Abn logo
Sep 23 2021 @ 20:24PM

NRI లకు Modi సర్కారు స్పెషల్ ఆఫర్.. రూ.5 లక్షలను గెలుచుకునే ఛాన్స్..!

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఎన్నారైలకు మోదీ సర్కార్ ఓ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా ఎన్నారైలు అక్షరాల రూ. 5లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆఫర్ ఎంటో చెప్పలేదు కదూ. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల సందర్శనార్థం యమున నది ఒడ్డున ఓ ప్రత్యేక నిర్మాణాన్ని(గార్డెన్) నిర్మించాలని చూస్తోంది. తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ నిర్మాణానికి కావాల్సిన పర్‌ఫెక్ట్ డిజైన్‌ను ఎవరైతే చేసి పెడతారో వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ డిజైన్ కాంపిటీషన్‌లో ఎన్నారైలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని తాజాగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నగదు బహుమతితో పాటు ప్రత్యేక నిర్మాణంపై విజేతగా నిలిచిన వారి పేరు కూడా ముద్రిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో అదే ఏడాది ఈ ప్రత్యేక నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రిత్వశాఖ భావిస్తుంది. 'నవ భారత్ ఉద్యాన్'(న్యూ ఇండియా గార్డెన్) పేరుతో యమున నది ఒడ్డున 22.22 హెక్టార్లలో ఈ ప్రత్యేక నిర్మాణాన్ని చేపడుతోంది. దీని డిజైన్ కోసం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఎంట్రీలను పిలవడం ఇది రెండోసారి. ఇప్పటికే కొందరు డిజైనర్లు కొన్ని డిజైన్లు పంపించడం జరిగింది. కానీ, వారిలో ఎవరూ తమ అంచనాలను అందుకోలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో తమ అంచనాలకు తగ్గట్టుగా సరియైన డిజైన్ పంపించే వారికి రూ. 5లక్షల నగదు బహుమతితో పాటు విజేత పేరును ప్రత్యేక నిర్మాణంపై ముద్రించనున్నట్లు వెల్లడించింది. 


ఇక పూర్తిగా ప్రజల కోసం నిర్మిస్తున్న ఈ గార్డెన్‌లో ఐక్యతను చాటే టీవీ కార్యాక్రమాల ప్రసారం కోసం ప్రత్యేక హాల్, మైల్‌స్టోన్స్ వాల్క్‌వే, జర్నీ ఆఫ్ ఇండియా, టెక్ డోమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇలా పలు ప్రత్యేక నిర్మాణాలు ఇందులో ఉండేలా డిజైన్ ఉండాలని తెలిపింది. ప్రస్తుత గ్రౌండ్ లెవెల్ నుంచి 134 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ గార్డెన్ నుంచి చూస్తే ఇండియా గేట్, సెంట్రల్ విస్తా మొత్తం కనిపించేలా ఈ నిర్మాణం ఉంటుందని గతవారం జరిగిన ఓ వెబినార్‌లో మంత్రిత్వ శాఖ సెక్రెటరీ దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. 


తాజా వార్తలుమరిన్ని...