ఫారిన్‌ సర్వీసుపై.. తీరని మోజు

ABN , First Publish Date - 2020-08-05T10:53:44+05:30 IST

కొందరు ఉపాధ్యాయులకు ఫారిన్‌ సర్వీసులపై మోజు తగ్గడం లేదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం కంటే, బోధనేతర కార్యకలాపాలపైనే వారు మక్కువ

ఫారిన్‌ సర్వీసుపై.. తీరని మోజు

సెక్టోరియల్‌ పోస్టుల కోసం ఉపాధ్యాయుల పైరవీలు

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వద్దకు పరుగులు 

నిబంధనలకు విరుద్ధంగా ప్రయత్నాలు

దొడ్డిదారిన పోస్టులు పొందాలనే యోచన 8 ఉమ్మడి జిల్లాలో 20 పోస్టులు


మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి :

కొందరు ఉపాధ్యాయులకు ఫారిన్‌ సర్వీసులపై మోజు తగ్గడం లేదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం కంటే, బోధనేతర కార్యకలాపాలపైనే వారు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో సెక్టోరియల్‌ పోస్టుల కోసం పైరవీలు మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకు మించి ఫారిన్‌ సర్వీసు అవకాశం ఉండదు. కానీ, ఇప్పటికే ఐదేళ్లు గడిచినా మరోసారి ఆ పోస్టుల కోసం వెంపర్లాడుతున్నారు. ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఉన్న 20 పోస్టులను దక్కించుకోవడం కోసం ఇప్పటికే ఆ పోస్టుల్లో ఉన్నవారు పైరవీలు ప్రారంభించగా, ఆరు నెలల కిందట ఈ పోస్టుల కోసం పరీక్ష రాసిన వారు మెరిట్‌ ప్రాతిపదికనే ఎంపిక చేయాలని కోరుతున్నారు.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సెక్టోరియల్‌ పోస్టుల కోసం పలువురు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కేజీబీవీల పర్యవేక్షణతోపాటు, విద్యార్థులకు దుస్తుల పంపిణీ, ఉపాధ్యాయులకు శిక్షణ లు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎంఐఎస్‌ నిర్వహణ తదితర బోధనేతర పనుల నిర్వహణకు గాను విద్యాశాఖ సమగ్రశిక్షా అభియాన్‌ కింద సెక్టోరియల్‌ అధికారులను నియమిస్తుంది. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులను ఈ పోస్టుల్లో నియ మించాల్సి ఉంటుంది. నాలుగు విభాగాలుగా నియమితు లయ్యే ఈ పోస్టుల్లో ప్రతి జిల్లాకు ఒక్కో విభాగానికి ఒక్కో ఉపాధ్యాయుడిని సెక్టోరియల్‌ అధికారిగా నియమి స్తారు. ఏఎంవో (సెక్టోరియల్‌-1) అధికారిగా నియమి తులయ్యే వారిని మాత్రం గెజిటెడ్‌ ప్రధానో పాధ్యా యులనే నియమించగా, మిగిలిన మూడు అధికారుల పోస్టులలో స్కూల్‌ అసిస్టెంట్‌, రిటైర్డ్‌ ఉపాధ్యా యులను నియమిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఐదు ఏఎంవో పోస్టులు ఉండగా, 15 ఇతర సెక్టోరియల్‌ అధికారుల పోస్టులు ఉన్నాయి. 


మళ్లీ కొనసాగేందుకు మొదలయిన పైరవీలు 

విద్యాశాఖ నిబంధనల ప్రకారం మూడేళ్ల ఫారిన్‌ సర్వీసు ముగిసిన ఉపాధ్యాయులంతా తిరిగి బోధనకు రావాల్సి ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో మాత్రం సెక్టోరియల్‌ అధికారులుగా నియమితులైన పలువురు ఉపాధ్యాయులు ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయినా మళ్లీ ఆ పోస్టుల్లోనే కొనసాగేందుకు పైరవీలు మొదలుపెట్టారు. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. మూడేళ్ల పాటు ఈ పోస్టుల్లో ఉన్నవారిని తిరిగి నియమించకూడదనే నిబంధనలున్నా, వీరు మాత్రం ఎలాగైనా పోస్టులు కొట్టేయాలనే సంకల్పంతో పైరవీల్లో ఉన్నారు. హోదా, కారు, అలవెన్సులతో పాటు విద్యాశాఖలో పలు పైరవీలకు ఈ పోస్టులు ఉపయోగపడుతుండడంతో ఆ వ్యవహారాల్లో పట్టుసాధించిన వీరు ఎలాగైనా మళ్లీ పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్టుల నియమాకాల కోసం రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 800 మంది ఉపాధ్యాయులు పరీక్షలు రాశారు.


వీటి ఫలితాలను ఆరు నెలల కిందట మెరిట్‌ జాబితాతో సహా విడుదల చేశారు. అప్పుడే నియామకాలు జరపాల్సి ఉన్నా, కొవిడ్‌-19 నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆ ఫలితాలు హోల్డ్‌లో ఉండగానే, పాత వారు తిరిగి తమకు దొడ్డిదారిన ఈ పోస్టులు ఇప్పించాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు మొదలుపెట్టడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మళ్లీ ఈ పోస్టులు ఎలా ఇస్తా రని పలు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు జరిపితే కోర్టుని ఆశ్రయిస్తామని కొందరు నాయకులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2020-08-05T10:53:44+05:30 IST