నిర్బంధితుని శ్వాస ‘ది లవింగ్‌ కబీర్‌’

ABN , First Publish Date - 2021-01-11T07:42:05+05:30 IST

జి. ఎన్‌. సాయిబాబా జైలు పక్షి. నాగపూర్‌ జైల్లో నిర్బంధితుడై ఈ దేశ అసంఖ్యాక ప్రజల మౌలిక సమస్యలపై, వాటి పరిష్కారానికై యోచిస్తున్న ఆలోచనాపరుడు...

నిర్బంధితుని శ్వాస  ‘ది లవింగ్‌ కబీర్‌’

జి. ఎన్‌. సాయిబాబా జైలు పక్షి. నాగపూర్‌ జైల్లో నిర్బంధితుడై ఈ దేశ అసంఖ్యాక ప్రజల మౌలిక సమస్యలపై, వాటి పరిష్కారానికై యోచిస్తున్న ఆలోచనాపరుడు. ఆరేళ్లుగా బందిఖానాలో వున్న సృజనకారుడు ఏం చేస్తాడు? అందులోనూ రాజకీయ విశ్వాసాలు కలిగివున్నవాడు, ప్రజలకు ఏదో చెప్పాలని తపన వున్నవాడు. జైలుగోడల మధ్య, సహచర ఖైదీల సంభాషణలు మినహా ఏదీ చెవి దగ్గరకు రాని మానసిక దశలో, సాయిబాబాలో అంతర్లీనంగా వున్న కవి- తనను కల్లోల పరుస్తున్న అంశాలకు కవిత్వపు రంగు అద్దే చిత్రకారుడిగా మారాడు.


అయితే అతని అక్షరాలు తన మాతృభాషనుంచి కాక ఇంగ్లీషు నుంచి రూపుదిద్దుకున్నాయి. జైలు నిబంధనల ప్రకారం తెలుగు మాటకూ, తెలుగు సాహిత్యానికీ జైలులోకి ప్రవేశం లేదు. మరాఠీ మహారాష్ట్ర ఇంటి భాష. ఏ రాజకీయ ఖైదీ అయినా- రాస్తే మరాఠీలో రాయాలి, లేకుంటే ఇంగ్లీష్‌లో రాయాలి. సాయిబాబా ఇంగ్లీష్‌ మాధ్యమం ద్వారా తన కవితా అభివ్యక్తి నుంచి బయలుదేరాడు. సాధన ద్వారా ఇంగ్లీష్‌లో తనదయిన పరిభాషను సృష్టించుకున్నాడు.


సాయి బాబా జైలు నుంచి రాసిన కవిత్వం ఇదివరకు ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ పేరిట కవిత్వ సంపుటిగా వచ్చింది. విప్లవం, నిర్బంధం, ఒంటరితనం నుంచి.. తనదయిన జైలు బయట లోపలి అనుభవం, జైలు సెంట్రీతో తనకి వున్న గాఢత, అమ్మ, సహచరి, కుమార్తె, అంతిమంగా తన స్నేహ ప్రపంచం ఇవన్నీ ఆ కవిత్వపు ఆవరణలో ఇమిడిపోయాయి. జైలును సృజనాత్మక రంగస్థలంగా కవి ఎంచుకున్న దశ ఇది. రచన అనేది అంతులేని ఓదార్పు కూడా. దుఃఖం, ఎడబాటు, వాటి విరామ ఆలోచన మధ్య కవి కోరుకునే సామూహిక సంభాషణ. జైలులో ఎవరికైనా ఆంతరంగిక సంభాషణ వుంటుంది. తనతో తాను మాట్లాడుకునే కాలం నడుస్తుంది.


జైలు నుంచి రాసిన సాయి రెండవ కవితా సంపుటి ‘ది లవింగ్‌ కబీర్‌’. భారతీయ సృజనాత్మక సంప్రదాయ పద్ధతిలో కబీర్‌ తాత్వికత అనుసంధానమవుతూ వస్తున్నది కబీర్‌ ప్రేమ తత్త్వంతో మాత్రమే. కానీ కబీర్‌ తాత్వికతలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి వర్తమాన ప్రపంచంతో, మానవ నాగరికత క్రమంతో ముడిపడివున్నాయి. దయ, ప్రేమ, విశాలత్వం మాత్రమే కాదు; సమాజపు పొరల్లో దాగి ఉన్న అసమానతలను, మూఢ విశ్వాసాలను చెబుతూనే బహుళత్వ విలువలును బోధించే జీవన లయ కబీర్‌ది. సాయి కబీర్‌ను స్వీకరించింది ఇక్కడే. ప్రపంచ చలనం అసహనపు దారిలో వున్నప్పుడు మనుషులు కోరుకునేవి దయ, ప్రేమ మాత్రమే కాదు; సమాజం మానవీకరణ చెందటం, ప్రజాస్వామీకరణ చెందటం కూడా. సాయి మాత్రమే కాదు, కబీర్‌ను తమ రచనల్లో పలికించినవారందరూ ఆశించినది ఇదే.


‘ది లవింగ్‌ కబీర్‌’ కవితా సంపుటిలో సాయి తాను వున్న స్థితి నుంచి కబీర్‌ వరకు ప్రయాణం చేస్తాడు. నడుస్తున్న కాల యవనికలోకి తన కవిత్వ రచన ద్వారా కబీర్‌ తాత్వికతను పలికించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కాలం సాయిబాబాను, కబీర్‌ను అనువర్తించు కోవడమే వర్తమాన విషాదం.

చెరసాల బంధనాల మధ్య బతుకుతూ నన్ను నేను స్వేచ్ఛగా వుంచుకోవడం నేర్చుకున్నా-


కబీర్‌ అన్నట్టు నాకందిన అన్ని పిడివాదాలను, బలహీనతలనూ వదిలిపెట్టాను నా హృదయం ఇప్పుడు ప్రేమ రంగుతో రంగులద్దుకుంది. 

జైలు సకల స్వేచ్ఛలను హరిస్తుంది. అయితే అంతరంగం లోని విశాలత్వాన్ని నియంత్రించేది ఏదీ వుండదు. 


మానవ స్వభావంలోని అన్ని బలహీనతలను వదులుకోవడం సాధ్యమేనా, దాని దారిని కబీర్‌ నుంచి స్వీకరించాను అని ప్రకటిస్తున్నాడు సాయి: ప్రేమ నగరాన్ని చేరుకోవాలనుకునేవారు వారి ప్రయాణం మొదలుపెట్టేముందే అహాన్ని, పొగరును వొదిలిపెట్టాలి. ఇక్కడ మానవ స్వభావంలో కలగలిసిన అంశం విద్వేషం లేని ప్రేమ భావన. మానవ సంబంధాలలోని సున్నిత అంశం విడదీయడం కాదు, కలిపివుంచడం, నూతన మానవావిష్కరణ కోరుకున్నామంటే మనలోని సకల విధ్వంసాల్ని రద్దు చేసుకోవడమే.


దుఃఖితులార, నా మాట వినండి ప్రేమలోకం ఆకృతిదాల్చేది దాని కొరకు మీరు చేసే పోరాటం వల్లే ఒకానొక సంకుచిత రాజకీయ భావజాలం కొనసాగుతున్న క్రమంలో, ఆధిపత్యం సాంస్కృతీకరణ చెందుతున్న దశ నుంచి పీడితులవైపు నుంచి మాట్లాడుతున్నప్పుడు, అంతిమంగా మను షులు కలిసేది, నిలబడేది వారు తమను తాము నిలబెట్టుకునేం దుకు చేసే పోరాటం వల్లనే- అన్న ఎరుకవున్నవాడు సాయిబాబా.


ఎక్కడో సుదూర తీరాల ఆవల లేదు ప్రేమ నగరం. తమ హృదయాలకు, చేరువలోని పల్లెల్లో, బయళ్ళలోనే నిజమైన ప్రేమికులు దానిని ఆవిష్కరిస్తారు.


సాయిబాబా కబీర్‌ను వశం చేసుకోవడానికి వెనుక ఇవాళ్టి ప్రపంచ క్షోభ వుంది. అయితే దాని వెనుక మానవుడు ఆవిష్క రించిన విలువలు, అవి నడిచిన విధానం మరింతగా మానవీ కరణ చెందడం, మానవ సంస్కృతి నుండి మనిషి దూరం కావడానికి జరుగుతున్న అమానవీయత.. ఇవన్నీ దోహదపడ్డాయి. 


విప్లవ రచయితల సంఘం ‘ది లవింగ్‌ కబీర్‌’ను ప్రచురిం చింది. దయా, ప్రేమా విప్లవ భావనా ప్రపంచంలో లేని అంశాలు కాదు. విప్లవ కవి సాయిబాబా, కబీర్‌ను స్వీకరించడమంటే, విప్లవ సారాంశం మారడం కాదు. కాలాన్ని వ్యాఖ్యానించడమంటే దాని చలనాన్ని సమాజ చలనంలో చూడాలి. ఇక్కడే సాయిబాబా కబీర్‌ను తోడుతీసుకున్నాడు.


అరసవిల్లి కృష్ణ దయా, ప్రేమా విప్లవ భావనా ప్రపంచంలో లేని అంశాలు కాదు. విప్లవ కవి సాయిబాబా, కబీర్‌ను స్వీకరించడమంటే, విప్లవ సారాంశం మారడం కాదు. కాలాన్ని వ్యాఖ్యానించడమంటే దాని చలనాన్ని సమాజ చలనంలో చూడాలి. ఇక్కడే సాయిబాబా కబీర్‌ను తోడుతీసుకున్నాడు.

Updated Date - 2021-01-11T07:42:05+05:30 IST