తీరని రేషన్‌ కష్టాలు!

ABN , First Publish Date - 2022-08-11T06:03:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం గత మూడేళ్ల క్రితం కొత్త పంచా యతీలను ఏర్పాటు చేసినా.. ప్రజల కష్టాలు మాత్రం తీర డం లేదు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలకు గాను 229 తండాలు, గూడాలను కలిపి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అలా గే జిల్లాకేంద్రం చుట్టు ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ లో విలీనం చేశారు. కొత్త పంచాయతీలు ఏర్పడితే ఇక తమ బాధలు దూరమవుతాయని భావించి నా..

తీరని రేషన్‌ కష్టాలు!
వాగులో నుంచి ఎడ్లబండిపై రేషన్‌ సరుకులను తీసుకెళ్తున్న కొత్తపల్లి గిరిజలు

జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పడినా.. గిరిజనులకు తప్పని ఇబ్బందులు

రేషన్‌ సరుకుల కోసం కిలోమీటర్ల మేర లబ్ధిదారుల కాలినడక

ప్రతిపాదనలు పంపించి రెండేళ్లయినా.. సర్కారు నుంచి స్పందన కరువు

పట్టించుకోని పాలకులు, అధికారులు

జిల్లావ్యాప్తంగా మొత్తం 355 రేషన్‌ షాపులు.. మరో 112 కోసం ప్రతిపాదనలు 

ఆదిలాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం గత మూడేళ్ల క్రితం కొత్త పంచా యతీలను ఏర్పాటు చేసినా.. ప్రజల కష్టాలు మాత్రం తీర డం లేదు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలకు గాను 229 తండాలు, గూడాలను కలిపి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అలా గే జిల్లాకేంద్రం చుట్టు ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ లో విలీనం చేశారు. కొత్త పంచాయతీలు ఏర్పడితే ఇక తమ బాధలు దూరమవుతాయని భావించి నా.. మారుమూల గిరిజన గ్రామాలకు అవే కష్టాలు ఎదురవుతున్నాయి. కొత్తపంచాయతీ ఏర్పడిందన్న సంబరమే తప్ప ఎలాంటి వసతులు, సౌకర్యాలకు నోచుకోవడమే లేదని పలు గ్రా మాల ప్రజలు ఆరోపిస్తున్నా రు. గత రెండేళ్ల క్రితం స్వయాన సీఎం కేసీఆరే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో రేషన్‌ షాపులను ఏర్పా టు చేస్తామని ప్రకటించా రు. అయినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి హామీ అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుతం 355 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. అదనంగా మరో 112 రేషన్‌ షాపుల మంజూరుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండేళ్లు గడు స్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పంద నే లేదంటున్నారు. ప్రస్తుతం కూడా గతంలో మాదిరిగానే కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఇతర గ్రామాల నుంచి రేషన్‌ సరుకులను తెచ్చు కుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా మా రుమూల గిరిజన గ్రామాలే కావడంతో వానాకాలంలో ఇబ్బందులు రెట్టిం పవుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో నడిచేందుకే కష్టంగా ఉన్నదారుల్లో రేషన్‌ సరుకులను నెత్తిన పెట్టుకుని బురద మయంగా మారిన దారిపై భయం భయంగా నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదేక్రమంలో బజార్‌హత్నూర్‌ మం  డలం కొత్తపల్లి గ్రామస్థులు ఇతర గ్రామాల నుంచి రేషన్‌ సరుకులను తీ సుకొచ్చుకునేం దుకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ గ్రామస్థులు తాంసి(కె) గ్రామం నుంచి కాలినడకన రేషన్‌ సరుకుల కోసం అవస్థలు పడుతున్నారు. ఇలా జిల్లాలో మరెన్నో గ్రామాలకు ఇవే ఇబ్బందులున్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు రేషన్‌ స రుకుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. కొత్త పంచాయతీలలో పాలన మొదలైనా ఇబ్బందులు తీరడం లేదంటున్నారు. 

వానాకాలంలో అష్టకష్టాలు

వానాకాలం వచ్చిందంటే మారుమూల గిరిజన గ్రామాలు, తండాలకు వణుకు పుట్టిస్తోంది. ఎన్నో అష్టకష్టాలు పడి గ్రామస్థులు రేషన్‌ సరుకుల ను తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతీనెల రేషన్‌సరుకుల కోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. కొంద రు గ్రామస్థులు కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌, ఆటోలపై రేషన్‌ సరుకులను తెచ్చుకుంటుండగా.. ఎలాంటి ఆధారం లేని నిరుపేద గిరిజనులు రేషన్‌ బియ్యాన్ని నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్తున్నారు. ఏజెన్సీ మారుమూ ల గిరిజన గ్రామాలకు కనీసం దారులు కూడా సరిగా లేకపోవడంతో ఒర్రెలు, గుట్టలు, వాగులు దాటుతూ రేషన్‌ సరుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి, శీతాకాలాల్లో పరిస్థితులు కొంతమెరుగ్గానే ఉన్నా..  వర్షాకాలంలోనే నడవలేని పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. కొంద రైతే రేషన్‌ సరుకులను తెచ్చుకోవడం ఇబ్బందికరంగా మా రడంతో వృథాగానే వదిలేస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు ఉన్న సరుకులతోనే సరిపెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా నే రేషన్‌ సరుకులను అందజేస్తున్నా.. వాటిని తెచ్చుకునేందుకు వందల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌ షాపుల ఏర్పాటుకు కొర్రీలు

పాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి నా దానికనుగుణంగా వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచా యతీలలో రేషన్‌ షాపులను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాం డ్లు వస్తున్నా.. ప్రస్తుతం అది సాధ్యమయ్యే పనికాదని అధికారు లు కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే జిల్లాలో 250 నుంచి 300 జనాభా ఉన్న తండాలు, గూడాలను కూడా ప్రభుత్వం ఆగమేఘాల మీద కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇలాంటి పంచా యతీల్లో కేవలం 40నుంచి వంద లోపే రేషన్‌కార్డులు ఉన్నట్లు తెలుస్తుం ది. దీంతో కార్డుల సంఖ్య తక్కువగా ఉన్నాయన్న సాకుతో రేషన్‌ షాపుల ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదన్నట్లు తెలు స్తుంది.  కనీసం 500 నుంచి 600 రేషన్‌ కార్డులు ఉంటేనే కొత్త షాపుల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన అధిక గ్రామాలలో 500 లోపే జనాభా ఉన్నట్లు అధికారి క లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రేషన్‌ షాపుల ఏర్పాటుపై అన్ని అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కోరగానే జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో కొత్త రేషన్‌ షాపుల ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్‌ సరుకులతో వాగుదాటలేక పోతున్నాం

: సిడాం జంగు, కొత్తపల్లి, బజార్‌హత్నూర్‌ మండలం

మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో రేషన్‌ సరుకు లతో వాగులో నుంచి వరదనీటిని దాటలేక పోతున్నాం. మా గ్రామం మండలకేంద్రానికి ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా గ్రామానికి వెళ్లాలంటే కాలినడకన బండ్రెవ్‌ వాగును దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇది తప్ప మాకు ఇంకో మార్గం లేదు. వాగు వరకు కాలినడకన నెత్తిపై రేషన్‌ సరుకులను తీసుకొచ్చి వాగు నీటిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై గ్రామానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు దూరమవుతాయి.

ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం

: సుదర్శన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఆదిలాబాద్‌

మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఎలాంటి రేషన్‌ ఇబ్బందు లు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా ఏర్ప డిన గ్రామ పంచాయతీలలో రేషన్‌ షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే కొత్త షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. మారుమూల గిరిజన గ్రామాలకు ఇబ్బందులు కలుగకుండా తక్కువ జనాభా ఉన్న గ్రామాలలోను రేషన్‌ షాపులను ఏర్పాటు చేస్తున్నాం. అయితే కత్త రేషన్‌ షాపుల ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం నిర్నయం తీసుకోవాల్సి ఉంది. 

Updated Date - 2022-08-11T06:03:37+05:30 IST