నిర్వహించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలను ఎక్కడ బయట పెడతారోనన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని, అధికార మదంతో పోలీసు యంత్రాగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ తిరువూరు నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్ విమర్శించారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ విధివిధానాలు ఈ పాలకులకు తెలియకపోవడం శోచనీయమని దేవదత్ అన్నారు. వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో 4 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, ఉద్యోగుల హక్కుల్ని హరిస్తూ ఈ ప్రభుత్వం చీకటి జీవోలు విడుదల చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు విడనాడకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వెదురు వెంకటనర్సిరెడ్డి, బొమ్మసాని మహేష్, సింధు శ్రీను, పిట్టా చైతన్య ముత్యం, హుస్సేన్ పాల్గొన్నారు.