విద్యారంగ సమస్యలపై నిర్లిప్తత

ABN , First Publish Date - 2022-07-27T06:13:53+05:30 IST

ఒకప్పుడు ఊరికి పెద్ద ఉపాధ్యాయుడు. ఇంటి సమస్య అయినా.. ఊరి సమస్య అయినా.. అయ్యవారిని కలిసి పరిష్కారం అడిగేవారు.

విద్యారంగ సమస్యలపై నిర్లిప్తత
కుందుర్పి మండలం మాయదార్లపల్లి పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన..

మాస్టారి మౌనం


నాడు ఉద్యమాల్లో ముందు వరుస

నేడు ఉపద్రవం వస్తున్నా ఉలుకే లేదు

ఉనికికి ప్రమాదం ఏర్పడినా నిష్పందన

ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘాల నేతలు


ఒకప్పుడు ఊరికి పెద్ద ఉపాధ్యాయుడు. ఇంటి సమస్య అయినా.. ఊరి సమస్య అయినా.. అయ్యవారిని కలిసి పరిష్కారం అడిగేవారు. ఆ తరువాతి కాలంలో ప్రభుత్వ విధానాలను శాసించే స్థాయికి ఉపాధ్యాయులు సంఘటితంగా ఎదిగారు. వారు ఉద్యమిస్తే.. ప్రభుత్వాలు దిగివచ్చేవి. కానీ ఇటీవల మాస్టార్లు మౌనం వహిస్తున్నారు. భావి పౌరులను తీర్చిదిద్దే పంతుళ్లలో మార్పు వచ్చిందా..? జాతిని జాగృతం చేసే ఉపాధ్యాయులలో జాగరూకత లోపించిందా..? ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బకొట్టే నిర్ణయాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారు..? తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఉత్తర్వుల పట్ల కూడా ఎందుకు స్పందించడం లేదు..? ఇవి జనం వేస్తున్న ప్రశ్నలు కాదు. ఉపాధ్యాయ సంఘాలలోనే ఈ చర్చ జరుగుతోంది. 


అనంతపురం విద్య: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో.. సంఖ్యాపరంగా ఉపాధ్యాయులే ఎక్కువ. ఉపాధ్యాయులు కదిలోస్తే ఏ ఉద్యమమైనా విజయవంతం అయినట్లు. ఉపాధ్యాయ సమస్యలపైనే కాదు.. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఉరిమిన ఘనత అనంత ఉపాధ్యాయులది. అలాంటి మాస్టార్లు నేడు నిర్లిప్తంగా ఉంటున్నారు.  సమస్యలపై కదలాలని సంఘాల నేతలు ఆహ్వానించినా.. చాలామందిలో చలనం రావడం లేదని అంటున్నారు. బదిలీపై వచ్చి రెండేళ్లు గడవకనే.. పాఠశాలల విలీనం దెబ్బకు మరో చోటకు బదిలీ కావాల్సి వస్తోంది. అయినా గళం విప్పడం లేదు. 3, 4, 5 తరగతులు చదివే చిన్న పిల్లలు కి.మీ. దూరంలో ఉండే ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనబాట పట్టారు. అయినా మాస్టార్ల గొంతు పెలగడం లేదు. ‘ఇది సరికాదు. ఈ విధానంలో లోటుపాట్లు ఉన్నాయి..’ అని ప్రభుత్వానికి గట్టిగా వివరించలేకున్నారు. ఇదేకాదు.. అంతకు మునుపు ‘ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే..’ అని ప్రభుత్వం గట్టిగా చెప్పినా.. ‘తెలుగు మాధ్యమాన్ని కొనసాగించండి’ అని గట్టిగా అడగలేకపోయారు. ఇటీవల ఏ సమస్యపైనా సగటు టీచర్‌ కాలు బయట పెట్టడం లేదు. ఇది ఉపాధ్యాయ సంఘాలు అంటున్న మాట. జాతిని మేలుకొలిపే మాస్టార్‌ మౌనంగా ఉండటం వ్యవస్థకు మంచిది కాదని సంఘాల నాయకులు అంటున్నారు. 


పెరుగుతున్న ఒత్తిడి

జిల్లా వ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీ, మున్సిపల్‌, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 3,682 ఉన్నాయి. వీటి పరిధిలో 15,732 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో పురుషులు 9,017 మంది, మహిళలు 6,715 మంది ఉన్నారు. ఎప్పుడూ లేనంతగా ఇటీవల సగటు ఉపాధ్యాయులపై ఆంక్షలు, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పలు రకాల యాప్‌లు,  నాన్‌ టీచింగ్‌ పనులకు టీచర్లను వినియోగిస్తున్నారు. గత మూడేళ్లుగా ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఇంజనీర్లతో చేయించాల్సిన పనులను సైతం బోధనా రంగంలో ఉన్న ప్రధానోపాధ్యాయులతో చేయిస్తున్నారు. పొరపాట్లు జరిగితే వారినే బాధ్యులను చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు కొవిడ్‌ డ్యూటీలు, టాయిలెట్ల ఫొటోలు తియ్యడం.. ఇలా  ఏవేవో పనులను అప్పగిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇది మరింత పెరిగేలా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.


ఆ పోటీతత్వం ఏదీ..?

నాడు-నేడు పనులు, పాఠశాలల విలీనం, బదిలీ సమస్యలు, యాప్స్‌ భారం, సీపీఎస్‌ రద్దు, సర్వీస్‌ రూల్స్‌.. ఇలా చాలా సమస్యలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి పిలుపునిచ్చాయి. కానీ ఉద్యమాలలో సంఘంలో క్రియాశీలకంగా ఉండే నాయకులు, ముఖ్యులు మాత్రమే కనిపిస్తున్నారు. సగటు ఉపాధ్యాయుడు పెద్ద ఆసక్తి చూపడం లేదు. తమకు నష్టం జరిగే అంశాలపైనా గురువులు కదలకపోవడం విస్తుగొలుపుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. గతంలో సెలవు వచ్చిందంటే.. సమస్యలపై చర్చించేందుకు, నిరసన తెలిపేందుకు సంఘాలు పోటాపోటీగా సమావేశలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేవారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడేది. సంఘాల నేతలతోపాటు ఉపాధ్యాయులు భారీగానే వచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారైందని నాయకులు అంటున్నారు. విద్యారంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం, హేతుబద్ధీకరణ, విలీనం కారణంగా ఉన్న పోస్టులు పోతున్నాయి. అయినా పెదవి విప్పడం లేదు. 





సమకాలీన అంశాలపై ఆలోచించాలి

సమకాలీన అంశాలపై ఉపాధ్యాయులు ఆలోచన చేస్తుండాలి. విద్యారంగం భవిష్యత్తులో ఎటువైపు పయనిస్తోందో గమనించాలి. ప్రభుత్వ విద్యావ్యవస్థ పరిరక్షణ దిశగా అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. వృత్తిపరంగా నష్టపోయే ప్రమాదాన్ని సగటు టీచర్‌  పసిగట్టాలి. వాస్తవాలను గ్రహించాలి. పరిష్కారం దిశగా అడుగు వేయాలి.

- చంద్రశేఖర్‌ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి


కామన్‌టీచర్‌ స్పందించాలి

బదిలీలు, విలీనం కారణంగా ఏం జరుగుతుందోనని ఎస్‌జీ టీచర్ల నుంచి ప్రఽధానోపాధ్యాయుల వరకూ కొంత గందరగోళం ఉంది. హక్కుల సాధనకు స్పందించే తత్వం సగటు ఉపాధ్యాయుడిలో మరింత పెరగాలి. ఎమ్మెల్సీలు, విద్యారంగ మేధావులు, ఉపాధ్యాయ సంఘాల ముఖ్యనేతల పిలుపునకు స్పందించాలి. అడుగు ముందుకేసి ఉద్యమించినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

- సూర్యుడు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-07-27T06:13:53+05:30 IST