న్యూయార్క్: ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత ఉన్న అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లలో మన తెలుగమ్మాయి, డిజైనర్ దీప్తి దొడ్ల రాణించారు. ‘ద్రిష క్లాజెట్’ సీఈఓ దీప్తి అమెరికాలో టెన్నెస్సీలో నివాసం ఉంటారు. స్థానిక తెలుగు సంఘం అధ్యక్షరాలిగా ఇంతకు మునుపే సేవలందించడం వల్ల అందరికీ సుపరిచితురాలే. ఈ మధ్యనే ముగిసిన 79 సంవత్సరాల చరిత్ర కలిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ‘ద్రిష క్లాజెట్’కి ప్రాతినిధ్యం వహిస్తూ తన డిజైన్స్‌ని మెరికల్లాంటి 40 మంది మోడల్స్‌తో ప్రజంట్ చేశారు. న్యూయార్క్‌లోని గోతం హాల్లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో ‘ద్రిష క్లాజెట్’తో ప్రారంభం కావడం విశేషం. రియాలిటీ టీవీ స్టార్స్, ప్రముఖ మోడల్స్ ఈ షో బిగినర్స్ మరియు షో స్టాపర్స్ అవడం మరో విశేషం. ఇదే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో మరో షో మిలియన్స్‌లో ఔట్రీచ్ ఉన్న ‘హైటెక్ మోడ’ కూడా అందమైన మోడల్స్‌తో ఇంక్లూసివ్ షోగా ముగిసింది.
ఇవి కూడా చదవండి
ఇక గత వారం నిర్వహించిన ప్రత్యేకమైన లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్‌లో కూడా డిజైనర్ దీప్తి ‘ది ఫ్యాషన్ లైఫ్ టూర్’లో ‘ద్రిష క్లాజెట్’ని అన్ని దేశాలకు చెందిన సెలబ్రిటీ మోడల్స్‌తో ప్రదర్శించారు. ప్రముఖ నటి, రికార్డింగ్ కళాకారిణి అయిన మిలా నాబొర్స్ ఈ షోకి షో స్టాపర్ అవడం గర్వించదగ్గ విషయం. ఫ్యాషన్ రంగంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నిలబడడం తెలుగు ఆడపడుచులకు కష్టమే. అయినప్పటికీ వినూత్నమైన కటింగ్ ఎడ్జ్ డిజైన్స్‌తో మిగతా ట్రెండీ డిజైనర్లకు పోటాపోటీగా రెండు ఫ్యాషన్ వీక్లలోనూ తన డిజైన్లను ప్రదర్శించిన దీప్తి, వివిధ దేశాల టాప్ మోడల్స్‌ని సమన్వయం చేసుకుంటూ డిజైనర్‌గా తన బ్రాండింగ్‌ని అభివృద్ధి చేసుకుంటూ ఫ్యాషన్ రంగంలో దూసుకెళుతున్నారు.