Detroit లో 'వెయ్యేళ్ళ నన్నయ్య-నూరేళ్ళ నందమూరి' పేరుతో సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-07-13T17:00:59+05:30 IST

వెయ్యేళ్ళ క్రితం తెలుగులో ఇతిహాస సాహిత్యానికి అంకురార్పణ చేసిన నన్నయ్యను, చదువురాని వారికి సైతం రామాయణ భారతేతిహాసాలను నూరిపోసిన కళాకారుడు నందమూరి తారక రామారావు నూరేళ్ళ జయంతిని గుర్తు చేసుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి (DTLC) జులై 9న స్థానిక నోవై వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సును ఘనంగా నిర్వహించింది.

Detroit లో 'వెయ్యేళ్ళ నన్నయ్య-నూరేళ్ళ నందమూరి' పేరుతో సాహితీ సదస్సు

ఇంటర్నెట్ డెస్క్: వెయ్యేళ్ళ క్రితం తెలుగులో ఇతిహాస సాహిత్యానికి అంకురార్పణ చేసిన నన్నయ్యను, చదువురాని వారికి సైతం రామాయణ భారతేతిహాసాలను నూరిపోసిన కళాకారుడు నందమూరి తారక రామారావు నూరేళ్ళ జయంతిని గుర్తు చేసుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి (DTLC) జులై 9న స్థానిక నోవై వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సును ఘనంగా నిర్వహించింది. ఈ సదస్సులో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సహస్రావధాని మేడసాని మోహన్‌, సంస్కృత పండితులు తాళ్ళూరి ఆంజనేయులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి సభ్యులు పిన్నమనేని శ్రీనివాస్‌, డాక్టర్‌ వేములపల్లి రాఘవేంద్రచౌదరి సభ నిర్వాహకులుగా, తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బండ్ల హనుమయ్య అధ్యక్షతలో 'వెయ్యేళ్ళ నన్నయ్య-నూరేళ్ళ నందమూరి' శీర్షికతో సదస్సు విజ్ఞాన వినోదాల మేళవింపుగా నడిచింది. సిలికానాంధ్ర 'మనబడి' విద్యార్ధుల ప్రార్ధనా గీతాలతో పాటు తెలుగు సాహిత్యాన్ని, కవులను జోహార్లతో ముంచెత్తే పాటలతో ప్రారంభమైంది. సుమారు వంద మందికి పైగా వచ్చిన ప్రేక్షకులకు మూడు గంటలకు పైగా వీనుల విందు కలిగించింది.


సభలో ముందుగా మరుగున పడిపోతున్న తెలుగు జాతి కళలను, సంస్కృతిని రాబోయే తరాల కోసం ఆడియో, వీడియో రూపంలో భద్రపరిచే 'తెలుగు నడక' పథకాన్ని రాఘవేంద్ర చౌదరి వివరించారు. డిటియల్సీ సహకారంతో రమేశ్‌ నిర్వహిస్తున్న 'తెలుగు నడక' వీడియోలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవిష్కరించారు. 'తెలుగు నడక'ను అందరికీ అందుబాటులో ఉంచేందుకు తయారైన వెబ్‌సైట్‌ను తానా ఉపాధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌ ఆవిష్కరించారు. సభకు విచ్చేసిన తెలుగువారిలోనే చాలా మంది మరిచిపోతున్న తెలుగు సంస్కృతి కళలను ముందు తరాలకోసం భద్రపరచాలన్న ఆలోచన వచ్చినందుకే DTLCకి, స.వెం.రమేశ్‌కు తెలుగు జాతి రుణపడి ఉంటుందని లక్ష్మీప్రసాద్‌ అభినందించారు. ఇప్పటి వరకు చేతి పనులు, భజనలు, వీధి నాటకాలు, కథా గానాలు, కోలాటాలు, కుల వృత్తులు వంటి 90 అంశాలను వీడియో రూపంలో భద్రపరిచారు. వాటిని ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులో ఉండేట్టుగా విడుదల చేస్తున్నామని రాఘవేంద్ర చౌదరి తెలిపారు. సభలో మచ్చుకు చూపించిన లఘు చిత్రాలు అందరినీ వారి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళాయి.


తర్వాత ముగ్గురు వక్తలూ నన్నయ్య తెలుగు సాహిత్యంపై చూపిన ప్రభావం, ఎన్టీర్‌‌తో తమకున్న అనుబంధాలు హృద్యంగా వివరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఎన్టీర్‌తో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన క్రమశిక్షణను, పట్టుదలను, సామాజిక స్పృహను వివరించారు. తాళ్ళూరి ఆంజనేయులు మాట్లాడుతూ నన్నయ్య తెలుగు కావ్య సాహిత్యానికి ఎలాంటి వైతాళికుడో, పౌరాణికి పాత్ర పోషణతోను రాజకీయంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించడంలోనూ ఎన్టీర్‌ అంతే వైతాళికుడని పేర్కొన్నారు. ఈ సభను తెలుగు జాతి వైతాళికుల సంస్మరణ సభ అనడం ఎంతో సముచితంగా ఉంటుందని కొనియాడారు. నన్నయ్య ఆదికవిగా ఎంతటి కృత్యాదవస్థను అనుభవించి ఉంటారో సోదాహరణంగా మేడసాని మోహన్‌ వివరించారు. కావ్య రచనను ప్రారంభించడంలో వాల్మీకి పడినంత వ్యధ నన్నయ్యకు ఉంటుందని, ఆయన తర్వాత అందరీ మార్గం సుగమం చేశాడని, అందుకే ఆదికవిగా ప్రసిద్ధి చెందాడని అన్నారు. నన్నయ్య తెలుగువాడా కాదా అన్న వివాదాలు అసంబద్ధమనీ, దక్షిణ భారతంలో తెలుగు మాట్లాడే ప్రజలు, రాజ వంశాలు అన్ని చోట్ల విస్తరించి ఉన్నారని తెలిపారు. అలా ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వలస వెళ్ళిన తెలుగు సంతతివారేనని చారిత్రక సత్యాల్ని విప్పి చెప్పారు. భారతాన్ని తెలుగించడంలో నన్నయ్యకు నారాయణభట్టు సలహా ఉండవచ్చేమోగానీ అది పూర్తిగా నన్నయ్య విరచితమేనని వివరించారు. మోహన్‌ కూడా తనకు ఎన్టీర్‌తో పరిచయాన్ని, తెలుగు కవిత్వాన్ని అనుభూతితో ఆస్వాదించగల ఆయన ప్రజ్ఞను గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2022-07-13T17:00:59+05:30 IST