పడకేసిన సంపద కేంద్రాలు

ABN , First Publish Date - 2022-05-22T06:43:52+05:30 IST

స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నిర్వహణ లోపంతో పడకేశాయి.

పడకేసిన సంపద కేంద్రాలు
చీడిగుమ్మలలో రోడ్డుపక్కన చెత్తకు నిప్పంటించిన దృశ్యం

చెత్త కుప్పల మధ్య గ్రామాలు 

తడి, పొడి చెత్తపై గ్రామస్థుల్లో కొరవడిన శ్రద్ధ

రహదారుల పక్కన నిప్పు పెడుతున్న సిబ్బంది

చెత్త సేకరణపై దృష్టి సారించని అధికారులు 

 

గొలుగొండ, మే 21: 

 స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నిర్వహణ లోపంతో పడకేశాయి.  ఏడాదిగా వేతనాలు అందక పారిశుధ్య కార్మికులు తూతూమంత్రంగా పనిచేస్తుండడంతో పల్లెలు చెత్తకుప్పలతో నిండిపోతున్నాం. ఫలితంగా దుర్గంధం మధ్య జీవించాల్సిన దుస్థితి ఎదురవుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గొలుగొండ మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలు నిర్మించారు. ఉపాధి హామీ పథకంలో రూ.1.4 కోట్ల వ్యయంతో  వీటిని నెలకొల్పారు. 12 గ్రామ పంచాయతీల్లో వర్మీ కంపోస్టు ఎరువులు తయారుచేసే యూనిట్లను కూడా నిర్మించారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను సంపద కేంద్రాలకు తరలించి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీతోపాటు, గాజు సీసాలను ముక్కలుగా చేసి విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్మీ కంపోస్టును  కిలో రూ.10 చొప్పున రైతులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనివల్ల పంచాయతీలకు ఆదాయం పెరగడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత నెలకొంటుందని భావించింది. అయితే నిర్వహణ లోపంతో చెత్త నుంచి సంపద తయారుచేసే కేంద్రాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. గాజుసీసాలను ముక్కలుగా చేసే యంత్రాలు కూడా మూలకుచేరాయి. వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ కూడా నిలిచిపోయింది. 

చెత్తకు నిప్పుతో ముప్పు 

ఇదిలా ఉండగా గ్రామాల్లో అడపాదడపా సేకరించిన చెత్తను రోడ్లపక్క పడేసి నిప్పంటిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే రోడ్లుకు ఇరువైపులా కుప్పలుగా దర్శనమిస్తోంది. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు నియమించిన పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పని చేయడం లేదు. వీరికి ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడంతో వీలున్నప్పుడు పనిలోకి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చీడిగుమ్మల గ్రామంలో చెత్తను సంపద కేంద్రానికి తరలించకుండా ప్రధాన రహదారి పక్కనే పోగులు వేసి నిప్పంటిస్తున్నారు.

సిబ్బంది కొరతతో ఇబ్బంది 

చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణపై ఈవోపీఆర్డీ రఘురాం వద్ద ప్రస్తావించగా వర్మీ కంపోస్టు తయారీకి సిబ్బంది కొరత ఉందన్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలు వినియోగంలోకి తేవాలని కార్యదర్శులను ఆదేశించామన్నారు.  

కార్యదర్శులదే బాధ్యత 

దీనిపై ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌ వద్ద ప్రస్తావించగా, మండలంలోని అన్ని పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు జనాభాను బట్టి పారిశుధ్య కార్మికులను నియమించామన్నారు. సంపద కేంద్రాలు విధిగా నిర్వహించాలని, ఎరువుల తయారీ చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించామన్నారు.  

వినియోగంలోకి తెస్తాం 

చెత్త నుంచి సంపద కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ససకాలంలో వేతనాలు అందడం లేదు. ఫలితంగా ఇబ్బంది ఎదురవుతోంది. దీనిపై కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని కేంద్రాలను వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. 

- శిరీషారాణి, డీఎల్‌పీవో  

Updated Date - 2022-05-22T06:43:52+05:30 IST