ప్రేమించి పెళ్ళాడిన వాడిని కాద‌నుకుంది..!

ABN , First Publish Date - 2020-06-07T13:58:40+05:30 IST

ఒక నల్లజాతి వ్యక్తి మీద అమెరికన్‌ పోలీసు డెరెక్‌ చౌవిన్‌ చేసిన దురాగతం దృశ్యాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. భర్త డెరెక్‌ చేసిన దారుణంతో గుండె మండిపోయిన అతని భార్య కెల్లీ సైతం గళం విప్పారు. ‘ఇలాంటి వాడితో కాపురం నాకొద్దు’అంటూ ఆమె కోర్టుకెక్కారు.

ప్రేమించి పెళ్ళాడిన వాడిని కాద‌నుకుంది..!

ఒక నల్లజాతి వ్యక్తి మీద అమెరికన్‌ పోలీసు డెరెక్‌ చౌవిన్‌ చేసిన దురాగతం దృశ్యాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. భర్త డెరెక్‌ చేసిన దారుణంతో గుండె మండిపోయిన అతని భార్య కెల్లీ సైతం గళం విప్పారు. ‘ఇలాంటి వాడితో కాపురం నాకొద్దు’అంటూ ఆమె కోర్టుకెక్కారు. ప్రేమించి పెళ్ళాడిన భర్త మీదే ధ్వజమెత్తిన కెల్లీకి అసమానతల మీద పోరాటం కొత్త కాదు. 


‘‘పోలీస్‌ యూనిఫారమ్‌ వేసుకున్నప్పటికీ, మా ఆయన చాలా సాఫ్ట్‌. ఇప్పటికీ నేను ఇంటికి రాగానే తలుపు ఆయనే తీస్తారు. నాకు కోటు తొడుగుతారు. నా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తరువాత, నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవాల్సి వస్తే, ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకున్నానో అవన్నీ డెరెక్‌లో ఉన్నాయి.’’


2018లో ‘మిసెస్‌ మిన్నెసోటా’ అందాల పోటీలో టైటిల్‌  సాధించిన సందర్భంగా, ఒక పత్రిక ఇంటర్వ్యూ చేసినప్పుడు కెల్లీ చెప్పిన మాటలివి. 

రెండేళ్ళు తిరిగేసరికి అదే భర్తతో విడాకులు కావాలంటూ  ఆమె కోర్టుకు వెళ్ళారు. తనకు పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోయినా భర్త నుంచి భరణం అక్కర్లేదని స్పష్టం చేశారు. తన పేరు వెనకాల అతని పేరును తొలగించుకోడానికి అనుమతి కూడా అడిగారు. కెల్లీ అభిప్రాయాల్లో ఇంత మార్పునకు కారణాలేమిటి? దీనికి సమాధానం ఆమె భర్త గురించి చెప్పిన మాటల్లో ఉంది. సామాజికంగా ఆమె ఎదుర్కొన్న అవహేళనల్లో ఉంది.


ప్రేమించి పెళ్ళాడిన వాడే...

కెల్లీ 1974లో లావోస్‌లో పుట్టారు. ఆమెకు మూడేళ్ళ వయసున్నప్పుడు, యుద్ధ పరిస్థితులు తలెత్తడంతో ఆమె కుటుంబం థాయిలాండ్‌కు వలస వచ్చింది. తరువాత అమెరికాకు చేరుకున్నారు.  కెల్లీ రేడియాలజీ టెక్నీషియన్‌ కోర్సు చేశారు. డెరెక్‌ కన్నా ముందు ఆమెకు కుజే జియాంగ్‌ అనే వ్యక్తితో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో ఆమె విడాకులు తీసుకున్నారు.మినియాపొలిస్‌ నగరంలో ఒక ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్న సమయంలో పోలీస్‌ అధికారి డెరెక్‌ను కలిశారు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2010లో వారికి వివాహం అయింది. ఆ తరువాత ఆమె ఉద్యోగం మానేశారు. కొన్నాళ్ళు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల తరఫున పని చేశారు.


జాతి వివక్ష ఆమెకు తెలుసు!

ఆగ్నేయాసియా, చైనా ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని ‘మోంగ్‌ కమ్యూనిటీ’ అని పిలుస్తారు. కెల్లీ అదే వర్గానికి చెందిన వ్యక్తి. ఆమె తన సంస్కృతి, రూపం, కాందిశీకురాలనే ముద్ర కారణంగా బాల్యంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అందుకే, మోంగ్‌ కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థలు, చిన్న చిన్న వ్యాపారస్థులకూ ఆమె ఎన్నో సార్లు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు, మోంగ్‌ మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు.  ‘‘నిజానికి ఏదైనా మార్పు తేవడానికి ఒక మనిషి చాలు’’ అని అనేది కెల్లీ విశ్వాసం. 2018లో ‘మిసెస్‌ మిన్నెసోటా’ అందాల పోటీలో పాల్గొని, టైటిల్‌ గెలుచుకున్నారు. ‘‘మోంగ్‌ వర్గానికి ప్రతినిధిగానే నేను ఈ పోటీలో పాల్గొన్నాను. దీని వెనుక ఉద్దేశం మోంగ్‌ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడం, తమ రూపం గురించి న్యూనత పోగొట్టుకొనేలా చెయ్యడం’’ అని ఆమె స్పష్టం చేశారు. జాతి వివక్ష మనుషులను ఎంత కుంగదీస్తుందో, అల్ప సంఖ్యాకవర్గాల వారి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో ఆమెకు తెలుసు. అందుకే జార్జి ఫ్లాయిడ్‌  ప్రాణాలు పోడానికి తన భర్త కారకుడయ్యాడని తెలిసి ఆమె నిర్ఘాంతపోయారు. డెరెక్‌ తను అనుకున్నంత సౌమ్యుడూ, పెద్దమనిషీ ఏమాత్రం కాడని గ్రహించారు. వెంటనే విడాకులకు దరఖాస్తు చేశారు. 


విడాకులకు సిద్ధమైంది!

నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానికి తన భర్త కారణమైన సంఘటన తరువాత కెల్లీ బయటకు రాలేదు. స్వయంగా ఏమీ మాట్లాడలేదు. అయితే, కెల్లీ తరఫున ఆమె న్యాయవాదులు మాట్లాడుతూ ‘‘ఫ్లాయిడ్‌ మరణ వార్త విని ఆమె తల్లడిల్లారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నారు. ఈ విషాదం గురించి విని కన్నీరు కారుస్తున్న ప్రతిఒక్కరికీ, ఫ్లాయిడ్‌ సన్నిహితులకూ సంఘీభావం తెలిపారు. డెరిక్‌, కెల్లీలకు పిల్లలు లేరు. ఈ క్లిష్టమైన సమయంలో తన, తన (మొదటి వివాహం ద్వారా కలిగిన) పిల్లలు, వృద్ధులైన తన తల్లితండ్రుల భద్రతకూ, వ్యక్తిగత గోప్యతకూ భంగం కలిగించవద్దని ఆమె అందరినీ కోరుతున్నారు’’ అని ప్రకటించారు. 


అయినవాళ్ళు ఎన్ని నేరాలూ, ఘోరాలూ చేసినా వెనకేసుకు వచ్చి, ఎదుటివారి మీద నిందలతో విరుచుకుపడే ధోరణి కొనసాగుతున్న ఈ ప్రపంచంలో కెల్లీ లాంటి వారు కోటికొక్కరు కూడా ఉండరేమో! అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆమెను అభినందిస్తున్నారు. నమ్మిన విలువలకు కట్టుబడిన ఆమె భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొని ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.


జరిగిన కథ

కిందటి నెల 25న జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఒక నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లాయిడ్‌ను బంధించి తీసుకువెళ్ళే క్రమంలో పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌ అతడిని నేలకు గట్టిగా అదిమి పట్టి, మెడ మీద మోకాలితో తొక్కి ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. ‘‘ఊపిరాడడం లేదు, వదలండి ప్లీజ్‌!’’ అంటూ ఫ్లాయిడ్‌ వేడుకున్నా కనికరించలేదు. దాదాపు 8 నిమిషాలకు పైగా సాగిన ఈ దురాగతాన్ని చూపించే వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు అమెరికా అట్టుడుకుతోంది. 


ట్రంప్‌ కుమార్తె సైతం...

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ, ఉవ్వెత్తున ఎగసిపడిన ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫానీ మద్దతు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బ్లాక్‌ స్ర్కీన్‌ను షేర్‌ చేస్తూ, ‘ఒంటరిగా కొంతే సాధించగలం. కలిసి ఉంటే అద్భుతాలు చేయగలం’ అన్న హెలెన్‌ కెల్లెర్‌ మాటలను కోట్‌ చేశారు. అంతేకాదు ‘జస్టిస్‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌‘, ‘బ్లాకౌట్‌ ట్యూజ్‌డే’ హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె షేర్‌ చేశారు. 


Updated Date - 2020-06-07T13:58:40+05:30 IST