టీడీపీ నేతల నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-21T06:13:29+05:30 IST

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు.

టీడీపీ నేతల నిర్బంధం
జగదాంబ జంక్షన్‌ వద్ద విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిని అరెస్టు చేస్తున్న పోలీసులు

బంద్‌ నేపథ్యంలో అడుగడుగునా పోలీస్‌ ఆంక్షలు

అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు, పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్‌ హౌస్‌ అరెస్టు

అయినప్పటికీ వెనక్కితగ్గని ‘దేశం’ శ్రేణులు

జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, మానవహారాలు

స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపారులు

 అచ్యుతాపురంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే రహదారిపై బైఠాయించిన నేతలు

పప్పల చలపతిరావు, బుద్ధ జగదీశ్వరరావు, పీలా గోవింద, ప్రగడ, మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రహదారులపై బైఠాయించారు.  నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలించారు. ఇలా నగరంలో 164 మందిని, రూరల్‌ జిల్లాలో 181 మందిని అరెస్టు చేశారు. 


టీడీపీ కార్యాలయాలు, నేతల నివాసాలపై వైసీపీ నాయకుల దాడులకు నిరసనగా ఆ పార్టీ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు  బుధవారం తెల్లవారుజాము నుంచి పార్టీ నేతల ఇళ్లను చుట్టుముట్టారు. నగరంలోని చినవాల్తేరులో వుంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్న పోలీసులు...బయటకు వెళ్లొద్దంటూ సూచించారు. ఆయన బయటకు రాకుండా బందోబస్తు పెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటికే పరిమితమైన అచ్చెన్నాయుడు ఆ తరువాత విజయవాడ బయలుదేరి వెళ్లారు. నర్సీపట్నంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఆయన ఇంటికే పరిమితం కాగా ఆయన కుమారుడు విజయ్‌ మాత్రం ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలో సీనియర్‌ బండారు సత్యనారాయణమూర్తిని, ఆయన కుమారుడు అప్పలనాయుడును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. మధ్యాహ్నం తరువాత అప్పలనాయుడు మాత్రం లంకెలపాలెంలో ఆందోళనలో పాల్గొన్నారు. అలాగే విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరో నేత ఎం.శ్రీభరత్‌, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఉదయమే నేతల ఇళ్లకు వెళ్లి బయటకు రావద్దని సూచించారు. కాగా, పార్టీ నేతలు మహ్మద్‌ నజీర్‌, ప్రణవ్‌గోపాల్‌ ఇంకా మరికొందరిని స్టేషన్లకు తరలించి అక్కడే ఉంచారు. దీంతో వారంతా బంద్‌ నిర్వహణకు దూరంగా ఉండిపోవలసి వచ్చింది. అయితే విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రజక కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నారాయణ, సత్యవతి, సుజాత, ఈసరపు వాసు తదితరులు జగదాంబ జంక్షన్‌లో రోడ్డుపై కూర్చుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని  అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతలక్ష్మి ప్రతిఘటించగా ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనం ఎక్కించారు.   నగరంలో ఉత్తరం టీడీపీ ఇన్‌చార్జి విజయ్‌బాబు, ఇతర టీడీపీ నాయకులను నాల్గో పట్టణ పోలీసులు తెల్లవారు జామున అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 56వ వార్డు టీడీపీ కార్పొరేటర్‌ శరగడం రాజశేఖర్‌ను అర్ధరాత్రి దాటాక అరెస్టు చేయగా, 26వ వార్డు కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి, ముత్యాలనాయుడులను తెల్లవారు జామున ఐదు గంటలకు అరెస్టు చేశారు. 5 51, 52 వార్డుల టీడీపీ అధ్యక్షులు జానకిరామ్‌, మందలపు వాసుదేవరావులను అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసి ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 50, 54వ వార్డు టీడీపీ అధ్యక్షులు సనపల వరప్రసాద్‌, కుట్టా కార్తీక్‌లను గృహ నిర్బంధం చేశారు. గాజువాక ప్రాంతంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లను, పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్‌, పులి లక్ష్మీబాయిలను అరెస్ట్‌ చేసి, అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు.  కూర్మన్నపాలెంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌ను, అగనంపూడిలో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణలను అదుపులోకి తీసుకుని దువ్వాడ పీఎస్‌కు తరలించారు.  


రూరల్‌లో నిరసనలు

రూరల్‌ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు పలుచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. ఎలమంచిలి పట్టణంలో ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు పోతురెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాంబిల్లిలో బంద్‌కు సీపీఎం సంఘీభావం ప్రకటించింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు నేతృత్వంలో నాయకులు బుధవారం తెల్లవారుజామున నాలుగు నుంచి ఉదయం 6.30 గంటల వరకు అచ్యుతాపురం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో అన్ని వైపులా నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాయకరావుపేటలో నేతలు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందలు బస్సులు నిలుపుదలకు యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. చోడవరం పట్టణంలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. పార్టీ నేతలు తాతయ్యబాబు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజును గృహ నిర్బంధంలో వుంచడంతో గూనూరు మల్లునాయుడు నేతృత్వంలో నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. నాయకుల కోరిక మేరకు బ్యాంకులు మూసివేశారు. మాడుగులలో నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ నేతృత్వంలో మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ నియోజక వర్గాల్లో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. పాడేరులో దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. నేతలు రెండు పర్యాయాలు ర్యాలీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజుల నేతృత్వంలో బంద్‌ నిర్వహించారు. అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, దొన్నుదొర, అబ్రహం తదితరుల నేతృత్వంలో బంద్‌ జరిగింది. దుకాణాలు, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు. బంద్‌ సందర్భంగా నాలుగు రోడ్ల జంక్షన్‌లో  రోడ్డుపై బైఠాయించడంతో శ్రావణ్‌కుమార్‌ తదితరులను అరెస్టు చేసి సాయంత్రం విడిచిపెట్టారు.



Updated Date - 2021-10-21T06:13:29+05:30 IST