గర్భిణుల వివరాలను నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T05:01:15+05:30 IST

జిల్లాలోని గర్భిణులను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

గర్భిణుల వివరాలను నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గర్భిణులను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గర్భిణుల నమోదు, సీజనల్‌ వ్యాధులు, రక్తహీనత అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో, ప్రధానంగా పట్టణాల్లో గర్భిణుల వివరాల నమోదు చాలా తక్కువగా ఉందన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి గర్బిణులను గుర్తించి వారి వివరాలు నమోదు చేయాలన్నారు. స్ర్తీ శిశు సంక్షేమశాఖ, ఆరోగ్యశాఖల సిబ్బంది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో క్రమంగా సీజనల్‌ వ్యాధులు, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని, అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలని సూచించారు. రక్తహీనత పరీక్షలు నిర్వమించి ఏ షీల్ట్‌ యాప్‌లో నమోదు చేయాలని, సాధారణ రక్తహీనత, తీవ్రస్థాయి రక్తహీనత వారిని గుర్తించి ఐరన్‌ మాత్రలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, డీఎంహెచ్‌వో జువైరియా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, స్ర్తీ శిశు సంక్షేమ అధికారి పద్మావతి పాల్గొన్నారు. 

 

వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి 


కరీంనగర్‌ టౌన్‌: వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ, జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ వృద్ధుల, అనాధశ్రమంలో వృద్ధులు, దివ్యాంగులకు అధికారులతో కలిసి కలెక్టర్‌ పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విఽధాలా కృషి చేస్తోందని చెప్పారు. దివ్యాంగుల సాధికారిత కోసం వారికి విద్య, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య భద్రత కోసం కృషి చేస్తోందని అన్నారు. వయో వృద్ధులపై వేధింపులు జరిగినపుడు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14567కు కాల్‌ చేస్తే సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని అన్నారు. దివ్యాంగుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005728980కి కాల్‌ చేస్తే సంబంధిత అధికారులు తగిన సహాయం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ అధికారి పి శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా సహకార అధికారి శ్రీమాల పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:01:15+05:30 IST