కులాల కుంపట్లతో..రాష్ట్రం నాశనం

ABN , First Publish Date - 2022-08-20T09:38:34+05:30 IST

ఏం జరిగినా కులం పేరు పెట్టి మాట్లాడేవాళ్లకు గడ్డి పెట్టాల్సిన సమయం వచ్చిందని.. కులం పేరెత్తితే చెప్పు చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు.

కులాల కుంపట్లతో..రాష్ట్రం నాశనం

  • కులం పేరెత్తితే చెప్పు చూపించండి: బాబు
  • నా కులం ఉన్న చోటే ‘కియా’ తెచ్చానా?
  • హైదరాబాద్‌ అభివృద్ధితో అందరికీ అవకాశాలు
  • సొంత పార్టీవారినీ వదలకుండా వైసీపీ రౌడీయిజం
  • అరటి తోట తగలబెడితే ఎంపీ
  • బట్టలిప్పితే కేంద్ర మంత్రి పదవి.. చంద్రబాబు ధ్వజం
  • చివరి వరకూ అందరినీ చూస్తుంటా
  • భరోసా వచ్చిందని పడుకుంటే నష్టపోతారు
  • గెలుపు గుర్రాలకే టికెట్లు... అహంకారం వదలండి
  • నియోజకవర్గ ఇన్‌చార్జిలతో చంద్రబాబు


అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఏం జరిగినా కులం పేరు పెట్టి మాట్లాడేవాళ్లకు గడ్డి పెట్టాల్సిన సమయం వచ్చిందని.. కులం పేరెత్తితే చెప్పు చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. సమాజాన్ని కులాలు, మతాల పేరుతో విడదీసి పబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారని, పరస్పరం విద్వేషాలు పెరిగి రాష్ట్రం నాశనమైపోయినా.. వారికి తమ లబ్ధి తప్ప మరేమీ పట్టడం లేదని ధ్వజమెత్తారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలానికి చెందిన వైసీపీ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి అన్న కుమారుడు గుదిబండ గోవర్ధనరెడ్డి శుక్రవారం ఇక్కడ పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘నేనెప్పుడూ కులం గురించి మాట్లాడలేదు.. ఆలోచించలేదు. అన్ని కులాలూ నావేనని అనుకున్నాను. అనంతపురంలో వెనుకబడిన ప్రాంతంలో కియా ఫ్యాక్టరీ వస్తే ఏ కులం బాగుపడింది? ఆ ప్రాంతంలో కమ్మ కులం వారు చాలా తక్కువ. నా నియోజకవర్గం కుప్పంలో కమ్మ కులంవారి ఓట్లు వంద కూడా ఉండవు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలు అనేక ఏళ్ల నుంచి నన్ను గెలిపిస్తున్నారు. ఎంతో శ్రమ చేసి హైదరాబాద్‌కు కంపెనీలు తెచ్చి దానిని ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దితే ఒక కులం వారికే లబ్ధి కలిగిందా? అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారు అక్కడ అవకాశాలను పొందగలిగారు. అభివృద్ధి చేయడం చేతగానివారు కులాల గురించి మాట్లాడతారు.


తమ వైఫల్యాలకు సమాధానం చెప్పడం చేతగాక పవన్‌ కల్యాణ్‌ను ఆయన కులం వారితో.. నన్ను నా కులం వారితో తిట్టిస్తున్నారు. రేపు జగన్‌కు అడ్డం వస్తే రెడ్లను కూడా తిట్టిస్తారు. తనకు ఎంతో మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి కావడానికి శ్రమించిన వారిని కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. దళిత నేత మహాసేన రాజేశ్‌పై ఎక్కడో శ్రీకాకుళంలో కేసులు పెట్టించడంతోపాటు చంపించాలని కూడా చూశారు. తమను ప్రశ్నిస్తే బూతులు.. ఇంకా మాట్లాడితే హత్యలు. అరటి తోట తగలబెడితే ఎంపీ పదవి ఇచ్చారు. బట్టలిప్పి చూపించినందుకు రేపు కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో’ అని ఎద్దేవాచేశారు.


ఏమిటీ అరాచకం?

ఈ రెండు రోజుల్లో జరిగిన ఐదు సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు దర్పణం పడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ‘చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన ఒక యువకుడు ఇసుక గుంటల్లో శవమై తేలాడు. ఏలూరు జిల్లా గుడివాడ లంక గ్రామంలో ఎంపీటీసీగా ఉన్న ఒక దళిత మహిళ భర్తను.. అధికారంలో ఉన్నవారి తప్పులను ప్రశ్నించినందుకు పోలీసులను చేతిలో పెట్టుకుని తీవ్రంగా వేధించారు. అతను తన బాధలన్నీ ఒక సెల్ఫీ వీడియోలో చెప్పి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల నియోజకవర్గంలో వడ్డెర్ల పొట్టగొట్టేలా క్వారీ ఆక్రమిస్తే వైసీపీకి చెందిన వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ రేవతి రోడ్డుమీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది. సొంత పార్టీలో నేతల వేధింపులు భరించలేక కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు పూర్ణిమ రాజీనామా చేసి వెళ్లిపోయారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు ముగ్గురు అనంతపురం జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులో మందు కొని తాగి చనిపోయారు. ప్రభుత్వ మద్యం బ్రాండ్లలో విష పదారాఽ్ధలు ఉన్నాయని మేం నివేదికలు బయటపెడితే.. మాపై విరుచుకుపడి బూతులు తిట్టారు. ఈ మరణాలకు ఏం సమాధానం చెబుతారు? మహిళల తాళిబొట్లు తెగిపోయినా వారి సంపాదన వారికి రావాలి. రాష్ట్రంలో రౌడీయిజం పరాకాష్ఠకు వెళ్లింది’ అని చెప్పారు. క్రైం సినిమాలు, నవలల్లో కూడా ఇన్ని దుర్మార్గాలు చూపించలేరని తెలిపారు. ‘నోరు తెరిస్తే చంపేస్తామని బెదిరింపులు. రాష్ట్రం ఆటవికరాజ్యంగా మారిపోయింది. దీనిపై ప్రతి ఇంటిలో చర్చ జరగాలి’ అని అన్నారు.


అప్పులు ఎన్ని రోజులు వస్తాయి?

‘సంపద సృష్టించి ఆదాయం పెంచకుండా అప్పులపై ఎన్ని రోజులు ఆధారపడతారు? అప్పులు దొరక్కపోతే ఏం చేస్తారు? గోచీ తీసి ఇస్తారా? అప్పులు ఎన్ని రోజులు వస్తాయి? అవి రాకపోతే పఽథకాలు నిలిపివేస్తారా? నాన్న బుడ్డితోనే అమ్మ ఒడి. అందులోనూ కోతలు. ప్రచారం పిచ్చి ముదిరి పథకాలకు అంబేడ్కర్‌ పేరు తీసేసి జగన్‌ పేరు పెట్టుకుంటున్నారు. తమ సమస్యల కోసం పోరాడారని టీచర్లను, ఉద్యోగులను వేధిస్తున్నారు. విలీనం పేరుతో తరగతులను వేరే ఊర్లకు మార్చివేస్తున్నారు. కక్ష రాజకీయాలు తప్ప పేదల పిల్లల అవస్థలు వీరికి పట్టడం లేదు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని మూలన పడవేసి మూడు రాజధానుల పేరుతో హడావుడి చేశారని, ఇప్పుడు అవీ లేకుండా పోయాయన్నారు. 


ఆస్తులు కూడా లాక్కుంటారేమో?

అధికారం, పోలీసులు చేతిలో ఉన్నాయని.. ఏం చేసినా చెల్లిపోతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, రేపు ప్రజల ఆస్తులు కూడా లాక్కునే పరిస్థితి వస్తుందేమోనని అనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘గౌరవప్రదంగా ఉండాల్సిన ఎంపీ బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తే పిలిచి మందలించాల్సిందిపోయి సమర్థిస్తున్నారు. పైగా మాపై కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా ఇది?’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-20T09:38:34+05:30 IST