మా వాళ్లుప్రాణాలతో ఉన్నారా?

ABN , First Publish Date - 2020-06-03T09:42:27+05:30 IST

విజయవాడలో కరోనాకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా..

మా వాళ్లుప్రాణాలతో ఉన్నారా?

కరోనా బాధితుల వివరాల కోసం కుటుంబ సభ్యుల ఆవేదన

ఆసుపత్రిలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఉండడం లేదని ఆందోళన

ఆసుపత్రిలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తే మేలు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): ఏదైనా వ్యాధి సోకి, ఆసుపత్రిలో ఉన్న రోగికి అయినవారు పక్కన ఉంటే కొండంత ధైర్యం.. కరోనా వైరస్‌ సోకినవారి పరిస్థితి ఇందుకు భిన్నం. ఆసుపత్రిలో ఎవరూ లేని ఒంటరితనం.. ఫోన్‌ ఉంటే తమవారితో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అదీ లేకుంటే వైరస్‌ సోకినవారికే కాదు.. బయట ఉన్నవారికీ ఆందోళనే. కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదు. వారు కోలుకుని వస్తే వచ్చినట్టు. లోపల తమవాళ్లు బతికున్నారా? లేదా? అనే ఆందోళన ఎందరిదో.


కృష్ణలంకకు చెందిన ఓ కుటుంబం ఇలాగే ఆందోళన చెందుతోంది.. తన తండ్రి గురించి ఏ వివరాలూ తెలియక తల్లడిల్లుతున్న ఓ బిడ్డ విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి గేటు వద్ద నిలబడి, వచ్చిపోయే సిబ్బందిని ‘మా నాన్న ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? చెప్పండంటూ వేడుకుంటున్న తీరు హృదయాన్ని కలచివేస్తోంది. ఇలా తల్లడిల్లుతున్న ఎందరో కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు వివరాలు అందించేందుకు హెల్ప్‌డెస్క్‌నయినా ఏర్పాటు చేయాలని వస్తున్న సూచనకు అధికారులు స్పందించాలి.


విజయవాడలో కరోనాకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన కృష్ణలంకకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చేర్చుకోలేదు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ రోగిని పరీక్షించిన డాక్టర్లు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో విజయవాడ ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని కొవిడ్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. అక్కడ వైద్యులు అతని నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షకు పంపించారు. మూడు రోజులకు రిపోర్టులు వచ్చాయి. అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


అయితే రోగి పరిస్థితి గురించి అతని నుంచి గాని, ఆసుపత్రి వర్గాల నుంచి గాని ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘గత శుక్రవారం మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అక్కడ పరీక్షలు చేసి వెంటనే పంపించేస్తారనుకున్నాం. శాంపిల్స్‌ తీసుకున్న తర్వాత రిపోర్టులు వచ్చేవరకు రోగి ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. రెండు రోజులు మా నాన్నతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేవాళ్లం. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. ఆసుపత్రి దగ్గరకు వెళ్లి ఎవరిని అడిగినా సమాధానం చెప్పేవారే లేరు. మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మా నాన్న పరిస్థితి ఎలా ఉందో.. ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాదీ తీవ్ర ఆందోళనలో ఉన్నాం.’ అంటూ ఆ బాధితుడి కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.


విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కుటుంబాలు అనుభవిస్తున్న మనో వేదనకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రి కావడంతో కృష్ణా జిల్లాతోపాటు పొరుగున ఉన్న గుంటూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నుంచి కరోనా పాజిటివ్‌ రోగులను మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఈ ఆసుపత్రిలో చేరిన రోగులకు మెరుగైన వైద్యం సంగతి పక్కనబెడితే.. సరైన తిండి, తాగడానికి మంచినీళ్లు కూడా అందించడం లేదనే ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రోగులకు అందుతున్న వైద్య సేవలపైనా రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కరోనా వైరస్‌ బారినపడిన 50 ఏళ్లు పైబడినవారిని విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రికి, 50 ఏళ్ల లోపు వయసువారిని పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రుల్లో ప్రతిరోజూ కొంతమంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్నా.. కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. దీంతో నిత్యం ఒక్కొక్క ఆసుపత్రిలో 100 మందికి పైగానే పాజిటివ్‌ బాధితులు ఉంటున్నారు. విజయవాడ ఆసుపత్రిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. పైగా ఇక్కడ ఐసీయూ విభాగాల్లో చికిత్స పొందుతున్నవారిలో ప్రతి రోజూ ఒకరో.. ఇద్దరో చనిపోతున్నారు. ‘ఐసీయూలోకి వెళితే.. ఇక అంతే’ అనే వ్యాఖ్యానాలు ఆసుపత్రి వర్గాల నుంచే వినిపిస్తుండటంతో రోగుల కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.


ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులతో ఫోన్‌లోనైనా మాట్లాడే అవకాశం లేకపోవడం, ఆసుపత్రికి తమను వెళ్లనీయకపోవడంతో తమ వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. ఒకరో, ఇద్దరో ధైర్యం చేసి ఆసుపత్రిలోకి వెళ్లి అక్కడ వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బందిని అడుగుతున్నా సమాధానం చెప్పేవారే ఉండటం లేదు. ‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా వారు బతికున్నారో.. చచ్చిపోయారో కూడా తెలియడం లేదు.. చెప్పండయ్యా!’ అంటూ రోగుల కుటుంబీకుల వేడుకున్నా కనికరించేవారు లేరు. వారి ఆవేదనను అర్థం చేసుకుని, తగిన సమాచారం అందించేందుకు వీలుగా ఆసుపత్రిలో ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. 


మరో ఇద్దరి మృతి 

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కరోనా పాజిటివ్‌ బాధితులు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు విజయవాడ పాతబస్తీలోని వించిపేటకు చెందిన వ్యక్తికాగా, మరొకరు పోరంకి నారాయణపురం కాలనీకి చెందిన వ్యక్తి. వీరిద్దరూ కరోనా కారణంగానే మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించడంతో వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఆసుపత్రి సిబ్బంది స్వర్గపురికి తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ రెండు మరణాలను ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 


ఆర్‌ఎంపీ డాక్టరుకు, మరో యువకుడికి పాజిటివ్‌ 

కొత్తపేటకు చెందిన ఒక ఆర్‌ఎంపీకి కరోనా పాజిటివ్‌గా మంగళవారం తేలింది. చుట్టుపక్కలవారికి అనేక మందికి ఆయన వైద్యం చేశారని తెలిసింది. ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన దగ్గర వైద్యం చేయించుకున్నవారందరిలో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా రామలింగేశ్వరనగర్‌కు చెందిన మరో యువకుడికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతను ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తాడని తెలిసింది. ఇలా ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ కేసులు, కరోనా మరణాలు నమోదవు తుండటంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-06-03T09:42:27+05:30 IST