పోడు తీరని గోడు!

ABN , First Publish Date - 2022-06-28T07:39:35+05:30 IST

రాష్ట్రంలో పోడు భూముల సమస్యను ప్రభుత్వం పక్కన పెట్టేసిందా? హక్కు పత్రాల జారీ కష్టమేనా? ఏడు నెలల క్రితం..

పోడు తీరని గోడు!

సమస్యను పక్కన పెట్టిన సర్కారు.. 7 నెలలుగా పెండింగ్‌లో దరఖాస్తులు

హక్కు పత్రాల జారీ లేనట్టే?.. గిరిజనేతరుల దరఖాస్తులకు ని‘బంధనాలు’

తిరస్కరిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా

వానాకాలం సీజన్‌ వేళ పోడు భూముల వద్ద మళ్లీ ఉద్రిక్తతలు

వేర్వేరు ప్రాంతాల్లో పోడు రైతులపై అటవీ అధికారుల దాడులు


హైదరాబాద్‌/ఆదిలాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోడు భూముల సమస్యను ప్రభుత్వం పక్కన పెట్టేసిందా? హక్కు పత్రాల జారీ కష్టమేనా? ఏడు నెలల క్రితం ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశే మిగలనుందా?... రాష్ట్రంలోని పోడు రైతుల్లో ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో ఒక వైపు రైతులు పోడు భూముల్లో సాగుకు సన్నద్ధమవుతుండగా.. అటవీ అధికారులు అడ్డుకుంటుండడం... అడవుల్లో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గతంలో ప్రతి సీజన్‌లోనూ అటవీ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణలు జరగడం పరిపాటిగా ఉండేది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అర్హులైన రైతులకు హక్కు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించిన ప్రభు త్వం.. గత ఏడాది నవంబరు 8 నుంచి డిసెంబరు 16 వరకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి సుమారు 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు హక్కు పత్రాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభు త్వం దృష్టి పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 


గిరిజనేతరుల దరఖాస్తులూ ఎక్కువే

2005 డిసెంబరు 13 కన్నా ముందు నుంచీ అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, 1930 నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు మాత్రమే పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు పొం దేందుకు అర్హులని అటవీ హక్కుల చట్టం-2006 చెబుతోంది. అంటే.. గిరిజనేతరులు 1930 నాటి నుంచి పోడు భూమిని సాగు చేసుకున్నట్లుగా ఆధారాలు చూపాలి. ఇది సాధ్యమయ్యే అవకాశం లేదని, ప్రభుత్వం కావాలనే కొర్రీలు పెడుతోందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ నిబంధనపై తాజాగా ప్రభుత్వం కూడా అవగాహన కల్పించకపోవడంతో పోడు భూములపై హక్కుల కోసం గిరిజనులతోపాటు గిరిజనేతరులూ అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గిరిజనేతరులను కాదని గిరిజనుల కు హక్కుపత్రాలు ఇస్తే వ్యతిరేకత వస్తుందేమోనని అధి కార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేసినా.. పట్టా లు దక్కని వారు గొడవలకు దిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయపరమైన ఆటంకాలు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, అటవీ భూములకు హక్కు ప త్రాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంటుం దా? లేదా? అన్నది సందేహాస్పదమే. ఈ పరిణామాల దృష్ట్యా ఇప్పట్లో పోడు భూములకు హక్కు పత్రాలను జారీ చేయడం అనుమానంగానే కనిపిస్తోందని కొందరు అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.


పూర్తిగా పోడు వ్యవసాయంపైనే..

ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గోండు, కోయ, బంజారా, చెంచు రైతులు పూర్తిగా పోడు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో వీరికి పోటీగా కొందరు గిరిజనేతరులు పోడు భూముల్లో కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. దీంతో అడవి విచ్చలవిడిగా నరికివేతకు గురవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం అం దుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్రమణ కు గురవుతున్న అడవిని గుర్తించి, పోడు సాగును అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగానే అటు అధికారులకు, ఇటు పోడు రై తులకు వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తాజా గా వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో క్షేత్ర స్థాయి లో పోడు భూముల జోలికి వెళ్తే ఎవరు... ఎవరిపై దాడు లు చేస్తారోనన్న భయం అటు అటవీ అధికారులు, ఇటు పోడు రైతుల్లో నెలకొంది. 


కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు

పోడు సాగు చేపడుతున్నారంటూ ఇరవై రోజుల క్రి తం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 12 మంది మహిళ రైతులను అటవీ శాఖాధికారులు అరెస్టు చేసి జైలుకు పంపడంపై తీవ్ర దుమారం రేపింది. దీన్ని నిరసిస్తూ ఉట్నూర్‌ ఐటీడీఏను ఆదివాసీ సంఘాల నేతలు ముట్టడించి ఆందోళనకు దిగడం.. ఉద్రిక్తతకు దారి తీసిం ది. అలాగే, రెండు రోజుల క్రితం భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు, మద్దుకూరు శివారుల్లో పోడు రగడ మరోసారి రాజుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో వలస ఆదివాసీలు గత 15 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ట్రాక్టర్లతో దుక్కులు దున్నే ప్రయత్నం చేయగా పోడు సాగుదారులైన మహిళలు అడ్డుకున్నారు. అధికారులు, సిబ్బంది దాడి చేయగా పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ములకపల్లి మండలం మామిళ్లగూడెంలో  గొ త్తికోయలు పోడు సాగుకు యత్నించగా అధికారులు  అడ్డుకున్నారు. సంప్రదింపులు జరిపి.. వంద ఎకరాలకు బదులుగా 25 ఎకరాల్లోనే సాగు చేసుకునేటట్లు వారిని ఒప్పించారు. దీంతో ఆ గొడవ సద్దుమణిగింది.


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు

పోడు భూములకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. వీటిపై తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రైతులు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలు లేనిదే హక్కు పత్రాలను జారీ చేయడం సాధ్యమయ్యే పని కాదు.

- రాజశేఖర్‌, డీఎ్‌ఫవో, ఆదిలాబాద్‌


బడాబాబులకు కట్టబెడుతున్నారు

అభివృద్ధి, పరిశ్రమల పేరిట బడా బాబులు, కార్పొరేట్లకు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెడుతోంది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన రైతులను మాత్రం వేధిస్తోంది. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజే 12 మంది మహిళ రైతులను అరెస్టు చేసి జైలుకు పంపడం బాధాకరం. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తాం. 

- గోడం గణేశ్‌, తుడందెబ్బ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-06-28T07:39:35+05:30 IST