Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్బంధకాండ

  • టీడీపీ ముఖ్య నేతల గృహ నిర్బంధం 
  • ద్వితీయ శ్రేణి నాయకుల అరెస్టు
  • 1,100 అరెస్టులు.. 540 మంది నిర్బంధం
  • ఆంక్షలకు వెరవని తెలుగు తమ్ముళ్లు
  • ఆందోళనలు, ర్యాలీలతో నిరసన గళం
  • రంగంలోకి పోలీసు అదనపు బలగాలు 
  • మూతపడ్డ దుకాణాలు, విద్యాసంస్థలు 
  • బంద్‌ విజయవంతం: అచ్చెన్నాయుడు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : వైసీపీ మూక దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపట్టిన రాష్ట్ర బంద్‌లో అడుగడుగునా పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు పార్టీ నేతల ఇళ్లు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ నేతల ఇళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. రోడ్డెక్కిన ద్వితీయశ్రేణి నాయకులను అరెస్టులు చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలిపిన 1,100మంది రాష్ట్ర, జిల్లా నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 540మందిని గృహ నిర్భందం చేశారు. 450మందిపై కేసులు నమోదు చేశారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు 6,556మందిని పోలీసులు నిర్భంధించారని టీడీపీ నేతలు ఆరోపించారు. 


కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకులందరినీ మంగళవారం రాత్రి నుంచే హౌస్‌ అరెస్టు చేసి నిర్భందించారు. మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రల, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్యలను అరెస్టు చేశారు. విజయవాడలో ఇంటినుంచి బయటకు వచ్చిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


 నెల్లూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, పాశిం సునీల్‌, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 


ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను జొన్నతాళి వద్ద ఫ్యాక్టరీలో నిర్బంధించారు. ఎమ్మెల్యే స్వామిని గృహ నిర్బంధం చేశారు.


పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిర్బంధం నుంచి బయటకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఉండి ఎమ్మెల్యే రామరాజును ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధానికి పాల్పడ్డారు. దుగ్గిరాలలో తన నివాసం నుంచి బయటకు వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డగించారు. 

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్‌ సెంటర్లో మాజీ హోంమంత్రి రాజప్ప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు సిద్ధమైన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించారు. జగ్గంపేటలో పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. పిఠాపురంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని అడ్డుకునేందుకు బాష్పవాయుగోళాలు ప్రయోగించడానికి పోలీసులు పిస్టళ్లు తీసుకురావడం కలకలం రేపింది. 


విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును, పరవాడ మండలం వెన్నెలవలసలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని, విశాఖలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులను హౌస్‌ అరెస్టు చేశారు. జగదాంబ జంక్షన్‌లో ఆందోళన చేపట్టిన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. బంద్‌ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును హౌస్‌అరెస్టు చేశారు.   

శ్రీకాకుళం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బంద్‌ నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా, పోలీసు బలగాలు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతుండగా బలవంతంగా వాహనంలో ఎక్కించి టౌటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజాంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును గృహ నిర్బంధం చేశారు.

విజయనగరం జిల్లా సాలూరులో నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయమైన అశోక్‌ బంగ్లాలో పోలీసులు పహారా కాశారు. 


అనంతపురం జిల్లా కేంద్రంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పోలీసు వలయాన్ని ఛేదించుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. 


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆ పార్టీ ఇన్‌చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డిని, లద్దగిరిలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిని నిర్బంధించారు. 


చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, కుప్పంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్‌, పెద్దపంజాణిలో మాజీమంత్రి అమర్‌ సోదరుడు శ్రీనాథరెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. పలమనేరులో మాజీమంత్రి అమరనాథ రెడ్డితో పాటు మరో 8మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


కడప నగరంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి అమీర్‌బాబును హౌస్‌అరెస్టు చేశారు. రాజంపేటలో కడప-తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి.. రోడ్డుపై అడ్డంగా పడుకున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌ రాయులును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. మైదుకూరులో ధర్నాకు దిగిన టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని సింహాద్రిపురంలో హౌస్‌ అరెస్టు చేశారు. 

అనంతపురం జిల్లా కేంద్రంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పోలీసు వలయాన్ని ఛేదించుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్‌ చౌదరి, ఉమామహేశ్వరనాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇతర నాయకులను గృహ నిర్బంధం చేశారు. 

చెత్త వాహనంలో, పార్సిల్‌ వ్యాన్‌లో కుక్కేశారు 

గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయం ప్రధాన గేటుకు పోలీసులు తాళాలు వేయడంతో నేతలు భగ్గుమన్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు కార్యకర్తలు తాళం పగులకొట్టే యత్నం చేశారు. చివరకు పోలీసులు దిగొచ్చి తాళాలు తీశారు. జిల్లా కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్దమవుతున్న గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఇతర నేతలను పోలీసులు చెత్తవాహనంలో నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.గుంటూరు బస్టాండ్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న నసీర్‌, తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిని పార్సిల్‌ వ్యాన్‌లో కుక్కారు. వెనుక డోర్‌ వేసి ఊపిరి ఆడకుండా చేశారు.


అచ్చెన్నాయుడు ధన్యవాదాలు 

టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్‌ విజయవంతమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ నేతల్ని ముందుగా అరెస్టు చేసినా, ప్రభుత్వానికి నిరసనలు తెలిపి, బంద్‌ను విజయవంతం చేసిన కార్యకర్తలు, అభిమానులకు, బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా వైసీపీ తీరు మార్చుకోవాలని అచ్చెన్న హితవు పలికారు. 


పోలీసులు నా హక్కులను హరించారు

స్పీకర్‌కు ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు

న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులు ఎంపీగా నా హక్కులకు భంగం కలిగించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నన్ను అడ్డుకున్నారు. పాత్రికేయులతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు నన్ను అటకాయించారు. సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోండి’’ అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీగా తన హక్కులకు రక్షణ కల్పించాలని, జరిగిన ఘటనపై విచారించి, బాధ్యులైన పోలీసులపై సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌ కార్యక్రమంలో తాను పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తనను పోలీసులు అడ్డగించి, చేయి పట్టుకుని నెట్టేశారని ఆరోపించారు.

Advertisement
Advertisement