నిర్మానుష్యం

ABN , First Publish Date - 2020-04-13T05:50:36+05:30 IST

పొగలేని ఫ్యాక్టరీ గొట్టాల్లోని గుండ్రని శూన్యానికి కృతజ్ఞతలు చెబుతూ పక్షుల గుంపులు తెల్లగా కర్మాగారాల మీదినుండి కదులుతున్నాయి. వ్యర్థ రసాయనాలు కలవని ప్రవాహంలో...

నిర్మానుష్యం

పొగలేని

ఫ్యాక్టరీ గొట్టాల్లోని గుండ్రని శూన్యానికి

కృతజ్ఞతలు చెబుతూ

పక్షుల గుంపులు తెల్లగా

కర్మాగారాల మీదినుండి కదులుతున్నాయి.

వ్యర్థ రసాయనాలు కలవని ప్రవాహంలో

చేప పిల్లలు

పట్టరాని ఆరోగ్యంతో ఎగిరి గంతులేస్తున్నాయి.

వేటు పడని చెట్లనుండి

రోజంతా

వేల ఆకుల నీడలు గలగల మంటున్నాయి.

ఒక్కటి కూడా చనిపోకుండా

వందల చీమలు

నడిరోడ్లను నిర్భయంగా దాటి

అవతలికి చేరుకుంటున్నాయి.

నిలిచిపోయిన వాహనాల టైర్ల మధ్యలో

సాలె పురుగులు

సామ్రాజ్యాల్ని నిర్మించుకుంటున్నాయి.

రాళ్ళ దెబ్బలు తినని వీధి కుక్కలు

వేసవి చెట్ల నీడలో

మధ్యాహ్నపు నిద్రననుభవిస్తున్నాయి.

పంటపొలాల మధ్య రోడ్లపై

పడగవిప్పి పాములు

ప్రతిరోజూ నాట్యమాడుతున్నాయి.

ఇప్పుడిప్పుడే

ఆకాశంలో కనిపిస్తోన్న

ఆకుపచ్చ రంగుని చూసి

చిగురించిన ఆశతో

కోతులు ఊళ్లను వదిలి

అడవులవైపు కదులుతున్నాయి.

బొరియల్లోంచి బయటికొచ్చిన

లక్షల పీతలు

అలల ఆఖరి బొట్లతో కలిసి

నిరంతరాయంగా ఆడుకుంటున్నాయి.

పూర్తిగా అందుతున్న

ప్రాణవాయువుని పీల్చుకొని

గొంగళి పురుగులు

ఆహ్లాదంగా కదులుతున్నాయి.

పరుచుకున్న

నిశ్శబ్దపు రంగుని కూడా అతికించుకుని

సీతాకోక చిలుకలు

నిర్మానుష్య వీధుల్లో ఎగురుతున్నాయి

రాబోయే వానాకాలాన్ని

ఓజోన్‌ పొర

శుభ్రంగా తుడుస్తోంది.

పూలకు నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాత్రికి మిణుగురుల పాట

శ్రావ్యంగా వినిపిస్తోంది.


పరిణామక్రమంలో

చిన్న పొరపాటు జరిగింది.

‘మనం మధ్యలో వచ్చాం’

అన్న విషయాన్ని

మానవజాతి మొదట్లోనే మర్చిపోయింది.

భగవంతం


Updated Date - 2020-04-13T05:50:36+05:30 IST