డీజిల్‌ పైపైకి..

ABN , First Publish Date - 2021-10-17T05:31:33+05:30 IST

డీజిల్‌ పైపైకి..

డీజిల్‌ పైపైకి..

సెంచరీ దాటేసి రూ.103.91కు చేరిన లీటర్‌ ధర

రెండు వారాల్లో రూ.4.24 పెరుగుదల

రవాణా రంగంపై రూ.483 కోట్ల భారం 

వ్యవసాయరంగంపైనా ప్రభావం

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : డీజిల్‌ ధర పైపైకి ఎగబాకుతోంది. జిల్లావ్యాప్తంగా శనివారం డీ జిల్‌ ధర  లీటర్‌ రూ.103.91కు చేరింది. పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటేసి రూ.111.41కు చేరిన విధంగానే డీజిల్‌ ధరలు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో రవాణా రంగం అల్లాడిపోతోంది. ఈనెల ఒకటో తేదీన రూ.99.67 ఉన్న డీజిల్‌ లీటర్‌ ధర ఆ మరుసటి రోజు రూ.99.98కు చేరింది. మూడో తేదీన రూ.100.30కు చేరి సెంచరీ దాటింది. 

రెండు వారాలుగా రోజూ పెరుగుదల

రెండు వారాలుగా డీజిల్‌ ధరలు పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 3, 4 తేదీల్లో రూ.100.30గా ఉన్న లీటర్‌ ధర 5న రూ.100.61, 6న రూ.100.98, 7న రూ.101.35, 8న రూ.101.72, 9న రూ.102.08, 10న రూ.102.45, 11, 12, 13 తేదీల్లో రూ.102.81తో మూడు రోజులు స్థిరంగా ఉంది. మళ్లీ 14వ తేదీన రూ.103.18, 15న రూ.103.55, 16న రూ.103.91కు చేరుకుంది. 

రవాణా రంగం విలవిల

డీజిల్‌ ధరల పెరుగుదల వివిధ వర్గాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. రవాణా రంగంపైనే కాకుండా రైతాంగంపైనా ఈ ప్రభావం ఉంటోంది. పరోక్షంగా ప్రజలపైనా పడుతోంది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా రవాణా రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. సెకండ్‌ వేవ్‌ తగ్గినా 15 శాతం మేర లారీలు ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రూ.కోట్లలో భారం

జిల్లాలో 45వేల లారీలు ఉన్నాయి. ఇందులో 25వేల లారీలకు జాతీయ పర్మిట్లు ఉన్నాయి. సాధారణ లారీలతో పాటు ఆయిల్‌ ట్యాంకర్లు, గ్యాస్‌ ట్యాంకర్లు, మిల్క్‌ ట్యాంకర్లు, ట్రాలీలు వంటివి ఈ కోవలో ఉంటాయి. మిగిలిన 20వేల లారీలు అంతర్రాష్ర్టీయంగా తిరుగుతుంటాయి. వీటిలో చిన్న లారీలు, టిప్పర్లు, పెద్ద టిప్పర్లు ఉంటాయి. సగటున ఒక జాతీయ పర్మిట్‌ లారీ రోజుకు 100 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఈ నెలలో పెరిగిన రూ.4 భారంతో రోజూ 25వేల నేషనల్‌ పర్మిట్‌ లారీలపై రూ.కోటి భారం పడుతోంది. నెలకు రూ.30 కోట్లన్నమాట. ఏడాదికి రూ.360 కోట్లు. చిన్న లారీలైతే సగటున 30 లీటర్ల మేర డీజిల్‌ను వినియోగిస్తాయి. వీటిపై రోజుకు రూ.24 లక్షల భారం పడుతుంది. నెలకు రూ.7.21 కోట్లు కాగా, ఏడాదికి రూ.86.40 కోట్లు. ఈ లెక్కన ఒక్క లారీ రవాణా రంగంపైనే రూ.446.4 కోట్ల మేర భారం పడుతోంది. ఆ తర్వాత భారం ఆటోవాలాలదే. జిల్లావ్యాప్తంగా 35వేల ఆటోలు ఉన్నాయి. ఇందులో 10వేల ఆటోలు సీఎన్‌జీ కాగా, మిగిలిన 25వేల ఆటోలు సగటున రోజుకు 5 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తాయి. రోజుకు ఈ ఆటోలపై రూ.5 లక్షల భారం పడుతోంది. నెలకు రూ.1.50 కోట్లు, ఏడాదికి రూ.18 కోట్ల భారం అన్నమాట. ఇవికాకుండా మ్యాక్సీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉన్నాయి. వీటిపై రూ.7 కోట్ల మేర భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా స్కూల్‌, కాలేజీ, ప్రైవేట్‌ బస్సులు, వ్యాన్లు, రోలర్లు, అంబులెన్సులు, పొక్లెయిన్లు 8వేల వరకు ఉన్నాయి. వీటి సగటు డీజిల్‌ వినియోగం రోజుకు 10 లీటర్లు. రోజుకు రూ.3.20 లక్షలు, నెలకు రూ.96 లక్షలు, ఏడాదికి రూ.11.52 కోట్ల భారం పడుతోంది. అలాగే, రైతులు ఉపయోగించే ట్రాక్టర్లు, మోటార్లపై కూడా డీజిల్‌ భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా 600కు పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. వెయ్యికిపైగా మోటార్లు ఉన్నాయి. దీంతో డీజిల్‌ పెంపు భారం వ్యవసాయ రంగంపైనా పడుతోంది. 

సామాన్యులకు సంకటం

డీజిల్‌ పెరుగుదల భారం ఒక్క నిత్యావసర వస్తువులపైనే కాదు.. గృహోపకరణాలు, ఎలక్ర్టికల్‌, మందులు, పప్పులు, నూనెలు, కాస్మటిక్స్‌, స్టేషనరీ, ఫర్నిచర్‌, దుస్తులు వంటి వాటిపైనా పడుతోంది.  ఫలితంగా అంతిమభారం మధ్య తరగతి వర్గాలపైనే పడుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి కనిపిస్తోంది. 

Updated Date - 2021-10-17T05:31:33+05:30 IST