Abn logo
Oct 31 2020 @ 00:39AM

క్షీణిస్తున్న ఉదారవాద ప్రజాస్వామ్యం

Kaakateeya

ఒక జాతిగా మనం ఎవరమో మన రాజ్యాంగ ప్రస్తావన నిర్వచించింది. భారత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం ఒక ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్యంగా ఉంటుందని ఆ స్ఫూర్తిదాయక ప్రస్తావన సునిశ్చితంగా స్పష్టం చేసింది. జాతి నిర్మాతలు నిర్దేశించిన ఉదారవాద ప్రజాస్వామిక బాటను ధ్వంసం చేస్తున్న సంఘటనలు, పరిణామాలు ఎన్నో ఇప్పుడు సంభవిస్తున్నాయి. ఆ వైపరీత్యాలకు కలవరపడుతున్నవారు కొద్దిమంది మాత్రమే ఉండడం ఒక విషాదం. ఆ కలవరపడుతున్న వారిలో సైతం పలువురు మౌనం వహించడం మరింత విషాదం.


ఏదేశ రాజ్యాంగంలో నైనా ఒక ప్రస్తావన ఉంటుంది. దానిని బట్టి ఆ రాజ్యాంగ స్వభావం, లక్ష్యం తెలుస్తాయి. భారత రాజ్యాంగంలోనూ ఒక ప్రస్తావన ఉంది. ఈ ప్రస్తావనను చదివిన వారు లేదా దాని మహత్వాన్ని అర్థం చేసుకున్నవారు ఎంతోమంది ఉండరు. ‘ప్రాథమిక హక్కులు’, ‘అధికరణ 32’ లేదా ‘అత్యవసర పరిస్థితి’ మొదలైన నిబంధనలు బాగా తెలిసిన వారికి కూడా ప్రస్తావన లోని స్ఫూర్తిదాయక మాటలు తెలిసిఉండకపోవచ్చు. ‘1949 నవంబర్ 26న భారతదేశ ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని, మాకు మేమే సమర్పించుకున్నాము’ అని భారత రాజ్యాంగ ప్రస్తావన పేర్కొంది. ‘భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్రంగా నెలకొల్పడానికి సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకున్నామని’ ఆ ప్రస్తావన ప్రకటించింది (మన జాతిని మరింత విశాలంగా నిర్వచించడం కోసం 1977 జనవరిలో ఈ వాక్యంలో ‘సామ్యవాద’, ‘లౌకిక’ అనే పదాలను అదనంగా చేర్చారు). సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగివుండే ఆరాధనా స్వేచ్ఛ; సమాన హోదా, సమాన అవకాశాలు; ప్రజలందరిలో దేశీయ సమైక్యతను, అఖండతా భావాన్ని, సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించటం వంటి  సౌలభ్యాలను దేశపౌరులకు కలిగించడమే రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆ ప్రస్థావన తెలిపింది. ఒక జాతిగా మనం ఎవరమో అది నిర్వచించింది. అంతేగాక భారత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణ తంత్రం ఒక ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్యంగా ఉంటుందని సునిశ్చితంగా స్పష్టం చేసింది. 


భారత రాజ్యాంగ ప్రస్తావన ఒక శాశ్వత సార్థకత సంతరించుకున్న ఉత్తేజకర ఉద్ఘోష. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవ సమర నినాదం ‘స్వేచ్ఛ , సమానత్వం, సౌభ్రాతృత్వం లేదా మరణం’ మన రాజ్యాంగ ఉద్ఘోషలో పరిపూర్ణంగా ప్రతిధ్వనించింది. ఫ్రెంచ్ ప్రజలను, ఫ్రెంచ్ రిపబ్లిక్ ను నిర్వచించిన మాటలవి. ఈ సత్యాన్ని ఫ్రెంచ్ ప్రజలకు, ఫ్రాన్స్‌లో నివశించదలుచుకున్న వారందరికీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇటీవల మరొకసారి గుర్తు చేశారు. అలా గుర్తు చేయవలసివచ్చినందుకు ఆయనను కొన్ని దేశాలు విమర్శించాయి, అవహేళన చేశాయి. ఫ్రాన్స్‌లో శామ్యూయెల్ పాటీ అనే ఒక ఉపాధ్యాయుడిని ఇస్లామిక్ ఉగ్రవాది ఒకడు హతమార్చాడు. ఆ సందర్భంగా అధ్యక్షుడు మాక్రోన్, అన్ని వ్యత్యాసాలను సహనభావంతో అంగీకరిస్తాం కానీ, విద్వేష ప్రసంగాలను ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. అభిప్రాయ బేధాలను తొలగించుకునేందుకు అనుసరించే మార్గాలు హేతుబద్ధమైన చర్చలేనని, ఆ మార్గాలలోనే కొనసాగుతామని , హుందా, గౌరవం, సార్వత్రిక మానవతా విలువలను సంరక్షించేందుకు సదా నిబద్ధమై ఉంటామని కూడా  ఆయన పేర్కొన్నారు. 


ఫ్రెంచ్ ప్రజలు 18వ శతాబ్దిలో తొలిసారిగా ఎలుగెత్తిన ఆ మూడు స్ఫూర్తిదాయక మాటలు, కాదు, ఆదర్శాలను చాలా దేశాలు తమ రాజ్యాంగాలలో ఏదో ఒక రీతిలో పొందుపరచుకున్నాయి. భారత్ వలే అవీ తమను తాము ఉదారవాద ప్రజాస్వామిక రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. అయితే అనేక దేశాలలో అవి అంతకంతకూ బోలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. మన భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. పలు దేశాలు ‘ప్రజాస్వామ్య’ ప్రథమ పరీక్షలోనే విఫలమవుతున్నాయి. ఇక ఒక ప్రజాస్వామ్యం ‘ఉదారవాద’ అనే విశేషణానికి అర్హమైనదా కాదా అన్న రెండో పరీక్షలో ఎన్ని దేశాలు నెగ్గుతాయనేది ప్రత్యే్కంగా చెప్పాలా? 


సుప్రసిద్ధ అమెరికన్ మ్యాగజైన్ ‘టైమ్’ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురయిన 100 మంది వ్యక్తుల గురించి ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఆ వందమందిలో ప్రభుత్వాధినేతలైనవారు నరేంద్ర మోదీ, జిన్‌పింగ్, ఏంజెలా మెర్కెల్, జైర్ బోల్సొనారో (బ్రెజిల్), డోనాల్డ్ ట్రంప్, త్సాయి ఇంగ్ -వెన్ (తైవాన్). ఈ ఆరుగురు నేతలలో ఇద్దరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అధినేతలని ఏ ఒక్కరూ అంగీకరించరు. నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలే. అయితే వారు సైతం ‘ఉదారవాద’ అనే విశేషణాన్ని తిరస్కరిస్తారు. ఏంజెలా మెర్కెల్, త్సాయి ఇంగ్-వెన్ మాత్రమే నిజమైన ఉదారవాద ప్రజాస్వామ్య దేశాధినేతలు. మధ్య ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇంకా మన ఇరుగు పొరుగున ప్రజాస్వామ్య దేశాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ఏ ఒక్కటీ నిజమైన ఉదారవాద ప్రజాస్వామ్య దేశం కాదు. నరేంద్ర మోదీ గురించి ‘టైమ్’ అననుకూలమైన వ్యాఖ్యానం చేసింది. ‘శాంతి సామరస్యాలు, సుస్థిరతకు భారత్ ఒక మంచి ఉదాహరణ అని దలైలామా ప్రశంసించారు. నరేంద్ర మోదీ పాలన దలైలామా మాటలను సందేహంలో పడవేసింది. బహుళవాదాన్ని తిరస్కరించింది. కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని అసమ్మతిని అణచివేయడానికి ఉపయోగించుకుంది. ప్రపంచపు అత్యంత ఉజ్వల ప్రజాస్వామ్యం కాంతులు అంతకంతకూ మసకబారిపోతున్నాయి’ అని ఆ పత్రిక పేర్కొంది. జస్టిస్ రూత్ బాడెర్ గిన్స్ బర్గ్ మరణించిన వెనువెంటనే అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ట్రంప్ ఫెడరల్ జడ్జి అమీ కోనే బారెట్‌ను నామినేట్ చేశారు. కేవలం 30 రోజుల్లో ఆమె నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. అమెరికాలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామక ప్రక్రియ ఇంత శీఘ్రగతిన పూర్తి కావడం ఇదే మొదటిసారి. బ్యారెట్ నియామకం ఉదారవాద అమెరికాను కలవరపెడుతోంది. ముఖ్యంగా మహిళలు గర్భస్రావ హక్కును కోల్పోతామేమోనని భయపడుతున్నారు. వలసచట్టాలు మరింత కఠిన తరమయ్యే అవకాశముందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


ఒక దేశ పరిపాలనను ఆ దేశ పౌరులే సాగించుకునే రాజకీయ విధానం ప్రజాస్వామ్యం. సమాజంలో వ్యక్తులం దరికీ వ్యక్తిగత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండాలనీ, వ్యక్తి స్వేచ్ఛకూ పౌర హక్కులకూ ప్రభుత్వం హామీ ఇవ్వాలని వాదించే రాజకీయ ధోరణి ఉదారవాదం. ఒక ఉదారవాద దేశంలో ప్రజాస్వామ్యం అనివార్యంగా ఉంటుంది. అయితే ఒక ప్రజాస్వామ్యదేశంలో ఉదారవాద సంస్కృతి విలసిల్లకపోవచ్చు. ఏ ప్రజాస్వామ్య దేశమైనా స్వల్పకాలంలోనే అప్రజాస్వామిక దేశంగా పరిణమించేందుకు అవకాశముంది. ఇప్పుడు మనదేశంలో సంభవిస్తున్న సంఘటనలు, పరిణామాలు ఇదే సత్యానికి దృష్టాంతాలుగా ఉన్నాయి. లక్షలాది ప్రజల పౌరసత్వం ప్రమాదంలో పడింది. వాక్ స్వాతంత్ర్యం అణచివేతకు గురవుతోంది. మీడియాను దాసోహం చేసుకున్నారు. నిరసనలపై నిషేధం విధించారు. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక మతం, ఒక భాష మాత్రమే రాజ్యవ్యవస్థ ప్రాపకం పొందుతున్నాయి. అధిక సంఖ్యాక వర్గవాదం ఒక సంస్కృతిగా విలసిల్లుతున్నది. మైనారిటీలు భయాందోళనల్లో నివశిస్తున్నారు. పోలీసు వ్యవస్థ చట్టాన్ని కాక రాజకీయ యజమానుల ఆదేశాలను అనుసరిస్తోంది. సైన్యం రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడుతోంది. ఆదాయపన్ను శాఖను, చట్టాన్ని అమలుపరిచే సంస్థలను ప్రత్యర్థుల అణచివేతకు ఉపయోగించుకుంటున్నారు. న్యాయస్థానాలు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు. రాజ్యాంగసంస్థలు బలహీనపడ్డాయి. చట్టబద్ధ పాలనకు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ విపత్కర పరిణామాలకు కలవరపడుతున్నవారు కొద్దిమంది మాత్రమే కావడం ఒక విషాదం. ఆ కలవరపడుతున్న వారిలో సైతం పలువురు మౌనంగా ఉండిపోవడం మరింత విషాదం. 


మన ప్రజాస్వామ్యంలో సంభవిస్తున్న విపరీతాలు మరెన్నో ఉన్నాయి. పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించకుండానే చట్టాలను ఆమోదిస్తున్నారు. ఎటువంటి ఆరోపణలు లేకుండానే రాజకీయ నాయకులను నెలల తరబడి నిర్బంధిస్తున్నారు. రచయితలు, కవులు, విద్యావేత్తలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై దేశద్రోహ ఆరోపణలు మోపుతున్నారు. శతాబ్దాల నాటి మసీదు కూల్చివేత కేసులో దోషులు ఎవరూ లేరని న్యాయస్థానం తీర్పు నిచ్చింది. అత్యాచారానికి గురైన ఒక బాలిక మరణించే ముందు వాంగ్మూలంలో తనపై ఆ దౌష్ట్యానికి పాల్పడిన వారి గురించి స్పష్టంగా చెప్పినప్పటికీ వారిలో ఏ ఒక్కరిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు కావడం లేదు. రోజుల తరబడి వారిని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. పోలీసు పరిభాషలో ‘ఎన్‌కౌంటర్’ అనేది ఇప్పుడు ఒక ప్రముఖ పదం. రాజ్యాంగ అధికారులైన గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అనేక అవరోధాలు సృష్టిస్తున్నారు. పలు కీలక సంస్థలకు అధిపతులను నియమించడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇటువంటి విపత్కర పరిణామాలతో మన ప్రజాస్వామ్యం మరింతగా దుర్బలమవుతోంది. 


2019 నవంబర్‌లో న్యూజిలాండ్‌లో ఒక సాయుధవ్యక్తి రెండు మసీదులలో 51 మందిని కాల్చి చంపాడు. ప్రధానమంత్రి జెసిండా అర్డెమ్ ప్రతిస్పందిస్తూ, ‘హతులు మన వారు. వారిపై ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి మన వాడు కాదు’ అన్నారు. ఆమె మాటలు విశాల దృక్పథం, ఉదార వైఖరికి పరిపూర్ణ నిదర్శనాలు. ఉదారవాద ప్రజాస్వామ్యం మెల్లగా మరణిస్తున్నప్పటికీ ‘మనం ఎవరం?’ అని మనకు మనం ప్రశ్నించుకుని తీరాలి.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement
Advertisement